పాతవే... సరికొత్తగా..!

రాత్రి అన్నం మిగిలితే పొద్దున్నే పులిహోరో, ఫ్రైడ్‌ రైసో చేసేస్తాం. అన్నం కదా గబుక్కున పారేయలేం. కానీ మిగిలిన వస్తువుల విషయంలో అలా ఆలోచిస్తున్నామా? అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా కొనడం, వృథాగా పడేయడం ఇప్పుడో అలవాటుగా  మారిపోయిందంటున్నారు నిపుణులు.

Updated : 11 Dec 2022 03:56 IST

పాతవే... సరికొత్తగా..!

రాత్రి అన్నం మిగిలితే పొద్దున్నే పులిహోరో, ఫ్రైడ్‌ రైసో చేసేస్తాం. అన్నం కదా గబుక్కున పారేయలేం. కానీ మిగిలిన వస్తువుల విషయంలో అలా ఆలోచిస్తున్నామా? అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా కొనడం, వృథాగా పడేయడం ఇప్పుడో అలవాటుగా మారిపోయిందంటున్నారు నిపుణులు. మనం కొనే వస్తువుల్లో 99 శాతం ఆర్నెల్లలోగా చెత్తలోకి చేరుతున్నాయనీ, యాభై ఏళ్ల క్రితంతో పోలిస్తే చాలా అంశాల్లో వ్యక్తిగత వినిమయం ఎన్నో రెట్లు పెరిగిందనీ అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. అందుకే భూమాతకు ఈ చెత్త భారం తగ్గించాలంటే ‘రీసైక్లింగ్‌’ కన్నా ముందు ‘అప్‌సైక్లింగ్‌’ గురించి ఆలోచించమంటున్నారు నిపుణులు. దాని కథేమిటో చూద్దామా..!

ల్లు రీమోడల్‌ చేయిస్తారు. వార్డ్‌రోబులూ అల్మారాలూ మార్పించి, రంగులు వేయించి, ఫర్నిచర్‌ కొనేస్తే... కొత్త ఇల్లులా కళకళలాడిపోతుంది. తీసేసిన పాతవన్నీ... చెత్తలోకి చేరతాయి.

ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్‌లో దుస్తులు వస్తుంటే పాతవి మొహం మొత్తేస్తాయి. బీరువా పట్టదు ఏం చేస్తాం... తీసి అవతల పడేయడమే.

ఉద్యోగంలో చేరగానే కొనుక్కున్న కొత్త మోటర్‌సైకిల్‌. పాతదై పోతుంది కానీ పారేయబుద్ధి కాదు. కొన్నేళ్లపాటు వాకిట్లో ఓ మూల దుమ్ము కొట్టుకుపోయి తుప్పుపట్టి... చివరికి అదీ చెత్తలోకే.

ప్రపంచవ్యాప్తంగా ఏటా 212 కోట్ల టన్నుల చెత్త తయారవుతోందంటే కాదూ మరి. పనికి రాని చెత్తేగా... దాన్నీ లెక్కలేయాలా... అంటారా, లెక్కలేయక తప్పని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రపంచం.

ఆ చెత్త అంతా కుప్పల్లో చేరి నీటినీ నేలనీ పరిసరాల్నీ కలుషితం చేస్తూ భూమికి మోయలేని భారంగా మారుతోందన్నది మొదటి కారణం.

ఆయా వస్తువుల తయారీలో వెలువడిన కర్బన వాయువులు కాలుష్యాన్నీ తద్వారా భూతాపాన్నీ పెంచుతున్నాయన్నది రెండోది.

ఈ రెండూ కలిసి మన ఆరోగ్యాల మీద చూపుతున్న ప్రభావం అన్నిటికన్నా ముఖ్యమైనదీ... తీవ్రమైనదీ..!

