చనిపోయేలోపు ఆ కోరిక తీర్చుకుంటా

భీమ్లానాయక్‌తో టాలీవుడ్‌లో అడుగుపెట్టి.. డానియెల్‌ శేఖర్‌ భార్యగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది సంయుక్త మేనన్‌. ఆ తరవాత వరుసగా అవకాశాల్ని సొంతం చేసుకుంటున్న ఈ కేరళ కుట్టి ‘బింబిసార’లో అలరించబోతున్న

Updated : 31 Jul 2022 10:40 IST

చనిపోయేలోపు ఆ కోరిక తీర్చుకుంటా

భీమ్లానాయక్‌తో టాలీవుడ్‌లో అడుగుపెట్టి.. డానియెల్‌ శేఖర్‌ భార్యగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది సంయుక్త మేనన్‌. ఆ తరవాత వరుసగా అవకాశాల్ని సొంతం చేసుకుంటున్న ఈ కేరళ కుట్టి ‘బింబిసార’లో అలరించబోతున్న సందర్భంగా తన గురించి చెబుతోందిలా... 

నేపథ్యం

మాది కేరళలోని పాలక్కాడు దగ్గర ఓ చిన్నపల్లెటూరు. అమ్మ ఎంతో కష్టపడి నన్ను పెంచింది. ఆమె కష్టాన్ని చూస్తూ పెరిగిన నేను బాగా స్థిరపడి అమ్మను సంతోషంగా ఉంచాలని కలలు కనేదాన్ని.


మొదటి ఛాన్స్‌

ఇంటర్‌లో ఉన్నప్పుడు ఓ ఫొటోగ్రాఫర్‌ ఫేస్‌బుక్‌లోని నా ఫొటోల్ని ఒక మ్యాగజైన్‌ కవరుపైన ప్రచురించాడు. అలా నన్ను చూసిన మలయాళ దర్శకుడు ‘పాప్‌కార్న్‌’ సినిమాలో అవకాశమిచ్చారు. క్రమంగా పేరు రావడంతోపాటు దుల్కర్‌ సల్మాన్, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ వంటి అగ్ర హీరోల పక్కన అవకాశాలు వచ్చాయి.ప్రస్తుతం మలయాళం, తెలుగు, కన్నడల్లోనూ నటిస్తున్నా. 


ఎన్నిసార్లు చూశానో

‘అల వైకుంఠపురం’ నాకు బాగా నచ్చిన సినిమా. లాక్‌డౌన్‌లో ఎన్నిసార్లు చూశానో. అందులో టైటిల్‌ సాంగ్‌ చాలా ఇష్టం. అలానే చిన్నప్పుడు మమ్ముట్టి సినిమాలు ఎక్కువగా చూడటం వల్ల ఆయనకు వీరాభిమానినయ్యా.


ఇష్టంగా తింటా

నాకు హైదరాబాదీ బిర్యానీ, చేపలకూర చాలా ఇష్టం. హైదరాబాద్‌ వస్తే బిర్యానీ తినకుండా ఇక్కడి నుంచి అస్సలు కదలను. అలానే ఎవరింటికైనా వెళ్లినప్పుడు నాకు చేపల కూర వండి పెట్టారంటే వాళ్లని ఎప్పటికీ మర్చిపోను.


మెచ్చుకున్నారు

‘భీమ్లానాయక్‌’లో అవకాశం అనగానే మొదట నేను తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టా. నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెబుతాననీ అడిగా. ఆ సినిమా వేడుకలో నేను తెలుగులో మాట్లాడితే పవన్‌కల్యాణ్‌ సర్‌ ఎంతో మెచ్చుకున్నారు. దాని తరవాత వచ్చిన ‘కడువా’ కూడా మంచి పేరు తెచ్చింది.


అదో సవాలు

‘భీమ్లానాయక్‌’ క్లైమాక్స్‌లో హీరోలిద్దరి ఫైట్‌ ఆపడానికి ‘అన్నా...’ అని గట్టిగా అరుచుకుంటూ వెళ్లే సీన్‌ టేక్‌ తీసుకోకుండా చేయాలన్నారు. ఒకవేళ టేక్‌ తీసుకుంటే హీరోలు మళ్లీ మొదట్నుంచీ ఫైట్‌ సీన్‌ చేయాల్సి ఉంటుంది. పైగా అది ఎమోషనల్‌ సీన్‌ కూడా. చాలా భయపడుతూ చేశా.


పేరు తెలియదు

చాలామందికి ‘భీమ్లానాయక్‌’లో నా పాత్ర పేరు ‘కమలి’ అని తెలియదు. డానియెల్‌ శేఖర్‌ భార్యగానే నాకు గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ ఎక్కడికెళ్లినా ‘డానియెల్‌ శేఖర్‌ భార్య...’ అనే అంటున్నారు. కొందరైతే ‘మీరు పవన్‌ కల్యాణ్‌ చెల్లి కదా’ అని అడుగుతుంటారు. అందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది.


అవంటే ఇష్టం

చిన్నప్పట్నుంచీ ఎంతో ఇష్టపడిన బీఎమ్‌డబ్ల్యూ కారును ఈ మధ్యనే కొనుక్కున్నా.  దాంతోపాటు రాళ్ల నగలన్నా పిచ్చి. ఎప్పుడుపడితే అప్పుడు కొనేస్తుంటా. అలా డబ్బులు వృథా చేయొద్దని అమ్మ కోప్పడుతుంటుంది.


తరచూ వెళతా

ప్రపంచంలోనే ఎత్తైన తుంగనాథ్‌ శివాలయానికి వెళ్లడం నాకు చాలా ఇష్టం. ఉత్తరాఖండ్‌లో 12,106 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి వెళ్లే దారంతా మంచు పరుచుకున్నట్టుంటుంది. సాహసోపేతమైన ఆ ప్రయాణం నాకెంతో ఉత్సాహాన్నిస్తుంది. వీలు కుదిరినప్పుడల్లా వెళ్లి వస్తుంటా. 


అందుకే టాటూ

నాకు డ్రైవింగ్‌ ఇష్టం. పాటలు వింటూ ఎక్కడికంటే అక్కడికి ఒక్కదాన్నే వెళ్లిపోతుంటా. అందుకే నా వీపు మీద ట్రావెలర్‌ అని టాటూ కూడా వేయించుకున్నా. చనిపోయేలోపు ప్రపంచమంతా చుట్టేయాలన్నదే నా కోరిక. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..