పండగ చేసుకుందామా!

సంక్రాంతి అనగానే పిండివంటల్లో అరిసెలు... నైవేద్యానికి పొంగలి... తప్పనిసరిగా ఉంటాయి. అవి కాకుండా... ఆ రోజున ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తుంటే మాత్రం వీటినీ చూసేయండోసారి.

Updated : 15 Jan 2023 03:22 IST

పండగ చేసుకుందామా!

సంక్రాంతి అనగానే పిండివంటల్లో అరిసెలు... నైవేద్యానికి పొంగలి... తప్పనిసరిగా ఉంటాయి. అవి కాకుండా... ఆ రోజున ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తుంటే మాత్రం వీటినీ చూసేయండోసారి. స్వీటూ, హాటూ, మేళవింపుతో నోరూరిస్తున్న ఈ వంటకాలను వండి వడ్డిస్తే పండగ విందుకు నిండుదనం వచ్చేసినట్లే... ఏమంటారూ!


బియ్యప్పిండి హల్వా

కావలసినవి: బియ్యప్పిండి: కప్పు, బెల్లం తరుగు: ఒకటిన్నర కప్పు, చిక్కని కొబ్బరిపాలు: కప్పు, పల్చని కొబ్బరిపాలు: మూడుకప్పులు, యాలకులపొడి: చెంచా, నెయ్యి: పావుకప్పు, జీడిపప్పు పలుకులు: పావుకప్పు.  

తయారీ విధానం: స్టౌమీద కడాయిని పెట్టి టేబుల్‌స్పూను నెయ్యి వేసి జీడిపప్పు పలుకుల్ని వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో పల్చని కొబ్బరిపాలు, బెల్లం తరుగు వేసుకుని స్టౌని సిమ్‌లో పెట్టి కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగాక బియ్యప్పిండి వేసి ఉండలు కట్టకుండా కలపాలి. తరువాత ఇందులో చిక్కని కొబ్బరిపాలు పోసి కలుపుతూ ఉండాలి. అయిదు నిమిషాలయ్యాక యాలకులపొడి, వేయించిన జీడిపప్పు పలుకులూ మిగిలిన నెయ్యి వేసి కలిపి దగ్గరకు అవుతున్నప్పుడు దింపేయాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులో పరిచి కొద్దిగా చల్లారాక ముక్కల్లా కోయాలి.


అటుకుల బొండా

కావలసినవి: మందంగా ఉండే అటుకులు: కప్పు, ఉల్లిపాయ: ఒకటి, ఉడికించిన బంగాళాదుంప: ఒకటి, అల్లంపేస్టు: అరచెంచా, పచ్చిమిర్చి తరుగు: చెంచా, కొత్తిమీర తరుగు: రెండు పెద్ద చెంచాలు, కరివేపాకు రెబ్బలు: రెండు, కారం: అరచెంచా, వాము: అరచెంచా, ఉప్పు: తగినంత, బరకగా చేసుకున్న పల్లీలపొడి: రెండు టేబుల్‌స్పూన్లు, సెనగపిండి: మూడు టేబుల్‌స్పూన్లు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: అటుకుల్ని కడిగి ఓ గిన్నెలో వేసి పెట్టుకోవాలి. పది నిమిషాల తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి మరీ గట్టిగా ఉందనుకుంటే.. కాసిని నీళ్లు చల్లుకోవచ్చు. ఇలా చేసుకున్న పిండిని కాగుతున్న నూనెలో బొండాల్లా వేసుకుంటూ ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.  


పల్లీ-కొబ్బరి లడ్డు

కావలసినవి: పల్లీలు: కప్పు, ఎండుకొబ్బరిపొడి: కప్పు, నువ్వులు: అరకప్పు, బెల్లంపొడి: కప్పు, శొంఠిపొడి: పావుచెంచా, నెయ్యి: అరకప్పు.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి పల్లీలు, నువ్వుల్ని విడివిడిగా వేయించుకుని తీసుకోవాలి. పల్లీల పొట్టు తీసి మిక్సీలో వేసుకోవాలి. ఇందులో నువ్వులు కూడా వేసి బరకగా పొడిచేసుకుని ఓ గిన్నెలో తీసుకోవాలి. తరువాత నెయ్యి తప్ప మిగిలిన పదార్థాలను కూడా వేసుకుని మరోసారి కలపాలి. ఈ మిశ్రమంలో కరిగించిన నెయ్యి వేస్తూ లడ్డూల్లా చుట్టుకోవాలి.  


మినప్పప్పు మసాలా వడ

కావలసినవి: పొట్టు మినప్పప్పు: కప్పు, పచ్చిమిర్చి: అయిదు, అల్లం: చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు: ఎనిమిది, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు, మెంతికూర తరుగు: పావుకప్పు, కొత్తిమీర తరుగు: పావుకప్పు, వాము: చెంచా, పసుపు: అరచెంచా, ఉప్పు: తగినంత, కారం: చెంచా, దనియాలపొడి: చెంచా, నూనె: వేయించేందుకు సరిపడా.  

తయారీ విధానం: మినప్పప్పును నాలుగైదు గంటల ముందు నానబెట్టుకోవాలి. ఆ తరువాత చాలా కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మెత్తగా గారెల పిండిలా రుబ్బుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుతోపాటు నూనె తప్ప మిగిలిన పదార్థాలను పిండిలో కలిపి తరువాత వడల్లా చేసుకుంటూ కాగుతున్న నూనెలో వేస్తూ ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..