ఆ ప్రభావాన్ని తగ్గించే ప్రధాన ప్రక్రియల్లో రీసైక్లింగ్‌ ఒకటైతే అప్‌సైక్లింగ్‌ ఇంకోటి. ఈ రెండిటికీ తేడా ఏమిటంటే-. తిరిగి వాడడానికి పనికిరాని వస్తువుల్ని పూర్తిగా కరిగించేసి ఆ పదార్థంతో మరో కొత్త ఉత్పత్తిని తయారుచేసి వినియోగించడాన్ని ‘రీసైక్లింగ్‌’ అనీ, ‘డౌన్‌సైక్లింగ్‌’ అనీ అంటారు. ఉదాహరణకు- వాడిపారేసే ప్లాస్టిక్‌ కవర్లన్నీ సేకరించి వాటిని రీసైకిల్‌ చేసి రోడ్లు వేయడానికీ, పూలకుండీలూ, ఇటుకలూ లాంటి వేర్వేరు వస్తువులు తయారుచేయడానికీ వాడుతున్నారు. అలా కాకుండా వస్తువు భాగాలను విడదీసి,  పాడు చేయకుండా దానికి సృజనాత్మకంగా మరిన్ని హంగులద్ది మరింత విలువైన కొత్త వస్తువులా చేయడాన్ని ‘అప్‌సైక్లింగ్‌’ అంటారు. ఉదాహరణకు- పట్టుచీరని కొన్నేళ్లు కట్టాక విసుగొస్తుంది. దాన్ని అలాగే దాచి ఉంచే బదులు దాంతో పిల్లలకు చక్కని డ్రస్‌ కుట్టిస్తే కొత్తగా ఉండి మరికొన్నేళ్లు ఉపయోగపడుతుంది. ఒకరకంగా దానికి మళ్లీ కొత్త జీవితం లభించినట్లు.

ఇలా ఏ వస్తువునైనా మరింత మెరుగ్గా మార్చి ఇంకొన్నాళ్లు వాడుకుని ‘ఇక అసలు పనికిరాదు’ అనుకున్నప్పుడే దాన్ని రీసైక్లింగ్‌ చేయొచ్చన్నమాట. అందుకే, ఎన్నో వస్తువులు ఇప్పుడు ‘అప్‌సైక్లింగ్‌’ని అందిపుచ్చుకుంటున్నాయి. భూమికీ పర్యావరణానికీ భారం తగ్గిస్తున్నాయి.

ఆ మధ్య ఇండియన్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ బ్యూరో ఆధ్వర్యంలో దేశంలోని పదహారు నగరాల్లో ఓ సర్వే జరిగింది. అందులో పాల్గొన్నవారి ఇళ్లలో ఖాళీగా పడివున్న వస్తువుల విలువ కడితే 78 వేల కోట్ల రూపాయలు ఉంటుందని తేలిందట. అవన్నీ అనవసరంగా కొన్నట్లే కదా.

అప్పటికప్పుడు తీసి పడేయమంటే ఒక్కో ఇంట్లోనూ తక్కువలో తక్కువ 12 జతల బట్టలు ఉంటాయట. మీ ఇంట్లోనూ అదే పరిస్థితా..? అయితే ఇది చూడండి.

వాడిన దుస్తుల్ని అమ్మొచ్చు... కొనుక్కోవచ్చు!

ఏ వస్తువునైనా పునర్వినియోగమూ పూర్తి వినియోగమూ మన సంస్కృతిలో అంతర్లీనంగా ఉండేది. ఉన్నంతలో ఒద్దికగా జీవించేవారు ఒకప్పుడు. అవసరం లేనిదేదీ కొనేవారు కాదు. కానీ ఇప్పుడున్నది వినియోగ సంస్కృతి. అవసరంతో సంబంధం లేకుండా కంటికి నచ్చినవి కొనుక్కోవడం నేటి అలవాటు. దాంతో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న ఫ్యాషన్‌ పరిశ్రమ వ్యర్థాలు పదిశాతం గ్రీన్‌హౌస్‌ గ్యాసెస్‌కి కారణమవుతున్నాయి.

ఆ ప్రభావాన్ని తగ్గించాలని అంతర్జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌లో తొలి ప్రయత్నం మొదలెట్టింది ‘రిఫాష్‌’. ఇళ్లల్లో వ్యర్థంగా పడివున్న దుస్తుల్నీ ఇతర వస్తువుల్నీ సేకరించి బాగుంటే ఉన్నపళాన, లేదంటే వాటితో అందమైన ఇతర దుస్తుల్నీ నగల్నీ బ్యాగుల్నీ ఇంట్లో వినియోగించే వస్తువుల్నీ తయారుచేసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. ఒకసారి వాడేసిన దుస్తులు కదా- రంగు వెలసిపోయి పాతగా కన్పిస్తాయేమో, చవగ్గా ఉంటాయేమో అనుకుంటే పప్పులో కాలేసినట్లే. సరికొత్తగా ఉంటాయి. బయట దుకాణాల్లో ఒకే డిజైన్‌ డ్రెస్‌ వేర్వేరు సైజుల్లో లభ్యమవుతుంది. కానీ ‘రిఫాష్‌’లో అలా కాదు, ప్రతిదీ ఒకే ఒక్క డిజైనర్‌ పీస్‌. అలాంటిదే ఇంకోటి కావాలంటే దొరకదు. దాంతో ఖరీదూ ఎక్కువే. అయినా సరే హాటుకేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

‘రిఫాష్‌’ ఒక్కటే కాదు, ఎటాషీ, బోంబే క్లోజెట్‌ క్లెన్స్‌, ఆల్‌ థింగ్స్‌ ప్రిలవ్డ్‌, ద లోకల్‌ థ్రిఫ్ట్‌, ద వింటేజ్‌, ద పారాడైమ్‌ థ్రిఫ్ట్‌, క్యురేటెడ్‌ ఫైండింగ్స్‌, వింటేజ్‌ లాండ్రీ, స్నాజీ థ్రిఫ్ట్‌... లాంటి సంస్థలెన్నో ఉన్నాయి. వీటిల్లో చాలావరకూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వ్యాపారం చేస్తున్నాయి. అవి సొంతంగా డిజైన్‌ చేసిన అప్‌సైకిల్డ్‌ దుస్తుల్ని అమ్మడమే కాదు, కొన్ని మన దుస్తుల్నీ అమ్మి పెడతాయి. మనం అమ్మాలనుకున్న డ్రెస్‌ని ఫొటో తీసి దాని వివరాలన్నీ రాసి ధర నిర్ణయించి ఆ వెబ్‌సైట్‌లో ఉన్న ఫారం నింపాలి. వాళ్లు దాన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఎవరైనా మనం పెట్టిన డ్రస్‌ని కొనుక్కుంటే మనం నేరుగా దాన్ని వాళ్ల అడ్రసుకే కొరియర్‌ చేయొచ్చు. ‘త్రెడ్‌అప్‌ ఇండియా’ లాంటి స్టోర్స్‌ అయితే క్లీన్‌అప్‌ కిట్‌ పంపిస్తాయి. దాంట్లో మన దగ్గర ఉన్నవన్నీ పెట్టి పంపించేయాలి. వాటిలో వేటిని అమ్మాలో, వేటిని అప్‌సైకిల్‌ చేయాలో సంస్థకి చెందిన డిజైనర్లు నిర్ణయిస్తారు. అమ్ముడైన వాటిని బట్టి సంస్థలు కమిషన్‌ తీసుకుంటాయి. బట్టలు, పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, అలంకరణ వస్తువులు ఏవైనా సరే... ఫరెవర్‌ 21 నుంచి ప్రాదా దాకా బ్రాండెడ్‌ వాటి నుంచి సాధారణ దుస్తుల దాకా; ఈ సెకండ్‌ హ్యాండ్‌ వేదికల మీద లభిస్తున్నాయి. ‘సామాజిక మాధ్యమాల్లో ఇన్‌స్టాగ్రామ్‌ ఆకట్టుకున్నట్లే ఫ్యాషన్‌ రంగంలో సస్టెయినబుల్‌, ఎథికల్‌(ప్రాణులకూ పర్యావరణానికీ హానిచేయని) అన్న పద్ధతులు యువతను ఆకట్టుకుంటున్నాయి, అందుకే సెకండ్‌ హ్యాండ్‌ దుస్తులు తేలిగ్గా అమ్ముడుపోతున్నాయి. వాళ్లు దీన్ని థ్రిఫ్ట్‌ షాపింగ్‌ అంటారు...’ అని చెబుతారు వ్యాపారస్తులు. కొందరికి అలా పాత బట్టలు అమ్మడం ఇష్టం ఉండదు. అలాంటివారు ఉచితంగా ఇచ్చేయొచ్చు. సంస్థ ఆ బట్టల్ని ఉపయోగించుకుని ఇచ్చిన వారి పేరున కొంత మొత్తాన్ని సేవా సంస్థలకు విరాళంగా ఇస్తుంది. మన దగ్గర ఉన్న పనికిరాని వస్తువులని ఉపయోగించి కొత్తగా ఏమేం చేయవచ్చో ఐడియాలు కూడా ఇస్తున్నాయి వీటిల్లో కొన్ని వేదికలు.

ఆహారాన్నీ అప్‌సైకిల్‌ చేయొచ్చు!

గిట్టుబాటు ధర రాలేదని రైతులు తమ ఉత్పత్తుల్ని రోడ్డు పక్కన పారబోయడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ఇలాంటి పలు కారణాల వల్ల ప్రపంచంలో పండుతున్న పంటల్లో ముప్పైశాతం నోటి దాకా చేరడం లేదట! అవును దాదాపు మూడోవంతు దిగుబడులు వ్యర్థాలుగా మారి చెత్తలోకి చేరుతున్నాయని ఐక్యరాజ్యసమితి లెక్కలు చెబుతున్నాయి. దాని విలువ 82 లక్షల కోట్లు ఉంటుందట. ఆరుశాతం గ్రీన్‌హౌస్‌ గ్యాసెస్‌కి కారణమవుతున్న ఆ వ్యర్థాల్లో 14శాతం పొలాల నుంచి దుకాణాలవరకూ చేరే దారిలో వృథా అవుతోంటే 11 శాతం మన ఇళ్లలో, 5 శాతం హోటళ్లూ సూపర్‌ మార్కెట్లలో చెత్తబుట్టలో చేరుతున్నాయట. భూమి, నీరు, పెట్టుబడి, శ్రమ... ఇన్ని కలిస్తే పండే పంటని అంత పెద్ద మొత్తంలో వృథా చేయడం ఆర్థిక వ్యవస్థకి ఎంత నష్టం..! అందుకే ‘అప్‌సైక్లింగ్‌’ ప్రక్రియని ఆహారానికీ వాడుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆహార వ్యర్థాలను తగ్గిస్తే వనరుల మీద ఒత్తిడీ తగ్గి సహజంగానే భూతాపం తగ్గుతుందన్నది వారి సూచన.

మరి ఆహారాన్ని ఎలా అప్‌సైకిల్‌ చేస్తామంటే- ఇళ్లల్లో మనం చేసుకునే పచ్చళ్లూ ఒరుగులూ వడియాలూ చిప్సూ అలాంటివే. సీజన్‌లో లభించేవాటిని ఏదో ఒక రూపంలో సంవత్సరమంతా వాడుకునేందుకు సిద్ధం చేసి ఉంచుకోవడం దాదాపుగా అన్ని దేశాల్లోనూ ఉంది. పండ్ల రసాలూ జామ్‌లూ సూపులూ సాస్‌లూ చేసుకోవడం అందులో భాగమే. ఈరోజుల్లో అలా చేసుకునే తీరిక లేక రెడీమేడ్‌వి కొనుక్కుంటున్నాం. కొనుక్కున్నా, సొంతంగా తయారుచేసుకున్నా ఆహారపదార్థాలను వృథా కాకుండా వినియోగించుకోవడం మన చేతిలోని పని. ప్రభుత్వం విషయానికి వస్తే- మన దగ్గర తరచుగా పారవేసే టొమాటోల సంగతే తీసుకుందాం. వాటిని నిల్వ చేయడానికి శీతల గిడ్డంగులు ఉంటే పారేయాల్సిన పరిస్థితి రాదు. అలాగే ఎక్కడ ఏ పంటలు ఎక్కువగా పండుతున్నాయో చూసి వాటిని వివిధ రకాలైన ఆహార పదార్థాలుగా మలచడానికి అవసరమైన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్లను ఏర్పాటుచేయాలి. ఔత్సాహిక వ్యాపారవేత్తలతో చేయించాలి. అప్‌సైకిల్డ్‌ ఫుడ్‌ అసోసియేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఈ దిశగా వ్యాపార సంస్థలతో కలిసి పనిచేస్తూ ప్రపంచంలోనే తొలిసారిగా ‘అప్‌సైకిల్డ్‌ ప్రోడక్ట్‌’ అన్న సర్టిఫికెట్‌ని కూడా ఇస్తోంది.

పనికిరానివే... ఆటవస్తువులయ్యాయి!

ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని అయిన పూజకి ఓరోజు మురికివాడ మీదుగా వెళ్తూండగా ఒక దృశ్యం కనిపించింది. అక్కడ పిల్లలు పాత సైకిల్‌ టైర్లతోనూ రోడ్డు పక్కన పెట్టిన డ్రైనేజీ పైపులతోనూ ఆడుకుంటున్నారు. పార్కుల్లో ఖరీదైన క్రీడాసామగ్రి ఉండడమూ అక్కడికి పిల్లలందరికీ ప్రవేశం లేకపోవడమూ గమనించిన పూజ పిల్లలందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ ఖర్చుతో క్రీడాసామగ్రిని డిజైన్‌ చేయాలనుకుంది. ఆ క్రమంలో ఆమెకు అందివచ్చాయి- వాడేసిన రబ్బరు టైర్లు. చాలావరకూ వాటిని చెత్తలో పడేస్తున్నారు తప్ప రీసైక్లింగ్‌ చేయడం లేదు. టైరుగా పనికిరానప్పటికీ అవి పటిష్ఠంగానే ఉంటాయి. వాటిని సేకరించి శుభ్రం చేసి ఆకర్షణీయమైన రంగులతో అలంకరించి తమ కళాశాల ఆవరణలోనే రకరకాల ఆకృతుల్లో ఏర్పాటు చేసి క్రీడామైదానాన్ని సిద్ధం చేసింది. అధ్యాపకులు ఆమె ఆలోచనను ఎంతగానో మెచ్చుకున్నారు. ఆ ఉత్సాహంతో 2017లో పూజ ‘యాంట్‌హిల్‌ క్రియేషన్స్‌’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 328 క్రీడామైదానాలను తయారుచేశారు. వాటిల్లో వాడిన వస్తువులన్నీ టైర్లూ, పైపులూ, ఇనుప కడ్డీలూ లాంటి స్థానికంగా దొరికే వ్యర్థాలే. ఏటా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకు పైగా టైర్లు చెత్త కుప్పల్లోకి చేరుతున్నాయట. అవి జీర్ణమై భూమిలో కలిసిపోవడానికి 50నుంచి 80ఏళ్లు పడుతుంది. అందుకే ఇప్పుడీ కాన్సెప్ట్‌ని ఉపయోగించుకుని చాలాచోట్ల టైర్లను రకరకాలుగా పునర్వినియోగిస్తూ చెత్తని తగ్గిస్తున్నారు.

పారేసే వస్తువులే ఫర్నిచర్‌గా...

ఒకదాని తర్వాత ఒకటిగా వ్యాపారాల్లో నష్టపోయిన హృతేష్‌ గోయల్‌ అప్పుల్లో మునిగిపోయాడు. ఏం చేయాలో తోచక పాత సామాను ఉన్న గ్యారేజ్‌లో కూర్చుని ఆలోచిస్తూ- ఎదురుగా కన్పించిన ఖాళీ పెయింట్‌ డబ్బాని శుభ్రం చేసి రంగులువేసి స్టూలు లాగా వాడుకోవచ్చని ఇంటికి తీసుకెళ్లాడు. అది చూసిన వాళ్లంతా ‘చాలా బాగుంది’ అనడంతో గ్యారేజ్‌లో మూలన పడివున్న సైకిల్‌, మోటర్‌ సైకిల్‌ టైర్లనూ ఇతర పరికరాలనూ ఉపయోగించి బల్లలూ కుర్చీలూ రూపొందించాడు. వాటిని చూసినవాళ్లు ఇష్టంగా కొనుక్కోవడమే కాక, తమ దగ్గర వృథాగా ఉన్న వస్తువుల్నీ ఇచ్చి కొత్తగా పనికివచ్చే వస్తువుల్ని తయారుచేయమని అడగడంతో దాన్నే ఉపాధిగా మార్చుకున్నాడు హృతేష్‌. ఇప్పుడు అతడి కంపెనీ అప్‌సైకిల్డ్‌ ఉత్పత్తులను ఏకంగా విదేశాలకు ఎగుమతులు చేస్తూ కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది.
అందరికీ అలా చేయడం చేత కావాలి కదా... అంటారా. అదీ నిజమే. అయితే ఇలా ఏ వస్తువుల్ని అయినా అప్‌సైక్లింగ్‌ చేసే సంస్థలు ఇప్పుడు చాలానే ఉన్నాయి. ఫోన్లూ, ల్యాప్‌టాప్‌లూ లాంటి గ్యాడ్జెట్లే కాదు, ఇంట్లో ఫర్నిచరూ, కార్లూ, బైక్‌లూ, దుస్తులూ అన్నీ ఇప్పుడు సెకండ్‌ హ్యాండ్‌వి దొరుకుతున్నాయి. పునర్జన్మ పొంది సరికొత్త వాటిలా సేవలందిస్తున్నాయి. చేయాల్సిందల్లా ఏవి ఎక్కడ దొరుకుతాయన్నది ఓపిగ్గా ఇంటర్నెట్‌లో వెతుక్కోవడమే. ఇళ్లూ, సమావేశ భవనాలూ, ఆట స్థలాలూ... అన్నిటినీ పర్యావరణహితంగా రూపొందించే క్రమంలో అప్‌సైకిల్డ్‌ వస్తువుల వాడకం బాగా పెరుగుతోందని అమెరికాలోని పట్టణ ప్రణాళిక విభాగం చెబుతోంది. పర్యావరణ స్పృహ కలిగిన పర్యటకులను ఆకట్టుకోవడానికి యజమానులు తమ భవనాలను అప్‌సైకిల్డ్‌ వస్తువులతో తీర్చిదిద్దుతున్నారని ఎయిర్‌బీఎన్‌బీ పేర్కొంది. థాయ్‌లాండ్‌లో పనికిరాని సీసాలతో ఏకంగా ఒక దేవాలయమే(ద టెంపుల్‌ ఆఫ్‌ మిలియన్‌ బాటిల్స్‌) కట్టారు. తైవాన్‌లో 15 లక్షల ప్లాస్టిక్‌ సీసాలతో కట్టిన ‘ఈకోఆర్క్‌’ భవనాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మనదేశంలోనూ ఇలాంటి ప్రయత్నాలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి.

కార్పొరేట్‌ సంస్థలదీ అదే బాట

కొత్త ఫ్రిజ్‌ కానీ ఏసీ కానీ కొన్నప్పుడు పాతవాటిని ఏంచేస్తారు? చాలామంది వాటిని స్టోర్‌ రూమ్‌లో పడేసి తర్వాతెప్పుడో పాత సామాను వాడికి ఇచ్చేస్తారు. లేదా ఇల్లు మారేటప్పుడు చెత్తలో కలిపేస్తారు. నిజానికి వాటితో అప్‌సైక్లింగ్‌ చేయడం మన వల్ల కాదు. అందుకని కొత్తది కొనుక్కున్న కంపెనీకే పాతదీ ఇచ్చేయాలి. అది ఏ కంపెనీది అయినా పర్వాలేదు, తీసుకుంటాయి. ఇప్పుడు తయారీ సంస్థలన్నీ కూడా అప్‌సైక్లింగ్‌, రీసైక్లింగ్‌కి ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేశాయి. వినియోగదారుల దగ్గరనుంచి తీసుకున్న పాత వస్తువుల్ని విడదీసి పనికివచ్చే భాగాలతో రకరకాల ఉత్పత్తుల్ని తయారుచేసి విక్రయిస్తున్నాయి. హ్యుందయ్‌ కార్లు తెలుసు కదా, అదే కంపెనీ ఫ్యాషన్‌ దుస్తులూ యాక్సెసరీలూ తయారుచేస్తోందని చాలామందికి తెలియదు. పైగా వాటన్నిటినీ తయారుచేస్తున్నది ఆటోమొబైల్‌ వ్యర్థాలతోనే..! కొన్ని భాగాలను అప్‌సైకిల్‌ చేసీ మరికొన్నిటిని రీసైకిల్‌ చేసీ మొత్తానికి పనికిరావనుకున్న వ్యర్థాలతో రకరకాల సరికొత్త, మరింత ఎక్కువ విలువైన వస్తువుల్ని తయారుచేసే యూనిట్లు మనదేశంలో 33 వేలు ఉన్నాయట.

పాత పేపర్లు, గాజు వస్తువులు, ఇనుము లాంటి లోహాలు, కలప వస్తువులు, ప్లాస్టిక్‌, ఎలక్ట్రానిక్స్‌, దుస్తులు... ఏవైనా సరే. వాటిని వేర్వేరుగా ఉంచడం మొదటి మెట్టు. వంటింటి తడిచెత్తతో కలిపి మున్సిపల్‌ బండిలో పడేయకుండా ఇంటికి వచ్చి చెత్త తీసుకెళ్లే సంస్థలకు అమ్మడం రెండో మెట్టు. ఇవి రెండూ జాగ్రత్తగా చేస్తే అప్‌సైక్లింగ్‌లో మన వంతు కర్తవ్యం నెరవేర్చినట్లే.

మనం కావాలని వేస్ట్‌ చేస్తే తప్ప నిజానికి ఏదీ వ్యర్థం కాదు... అన్నది ఈ అప్‌సైక్లింగ్‌ వెనకాల ఉన్న సిద్ధాంతం. అందుకే ఏ వస్తువునైనా పనికిరాదని పారేసే ముందు ఒక్కసారి ఆలోచించండి... దాన్ని మరెలాగైనా ఉపయోగించవచ్చేమో..!


‘అప్‌సైక్లింగ్‌’ ఎందుకంటే...

ఏ వస్తువునైనా నూటికి నూరుశాతం వినియోగించుకుంటేనే దాని తయారీకి పెట్టిన ఖర్చుకి ప్రతిఫలం పొందినట్లు. అలా కాకుండా కాస్త పాతబడగానే తీసి పారేస్తే మన వనరుల్ని మనమే చేజేతులా వృథా చేసుకున్నట్లు. అందుకే అప్‌సైక్లింగ్‌కి అంత ప్రాధాన్యం. దీనివల్ల...

పర్యావరణం: భూమి మీద చెత్తకుప్పల(ల్యాండ్‌ఫిల్స్‌) భారం తగ్గుతుంది. వాటివల్ల నేలా నీరూ కలుషితమవడమూ తగ్గి పర్యావరణం బాగుపడుతుంది.

సహజవనరులు: వస్తువుల్ని ఒకటికి రెండుసార్లు ఉపయోగించడం వల్ల అనవసరంగా కొనడం తగ్గుతుంది. దాంతో సహజవనరుల మీద ఒత్తిడి ఉండదు. ఉదాహరణకు ఒక టీషర్టు తయారీకి 2,700 లీటర్ల నీరు పడుతుంది. దాన్ని రెండోసారి వాడుతున్నామంటే అన్ని నీటిని పొదుపు చేసినట్లే కదా.

ఆర్థికంగా: వస్తువు జీవితకాలం పెరుగుతుంది కాబట్టి మరో కొత్త వస్తువు కొనే ఖర్చు మిగులుతుంది. ప్రతి వస్తువు తయారీ వెనకా నేల, నీరు లాంటి సహజవనరులు, విద్యుత్తు, మానవవనరుల వినియోగం... ఉంటాయి. వాటన్నిటి విలువా గిట్టుబాటు అవుతుంది. ప్రయోజనకరంగా వాడామన్న తృప్తి ఉంటుంది. 

సృజన: సృజనకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆయా పనులు చేసే నిపుణులు ఉపాధి పొందుతారు. ఒక వస్తువుని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో తెలుస్తుంది. అప్‌సైక్లింగ్‌తో తయారైన ప్రతి వస్తువూ దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి డిజైనర్‌ ఉత్పత్తుల్ని వినియోగిస్తున్నామన్న ఆనందమూ సొంతమవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..