గోరింట... కోరినట్లుగా

‘ఆషాఢంలోనే కాదు... ఏ కాలంలోనైనా సరే చక్కగా గోరింటాకును రుబ్బి పెట్టుకుంటేనే బాగుంటుంది కానీ ఆకు అన్నిచోట్లా దొరకద్దూ’... ‘తలకు హెన్నాతో ప్యాక్‌ను వేసుకుంటే జుట్టుకు మంచిదంటారు కానీ దాని తయారీనే పెద్ద పని’... ‘నెయిల్‌ పాలిష్‌లు బోలెడన్ని రంగుల్లో దొరుకుతున్నాయి.

Updated : 04 Jun 2023 03:53 IST

‘ఆషాఢంలోనే కాదు... ఏ కాలంలోనైనా సరే చక్కగా గోరింటాకును రుబ్బి పెట్టుకుంటేనే బాగుంటుంది కానీ ఆకు అన్నిచోట్లా దొరకద్దూ’... ‘తలకు హెన్నాతో ప్యాక్‌ను వేసుకుంటే జుట్టుకు మంచిదంటారు కానీ దాని తయారీనే పెద్ద పని’... ‘నెయిల్‌ పాలిష్‌లు బోలెడన్ని రంగుల్లో దొరుకుతున్నాయి సరే, అచ్చం గోరింటాకు పెట్టుకున్నట్లుగా ఉండే రంగు దొరికితే ఎంత బాగుణ్ణు... ఇలా అనుకునేవారికి ఇప్పుడు కొత్తగా గోరింటాకు, మెహెందీ కిట్‌, నెయిల్‌హెన్నా, హెన్నా పేస్ట్‌ వంటివెన్నో వస్తున్నాయి.

పెళ్లిళ్ల సమయంలో మెహెందీని మోచేతుల వరకూ అద్భుతమైన డిజైన్లల్లో పెట్టినా... పండుగలూ, నోములూ, వ్రతాలూ... వంటి సందర్భాల్లో గోరింటాకును రుబ్బి, పెట్టుకుంటేనే చేతులకు అందం అనేది కొందరి అభిప్రాయం. అదిగో అలాంటివారి కోసమే ఇప్పుడు చక్కగా ప్యాక్‌ చేసిన గోరింటాకు దొరికేస్తోంది. అదేవిధంగా హెయిర్‌ డైల్లో రసాయనాలు ఎక్కువగా ఉండటం, అవి జుట్టుకీ చర్మానికీ హానిచేయడం వంటి కారణాలతో ఈ మధ్య చాలామంది హెన్నా ప్యాక్‌నే వేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దాని తయారీకి అవసరమైన గోరింటాకు, మందార, ఉసిరి, మెంతి... వంటి పొడులు మార్కెట్లో దొరుకుతున్నా ముందురోజు ఇనుప పాత్రలో ఆ పొడులన్నింటినీ వేసుకుని టీ లేదా కాఫీ డికాక్షన్‌, నిమ్మరసం వంటివన్నీ కలిపి హెన్నాను తయారు చేసుకోవడం అంటే పెద్ద పనే కదూ... అవేవీ లేకుండానే కావాల్సినప్పుడల్లా హెన్నాను పెట్టుకోవాలనుకునేవారికి రెడీమేడ్‌ పేస్టు పరిష్కారం చూపిస్తుంది. అంటే... హెన్నా తయారీకి అవసరమైన పదార్థాలన్నీ కలిపి ఈ పేస్టును చేస్తారన్నమాట. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్‌లా వేసుకుని ఆ తరవాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

గోళ్లకూ హెన్నా...

ఒకప్పుడు నెయిల్‌పాలిష్‌ అంటే ఎరుపు రంగులోనే ఉండేది. రోజులు మారేకొద్దీ నియాన్‌, న్యూడ్‌, మ్యాట్‌ రంగులు... అంటూ బోలెడు వచ్చేయడంతో చేతులకు గోరింటాకు పెట్టుకున్నా... గోళ్లకు మాత్రం నచ్చిన రంగు వేసేస్తున్నారు ఫ్యాషన్‌ ప్రేమికులు. కానీ అందులోనూ కొత్తదనం ఏముందని అనుకున్నారో ఏమో తయారీదారులు ఇప్పుడు కొత్తగా నెయిల్‌హెన్నాను తీసుకొచ్చారు. దీనికీ, నెయిల్‌పాలిష్‌కీ తేడా ఏంటంటే.. ఈ నెయిల్‌హెన్నా తయారీలో రసాయనాల వాడకం తక్కువ. ఒకసారి గోళ్లకు వేస్తే ఎక్కువకాలం చెదరకుండా ఉంటుంది. పైగా అచ్చంగా గోరింటాకు పెట్టినట్లుగానే అనిపిస్తుంది. కోన్‌, ట్యూబ్‌, నెయిల్‌పాలిష్‌ రకాల్లో... రెడ్‌, డార్క్‌రెడ్‌, మెరూన్‌ వంటి రంగుల్లో దొరుకుతున్న ఈ నెయిల్‌హెన్నాను గోళ్లకు గోరింటాకు మాదిరి పెట్టుకుని ఆ తరువాత తీసేస్తే చాలు. ఇక, కోన్‌ తయారీతోపాటూ దాన్ని పెట్టడం నేర్చుకోవాలనుకునే వారికోసం ఇప్పుడు మెహెందీ ఆర్ట్‌ కిట్‌ కూడా అందుబాటులో ఉంది. ఇందులో గోరింటాకు పొడి, కోన్లు, ఇయర్‌బడ్స్‌, యూకలిప్టస్‌ ఆయిల్‌, స్టెన్సిల్స్‌ వంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా కోన్‌ను పట్టుకుని పెట్టుకోవడం కష్టమనుకునేవారికి చిన్నచిన్న మెహెందీ సీసాలు, కోన్‌ట్యూబ్‌లు కూడా వస్తున్నాయి. అదండీ సంగతీ... ఆషాఢం రాబోతోంది కాబట్టి ఈసారి మీ చేతుల్ని మీకు నచ్చినట్లుగా  మెరిపించేందుకు సిద్ధమవ్వండి మరి...


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు