ఒట్టు.. ఇవి మట్టి నగలు!
లక్ష్మీదేవి బొమ్మలతో ఉన్న టెంపుల్ జ్యువెలరీతో పాటు, కాసుల పేరూ, పచ్చల హారాలూ, మామిడి పిందెల నెక్లెస్‌లూ... వీటిని చూస్తుంటే బంగారు నగలు భలే ఉన్నాయనిపిస్తోంది కదూ... అయితే, మీరు పొరబడినట్లే. ఎందుకంటే ఇవన్నీ మట్టి నగలు.
పండుగలూ పెళ్లిళ్లకు పట్టు చీరలూ పరికిణీల మీద బంగారు నగల్ని అలంకరించుకుంటే సంప్రదాయమూ సౌందర్యమూ కలబోసిన పుత్తడిబొమ్మ కదిలి వస్తున్నట్లే ఉంటుంది. అయితే, ఇదివరకటి రోజుల్లో ఓ హారం, ఒక నెక్లెస్, రెండు జతల పెద్ద జుంకాలూ ఉంటే వాటినే ప్రతి సందర్భానికీ అలంకరించుకునేవారు. కానీ ఇప్పుడలా కాదు. గత ఏడాది దీపావళికి వేసుకున్న హారం ఈ ఏడాది దీపావళికి వేసుకోవాలంటే మనసొప్పదు. ఎంగేజ్మెంట్కి పెట్టుకున్న నెక్లెస్‌ని పెళ్లికి పెట్టుకోవాలన్నా ‘ఫొటోల్లో మళ్లీ అదే కనిపిస్తుందిగా’ అనిపిస్తుంది. పండగైనా, ప్రత్యేక సందర్భమైనా ఆ ఫొటోలన్నీ సోషల్‌మీడియా గోడలకెక్కించడం ఈతరం విధిగా పాటిస్తున్న ట్రెండ్ మరి. అందులో ప్రతిసారీ విభిన్నంగా కనిపించాలంటే ఎప్పటికప్పుడు కొత్త ఆభరణం కావాల్సిందే. అసలే పుత్తడి ధర ఆకాశాన్నంటుతున్నవేళ అన్నేసి బంగారు నగల్ని కొనడమూ అసాధ్యమే. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చినవే ఈ ‘యాంటిక్ గోల్డ్ కోటింగ్ టెర్రకోట జ్యువెలరీ’. పేరుకి ఇవి మట్టి నగలు కానీ చెబితే కానీ ఆ విషయం తెలియకపోవడం వీటి ప్రత్యేకత. అంతలా కళ్లను మోసం చేస్తాయి.
అందంగా ట్రెండీగా..
బంగారు నగల్లో వస్తున్న లేటెస్ట్ డిజైన్లైన రామ పరివార్, టెంపుల్ జ్యువెలరీ, కాసులూ... వంటివన్నీ మట్టి నగల్లోనూ తయారుచేస్తున్నారు. దీనికోసం మట్టితో ఆయా రూపాలను అందంగా తీర్చిదిద్ది, తర్వాత ఎక్కువ ఉష్ణోగ్రతల్లో కాల్చుతారు. చల్లారాక నగల్లోని డిజైన్లకు అనుగుణంగా బంగరు వర్ణాన్ని పూతగా పూస్తారు. అవసరమైనచోట సహజాతి రత్నాలనూ కుందన్లనూ కూడా అంటించి వీటిని పూర్తిగా బంగారు నగలను పోలి ఉండేలా రూపొందిస్తారు. దాంతో వీటిని వేసుకుంటే చూసినవాళ్లు ‘ఎన్ని తులాలు పెట్టి చేయించావు వదినా..’ అంటూ ఆరాతీయడం ఖాయం. అప్పుడు మనం ‘ఇది బంగారం కాదు మట్టి...’ అని చెబితే ఆశ్చర్యంతో కళ్లు మరింత పెద్దవిగా చేసుకుని, నమ్మలేనట్టుగా చేత్తో పట్టుకుని మరీ చూస్తారనడమూ అతిశయోక్తి కాదు. అలా అవాక్కవ్వడమేగా మనక్కావల్సిందీ. పైగా మట్టినగల్ని వేసుకోవడం ఇప్పుడో క్రేజ్. అన్నట్లూ వన్‌గ్రామ్ గోల్డ్ నగలు వేసుకుంటే కొందరికి చర్మం మీద అలర్జీ లాంటివి వస్తుంటాయి. మట్టి నగలతో ఆ సమస్యా ఉండదు. మీకూ నచ్చాయా..?
అతుకుల అందం అదిరింది!
