Updated : 26 Dec 2021 05:57 IST

గూగుల్‌లో ఈ ఏడాది ఏం వెతికారంటే..

‘దగ్గర్లో హోటల్‌ ఎక్కడుందబ్బా?’ ‘కొత్త వైరస్‌ రకం వస్తోందా... దాని విషయాలేంటో?’ ‘ఆపిల్‌ కొత్త సిరీస్‌ ఫీచర్లేంటీ...’ ఇలా ఎవరికి ఎలాంటి సందేహం వచ్చినా గూగుల్‌ని అడిగేస్తాం. క్షణాల్లో ఆ వివరాల్ని తెలుసుకుంటాం. అందరి ప్రశ్నలకూ జవాబులు చెప్పేసే గూగుల్‌లో 2021 ఏడాది మొత్తంలో భారతీయులు ఎక్కువగా సెర్చ్‌ చేసిందేంటో... అత్యధికంగా అడిగిన సందేహాలేంటో... ఆకట్టుకున్న విషయాలేంటో... ఒకసారి చదివేద్దామా!

మనవాళ్లకు అన్నింటి కన్నా ఎక్కువగా ఏది ఇష్టం అంటే... క్రికెట్‌ అని చెప్పేయొచ్చు. ‘కచ్చితంగా అలా ఎలా చెబుతారు’ అంటారేమో, ఇదేమీ ఉత్తుత్తి నోటి మాట కాదండోయ్‌... టాప్‌ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ సర్వేలో బయటపడింది. ఏటా గూగుల్‌ ‘ఇయర్‌ ఇన్‌ సెర్చ్‌’ పేరుతో ఆ ఏడాదిలో ఎక్కువగా వెతికిన విషయాలను విడుదల చేస్తుంది. అలా 2021లో భారతీయులు అత్యధికంగా గూగుల్‌ చేసినవాటిలో మొట్ట మొదటగా నిలిచింది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌). దాని తర్వాత స్థానాన్ని కరోనా టీకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘కొవిన్‌’ ఆప్‌ సొంతం చేసుకుంది.

క్రీడా ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్న ‘ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌’, యూరోపియన్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ యూరో కప్‌’, ‘టోక్యో ఒలింపిక్స్‌’ వరసగా మూడు, నాలుగు, అయిదు స్థానాల్లో నిలిచాయి. అన్ని రంగాల్లో టాప్‌ ఐదు ర్యాంకుల్లో ఉన్నవి ఇవే. ఇక ఎక్కువగా అన్వేషించిన వార్తల సంగతికి వస్తే, చాలామంది సెర్చ్‌ చేసిన వాటిల్లో మొదటి అయిదు ఏంటంటే... టోక్యో ఒలింపిక్స్‌, బ్లాక్‌ ఫంగస్‌, అఫ్గనిస్తాన్‌ వార్తలు, పశ్చిమ్‌ బంగ ఎన్నికలు, తౌక్టే తుపాను. ప్రాంతీయ సినిమానే ఫస్ట్‌!
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘జైభీమ్‌’ సినిమా గురించి 2021లో ఇండియన్లు ఎక్కువగా వెతికారు. తమిళం, తెలుగు భాషల్లో ఓటీటీలో విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుందీ చిత్రం. దీని తర్వాత ఎక్కువమంది అన్వేషించిన సినిమా ‘షేర్షా’. భారత సైన్యంలో విశేష సేవలందించి, ప్రాణ త్యాగం చేసిన ‘కెప్టెన్‌ విక్రమ్‌ బాత్రా’ జీవిత కథతో తీసిన హిందీ చిత్రం ఇది. దీనికీ మంచి ఆదరణే వచ్చింది. వీటి తర్వాత స్థానాల్లో బాలీవుడ్‌ చిత్రాలు ‘రాధే’, ‘బెల్‌ బాటమ్‌’... హాలీవుడ్‌ మూవీ ‘ఎటర్నల్స్‌’ ఉన్నాయి. 2014లో వచ్చిన సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ ‘దృశ్యం’ థ్రిల్లర్‌ మూవీకి కొనసాగింపుగా ఈ ఏడాది విడుదలైన ‘దృశ్యం 2’ తొమ్మిదో స్థానంలో ఉంది.

ఎవరిని ఎక్కువగా వెతికారు?
టోక్యో ఒలింపిక్స్‌తో జావెలిన్‌ త్రోలో విజేతగా నిలిచిన నీరజ్‌ చోప్రా గురించి ఈ ఏడాది చాలామంది చదివారు. భారత ఒలింపిక్స్‌ చరిత్రలో అథ్లెటిక్స్‌ విభాగంలో తొలి వ్యక్తిగత స్వర్ణం సాధించిన నీరజ్‌ చోప్రానే ‘మోస్ట్‌ సెర్చ్‌డ్‌ పర్సన్‌’ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానంలో బాలీవుడ్‌ హీరో షారూక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ గురించి ఎక్కువగా సెర్చ్‌ చేశారు నెటిజన్లు. డ్రగ్స్‌ ఆరోపణల కేసులో అరెస్టై కొద్దిరోజులు జైలులో ఉన్న ఆర్యన్‌ గురించి చాలామంది వాకబు చేశారు. పంజాబీ నటీ, మోడల్‌ షెహనాజ్‌ గిల్‌, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా, ప్రముఖ వ్యాపార వేత్త, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ వరసగా మూడూ, నాలుగూ, అయిదూ స్థానాల్లో ఉన్నారు.

మన సింధు!
మనదేశానికి రెండు ఒలింపిక్‌ పతకాలు తీసుకొచ్చిన పీవీ సింధు గురించి కూడా నెటిజన్లు ఎక్కువగానే గూగుల్‌ చేశారు. అత్యధికంగా వెతికిన వ్యక్తుల్లో సింధు ఏడో స్థానంలో ఉంది.

అంతా కొవిడ్‌ కోసమే!
ఏదైనా విషయం గురించి తెలుసుకోవడానికీ.. అదేంటో కనుక్కోవడానికీ... మనకు దగ్గర్లో ఎక్కడుందో వెతకడానికీ... ‘హౌటూ, వాట్‌ ఈజ్‌, నియర్‌ మీ’ అంటూ సెర్చ్‌ చేస్తుంటాం కదా! ఈ ప్రశ్నల్లో ఎక్కువగా వెతికిన అంశాలు కొవిడ్‌కు సంబంధించినవే ఉన్నాయి. కొవిడ్‌ వ్యాక్సిన్‌ దగ్గర్లో ఎక్కడుంది... పరీక్ష ఎక్కడ చేస్తారు... ఆక్సిజన్‌ సిలిండర్‌, కొవిడ్‌ ఆసుపత్రి దరిదాపుల్లో ఎక్కడున్నాయి లాంటివి. అలాగే కొవిడ్‌ వ్యాక్సిన్‌కి ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలి... ఆ సర్టిఫికెట్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేయాలి... ఆక్సిజన్‌ స్థాయులు ఎలా పెంచుకోవాలి... బ్లాక్‌ ఫంగస్‌ అంటే ఏంటి... అంటూ వెతికేశారు. ఇక అధికంగా సెర్చ్‌ చేసిన వంటలేమో ఎనోకి మష్రూమ్‌, మోదక్‌, మేతీ మటర్‌ మలయ్‌, పాలక్‌, చికెన్‌ సూప్‌.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని