వరలక్ష్మీ వ్రతానికి వేళాయె...

అలంకరణ అంటే అమ్మాయిలందరికీ ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. అందులోనూ సృజనాత్మకతను జోడిస్తూ మనసారా వేడుకుంటూ చేసే వరలక్ష్మీ వ్రతాల్లో ఆ అలంకరణే ప్రత్యేక ఆకర్షణ. సిరుల తల్లి కట్టూబొట్టూ, పెట్టే నైవేద్యాల దగ్గర్నుంచి పూజా సామగ్రి

Published : 31 Jul 2022 00:54 IST

వరలక్ష్మీ వ్రతానికి వేళాయె...

అలంకరణ అంటే అమ్మాయిలందరికీ ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. అందులోనూ సృజనాత్మకతను జోడిస్తూ మనసారా వేడుకుంటూ చేసే వరలక్ష్మీ వ్రతాల్లో ఆ అలంకరణే ప్రత్యేక ఆకర్షణ. సిరుల తల్లి కట్టూబొట్టూ, పెట్టే నైవేద్యాల దగ్గర్నుంచి పూజా సామగ్రి వరకూ ప్రతిదీ కొత్తగా ఉండాలనుకుంటారు. అలాంటి వారికోసం ఇప్పుడు శ్రావణ మాసపు అలంకరణలు బోలెడన్ని వచ్చేశాయి. అమ్మవారితో పాటూ దీపాలూ, కలశాలూ... ముత్తయిదువులకు ఇచ్చే తాంబూలాలూ.. ఇలా పూజా కార్యక్రమాన్నంతటినీ అందంగా చూపిస్తూనే ఆధ్యాత్మిక శోభను తీసుకురావచ్చు! 

మా ఇంటి మహాలక్ష్మి!

శ్రావణమాసం వచ్చిందంటే... కొత్తకోడళ్ల నోములూ, మహిళల వ్రతాలూ... ముత్తయిదువుల వాయనాలూ... ఇలా ఒకటా రెండా, ఈ నెల అంతా తెలుగు లోగిళ్లన్నీ సందడి సందడిగా ఉంటాయి. ప్రతిమహిళా శ్రావణలక్ష్మిగా ముస్తాబై అమ్మవారిని ఆహ్వానిస్తూ పూజలు చేసుకుంటుంది. అప్పట్లో కొంతమంది పీటపైన ఉంచిన కలశాన్నే అమ్మవారిగా కొలుస్తూ వరలక్ష్మీవ్రతాన్ని చేసుకునేవారు. మరికొంతమంది దేవి ఫొటోను పెట్టుకుంటే... ఇంకొందరు కలశం మీదనే పసుపు ముద్దతో అమ్మవారి ముఖాన్ని చేసుకుని పూజించేవారు. కానీ ఇప్పుడు ఆ శ్రీమహాలక్ష్మి ముఖాలూ, నిలువెత్తు రూపాలూ దొరుకుతున్నాయి. సిరుల తల్లి నిజంగానే మన ఇంట్లో కొలువుదీరిందా అన్నట్లుగా ఉంటున్నాయి ఇవన్నీ కూడా. తలపైన కిరీటం, మెడలో నగలూ, పట్టుచీరా, పొడవైన జడా... ఇలా ప్రతిదీ చక్కని అలంకరణలతో వచ్చే అమ్మవారి ప్రతిమల్ని నేరుగా కొనేసుకోవచ్చు. లేదూ... అందరి కన్నా భిన్నంగా ఉండాలనుకుంటే మీ ఇంటి లక్ష్మీదేవిని మీరే తయారుచేసుకోవచ్చు. అందుకోసం మార్కెట్లో అమ్మవారి నగలూ, చీరలూ అమ్ముతున్నారు. గాజులూ, కిరీటాలూ, జడ బిళ్లలూ, వంకీలూ, వడ్డాణాలూ, హారాలూ... చిన్నచిన్న సైజుల్లో సెట్లుగా దొరుకుతున్నాయి.వీటితో దేవిని స్వయంగా అలంకరించుకోవచ్చు. ఏటికేడు శ్రావణలక్ష్మిని ప్రత్యేకంగా తయారుచేసుకోవచ్చు.


ఇవి పూజా తెరలు!

చూసిన వెంటనే పర్వదినం శోభ ఉట్టిపడేలా దేవి ప్రతిమ వెనకాల పూల దండలో, మామిడాకుల తోరణాలో పెట్టడం అమ్మమ్మల కాలం నుంచీ ఉన్న పద్ధతే. వాటికి అదనంగా ఈ డెకరేటివ్‌ యుగానికి తగ్గట్టు పూజలోనూ ఆ ఏర్పాట్లు ఉండాలి కదా. అందుకే మరి పెద్ద పెద్ద వేడుకలకూ, ఫంక్షన్లకూ వేసే బ్యాక్‌ డ్రాప్‌ కర్టెన్లు పండుగల కోసమూ అందుబాటులోకి వచ్చాయి. వరలక్ష్మి చిత్రాలూ, రంగవల్లులూ, అరిటాకులూ, పువ్వులూ, దీపాల డిజైన్లూ... ఇలా ఎన్నెన్నో థీమ్‌లతో రకరకాల తెరలు దొరుకుతున్నాయి. త్రీడీ ప్రింట్లతో ఉండే ఇవి చిన్న సైజుల్లోనూ ఉన్నాయి. కొన్ని క్లాత్‌తో చేసినవి ఉంటే ఇంకొన్ని స్టిక్కర్లలానూ ఉంటాయి. మన అవసరానికి తగ్గట్టు కొనుక్కోవచ్చు. సమయం ఉన్నప్పుడు రకరకాల పూలనీ, ఆకులనీ దండలుదండలుగా కట్టి అలంకరించడం మామూలే కానీ సమయం లేకపోయినా వీటితో క్షణాల్లో అలాంటి డెకరేషన్‌ తెప్పించేయొచ్చు. 