పక్కఊరి బామ్మగారి పోచంపల్లి జాకెట్టు కుట్టేటప్పుడు మిగిలిపోయిన ముక్కా, ఎదురింటి చిన్నూగాడికి చొక్కా కుట్టగా ఉన్న మరో డిజైన్ క్లాతూ వీధి చివర రావుగారమ్మాయికి చుడీదార్ కుట్టినప్పుడు మిగిలిన వస్త్రం... ఇలా రకరకాల గుడ్డ ముక్కలను కలిపి ఓ షర్టుని కుట్టాడు టైలర్ మోహన్. అది చూసి కాలేజీకెళ్లే అతని కొడుకు ‘నాన్నా ఇది లేటెస్ట్ ప్యాచ్‌వర్క్ ఫ్యాషన్’ అంటూ ఎగిరి గంతేశాడు. పేదలు సృష్టించినా విలాసవంతమైన బ్రాండ్ల వరకూ వెళ్లిన ఈ ఫ్యాషన్పైన ఓ లుక్కేద్దామా..?
వెలిసిపోయినట్లున్న ఫేడెడ్ జీన్స్, చిరుగులున్న రిప్డ్ జీన్స్... క్రేజీ ఫ్యాషన్‌గా ఇప్పటికే ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఇప్పుడేమో రకరకాల ముక్కలతో అతికిన ప్యాచ్‌వర్క్ ఫ్యాషన్ హాట్ హాట్ ట్రెండ్‌గా తెరమీదికొచ్చేసింది. ‘ఈ అతుకులేంటీ... ఇదివరకు కొత్త బట్టలు కొనుక్కునే స్థోమత లేకపోతే చిరుగులు కనిపించకుండా ఇలా గుడ్డముక్కలు అతికి వేసుకునేవాళ్లు’ అని బామ్మలు అనొచ్చుగాక. నిజమే ప్యాచ్‌వర్క్ అలా పుట్టుకొచ్చిందే. ఇది అయిదువేల సంవత్సరాల కిందట ఈజిప్టువాసులు సృష్టించింది. 11-13 శతాబ్దాల మధ్య ఐరోపా దేశాల్లోకీ వచ్చింది. అప్పట్లో చలిని తట్టుకోవడానికి పాత దుస్తులను ముక్కలుగా చేసి వాటితో మూడు పొరల్లో మందపాటి దుప్పట్లను కుట్టుకోవడం మొదలుపెట్టారట. క్విల్ట్‌లుగా పిలిచే వీటికి ఇప్పటికీ అమెరికా ఐరోపా దేశాల్లో ఎంతో డిమాండ్ ఉంది. భారత్‌లోనూ ఈ తరహా దుప్పట్లూ దుస్తులను గిరిజనులు ప్రాచీన కాలం నుంచే తయారు చేస్తున్నారు. కర్ణాటకలోని కౌది గ్రామంలో ప్యాచ్‌వర్క్‌తో చేసే కౌది దుప్పట్లకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక, ప్రస్తుతానికొస్తే.. ఈ ఏడాది టాప్ ఫ్యాషన్లలో అగ్రతాంబూలం ప్యాచ్వర్క్దే. అందుకే, లూయీ వూటన్, బర్బరీ, గుచి, పోలో, లీవైస్.. వంటి ప్రముఖ బ్రాండ్లు ఎన్నో అబ్బాయిలూ అమ్మాయిల దుస్తుల్లో ప్యాచ్వర్క్ని చొప్పించి మార్కెట్లోకి తీసుకొచ్చేశాయి. మ్యాచ్ అయ్యే డిజైన్లూ రంగుల క్లాత్‌లను ఎంపిక చేసుకుని తీరుగా కత్తిరించి కుట్టాలి గానీ ఆ అతుకుల డిజైన్లే బోలెడంత అందంగా కనిపిస్తాయని ఇవి రుజువు చేస్తున్నాయి.
క్రేజీగా అందంగా..
మామూలుగా అబ్బాయిల షర్టులంటే అయితే చెక్స్ లేదా సాదా రంగూ చిన్న చిన్న బుటీలే ఎక్కువగా కనిపిస్తాయి. దాంతో బోర్ కొట్టేస్తుంటుంది. కానీ వేరు వేరు రకాలూ రంగుల డిజైన్లున్న క్లాత్‌లను కలిపి కుట్టి వస్తున్న ప్యాచ్‌వర్క్ షర్టులూ రెయిన్
కోటులూ స్వెట్ షర్టులు మాత్రం చాలా కొత్తగా క్రేజీగా కనిపిస్తున్నాయి. ఈతరం కుర్రకారుకి ఇంతకన్నా కావాల్సింది ఏముందీ... మరో విషయం ఏంటంటే... చాలా ఫ్యాషన్లలా ప్యాచ్‌వర్క్ కేవలం మోడ్రన్ దుస్తులకే పరిమితం కాలేదు. అటు జీన్సుల్లోనూ ఇటు సంప్రదాయ చుడీదార్లూ, చీరలూ, స్కార్ఫ్లూ, దుపట్టాలూ, ఆఖరికి బ్లౌజుల్లో కూడా ఈ అతుకుల ఫ్యాషన్ అదరగొట్టేస్తోంది.
అన్నట్లూ... ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి మేలు చేసే ఫ్యాషన్ ఏదైనా ఉందంటే అది ఈ ప్యాచ్‌వర్క్ ఫ్యాషనే. దీనివల్ల వృథాగా పడేసే లక్షల టన్నుల వస్త్రాలను మళ్లీ ఉపయోగించుకునే అవకాశం ఉంది.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్