మా అభిమాన తారలెవరంటే...

యావద్దేశాన్నీ టీవీల ముందు కూర్చోబెట్టే క్రికెటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జనాల్లో వాళ్లకుండే క్రేజే వేరు. మరి అలాంటి వాళ్లు తాము కళ్లప్పగించి చూసే తారలు ఎవరో చెబుతున్నారిలా.

Published : 23 Oct 2022 00:44 IST

మా అభిమాన తారలెవరంటే...

యావద్దేశాన్నీ టీవీల ముందు కూర్చోబెట్టే క్రికెటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జనాల్లో వాళ్లకుండే క్రేజే వేరు. మరి అలాంటి వాళ్లు తాము కళ్లప్పగించి చూసే తారలు ఎవరో చెబుతున్నారిలా.


కళ్లతోనే నటిస్తుంది
- రోహిత్‌ శర్మ

బాధలో ఉన్నా, పట్టలేని సంతోషాన్ని ఆస్వాదిస్తున్నా... సినిమా చూడ్డం నాకు అలవాటు. మ్యాచ్‌లు లేనప్పుడు స్నేహితులతో కలిసి థియేటర్‌కి వెళ్లి మరీ చూస్తుంటా. అలా కరీనా కపూర్‌ నటనకు ఫిదా అయ్యా. ఆమె నా ఫస్ట్‌ క్రష్‌ కూడా. తను నటించిన ‘తలాశ్‌’ ఎన్నిసార్లు చూశానో. కరీనా కళ్లతో నటిస్తుంది. ఆమె హావభావాలు చాలా బాగుంటాయి. ప్రయాణాల్లో ఉంటే కరీనా సినిమాలే చూస్తుంటా.


ఐశ్వర్యకి పడిపోయా
- విరాట్‌ కోహ్లీ

సినిమాలంటే నాకు చాలా ఇష్టం. వాటికి సంబంధించి ఏ ప్రశ్న వేసినా టకటకా సమాధానం చెప్పేస్తుంటా. 2005లో వచ్చిన ‘బంటీ ఔర్‌ బబ్లీ’లోని కాజరారే... పాటలో ఐశ్వర్యరాయ్‌ని చూశాక ఆమెకి పడిపోయా. తనే నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ హీరోయిన్‌. అనుష్క ద్వారా ఐశ్వర్య ఫ్యామిలీ ఫ్రెండ్‌ అయింది. తనకెప్పుడూ ఆ విషయాన్ని గుర్తు చేస్తుంటా.


ఆమెని ఫాలో అవుతా
- హార్దిక్‌ పాండ్యా

దీపిక పదుకొణె సినిమాలు ఎక్కువగా చూస్తుంటా. ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘పద్మావత్‌’ సినిమాల్లోని పాత్రలు తనతో ప్రేమలో పడేశాయి. అప్పట్నుంచీ ఆమె గురించి తెలుసుకోవడం మొదలుపెట్టా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ఆమె తీరూ, కష్టపడే తత్వమూ బాగా నచ్చాయి. దీపిక నా మ్యాచ్‌లు ఫాలో అవుతుందో లేదో తెలియదుగానీ నేను ఆమె సినిమాలు మిస్‌ కాను. తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌నీ గమనిస్తుంటా.


ఆయన్ని హత్తుకోవాలి
- జస్‌ప్రీత్‌ బుమ్రా

‘పింక్‌’  సినిమా చూశాక అమితాబ్‌ బచ్చన్‌ను ఆరాధించడం మొదలుపెట్టా. మా ఇంట్లో వాళ్లకీ ఆ సినిమాను చూపించా. బచ్చన్‌ సాబ్‌ని ఒక్కసారైనా హత్తుకోవాలనేది నా కోరిక. ఆయన డైలాగ్‌ డెలివరీ, నటనా ఎంత బాగుంటాయో. తీరిక దొరికినప్పుడు ఆయన ఇంటర్వ్యూలూ, కౌన్‌ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం చూస్తుంటా. ఏడు పదుల వయసులోనూ కుర్రాడిలా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఆ విషయంలో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని... వయసు మీద పడ్డాక నేనూ అలాగే ఉండాలనుకుంటున్నా.


ఆ ఆత్మవిశ్వాసానికి ఫిదా
- కేఎల్‌ రాహుల్‌

లైకా అరోరా నాకు చాలా ఇష్టం. కేవలం సినిమాల కోణంలోనే తనని చూడను. జీవితాన్ని తనకు నచ్చినట్టే జీవిస్తుంది. ఎవరి ప్రభావం తన మీద పడకుండా చూసుకుంటుంది. నలభైల్లోనూ ఫిట్‌గా ఉండే ఆమె జీవనశైలిని గమనిస్తుంటా. యోగా, డైట్‌ విషయంలో పక్కాగా ఉంటుంది. వాటన్నిటితోపాటు ఎలాంటి సందర్భంలోనూ కుంగిపోదు. ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. అందుకే మలైకా అంటే చాలా ఇష్టం.


షారుఖ్‌కి వీరాభిమానిని  
- రిషభ్‌పంత్‌

క్రీడాకారుణ్ని అవ్వాలనేది చిన్నప్పట్నుంచీ నా కల. చదువు మీద తప్ప ఆటలకు సంబంధించిన అన్నింటి మీదా ఆసక్తి ఎక్కువేే ఉండేది. నా పదేళ్ల వయసులో వచ్చిన ‘చక్‌ దే ఇండియా’ చూసి షారుఖ్‌ ఖాన్‌కి వీరాభిమానినయ్యా. విడుదలైన ఆయన ప్రతి సినిమా చూస్తుంటా. షారుఖ్‌ సినిమాలతోపాటు క్రికెట్‌ నేపథ్యంలో వచ్చినవి- భాష ఏదైనా చూసేస్తుంటా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..