ముస్తాబైన   కలశం!

ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాల్లో, పూజల్లో కలశానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పసుపు, కుంకుమలతో చుట్టూ బొట్లు పెట్టి కలశాన్ని తయారుచేసుకుంటారు. నీళ్లూ, మామిడాకులూ, కొబ్బరికాయా ఉంచి కొలుస్తారు. ఇదివరకు రాగీ, ఇత్తడీ పాత్రలే కలశ పాత్రలుగా ఉండేవి. కానీ ఇప్పుడు ఎన్నో రెడీమేడ్‌ కలశాలు వచ్చేశాయి. అంటే వట్టి పాత్రలు కాకుండా... గణపయ్యా, లక్ష్మీదేవీ విగ్రహాలతోపాటూ కొబ్బరికాయా, ఆకులతో చేసిన కలపా, వెండీ, బంగారూ, ముత్యాల కలశాలు దొరుకుతున్నాయి. అందంగా తయారైన ఈ కలశాల్ని నేరుగా పూజలో పెట్టేసుకోవచ్చు. చూడ్డానికీ ఎంతో బాగుంటాయి!


లక్ష్మీ దివ్వెలు!

పూజలో ఇత్తడితోనో లేదా వెండితోనో చేసిన దీపపు కుందుల్లో నూనె వేసి ‘దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్‌.....’ అంటూ దేవిని తలుచుకుంటూ వత్తుల్ని వెలిగిస్తుంటారు. దీపపు జ్యోతుల్ని లక్ష్మీదేవీ స్వరూపంగా భావిస్తుంటారు. మరి అదే మహాలక్ష్మీ రూపం దీపాల్లోనే నేరుగా సాక్షాత్కరిస్తే... ఎంతో అద్భుతంగా ఉంటుంది కదూ! ఆ అద్భుతాన్ని మీ వ్రతంలోనూ చూపాలనుకుంటే... ఇలా దీపపు కుందుల్ని అలంకరించుకోండి. పట్టుచీరతో చక్కగా కుచ్చిళ్లు పెట్టి నచ్చిన నగల్ని వేశారంటే దీపమే మహాలక్ష్మిగా కాంతులీనుతూ వచ్చిన అతిథుల్ని ఆకట్టుకుంటుంది. ఈ శ్రమ అంతా ఎందుకూ అనుకుంటే... అమ్మవారి ముఖాలూ, ముత్యాలూ, పూసలూ, రకరకాల పూలతో అలంకరించిన దీపాలూ నేరుగా మార్కెట్లోనూ దొరుకుతున్నాయి. ఇదివరకే ఉన్న దేవుడి రూపాల దీపాలకు బదులు ఈసారి ఈ వరలక్ష్మి అలంకరణలోని దీపపు కుందుల్ని మీ పూజలో భాగం చేసుకోండి మరి.


అన్నింటా పూజా కళ! 

‘ఇంట్లో అడుగుపెట్టగానే అతిథులందరిలో ఆధ్యాత్మిక భావన వచ్చేయాలి... ముత్తయిదువులంతా కాసేపైనా మన ఇంటి పూజా విశేషాలు మాట్లాడుకోవాలి...’ అని ఏ మహిళ కోరుకోదు చెప్పండి. అందుకే తమ సృజనాత్మకతను జోడిస్తూ పూజలో అన్నిరకాల అలంకరణలూ చేసేస్తుంటారు. పూజావిధానంలో ఉండే నారికేళం దగ్గర్నుంచి హారతి పళ్లె్లెం వరకూ అన్నీ డెకరేషన్‌కి పోటీపడుతూ ముస్తాబై వస్తున్నాయి. వీటితోపాటూ అరటిపండ్లూ, కొబ్బరిచెట్లూ... నిజమైనవాటిల్లానే కనిపించేలా క్లాత్‌తో చేసినవీ అందుబాటులో ఉన్నాయి. వీటిని పూజలో ఉంచుకుని ఆ తర్వాత శుభ్రపరుచుకుని మడతపెట్టి భద్రపరుచుకోవచ్చు. అంతేకాదు రంగుల బంగారూ, వెండి పూలు...  అగరుబత్తుల స్టాండులూ ఇలా ప్రతిదీ పూజ కోసం కొత్త సొబగులు అద్దుకుని వస్తున్నాయి. పట్టుచీరలు కట్టి మెడ నిండుగా నగలు పెట్టి వరలక్ష్మీవ్రతాల్లో కూర్చున్న పడతులతో ఆ చోటంతటికీ లక్ష్మీకళ వస్తే... ఆ కళను ఇంకాస్త కనువిందుగా చేయాలంటే మాత్రం ఈ పూజా అలంకరణలన్నీ ఉండాల్సిందే! 


అమ్మకోసం పీఠం!

వరాలిచ్చే ఆ వరప్రదాయినిని ఆసీనం చేయడానికి వరలక్ష్మీవ్రతంలో కాస్త ఎత్తున్న పీట వేసి, దానికి పసుపు రాసి పైన ముగ్గువేసి సిద్ధం చేస్తారు. అన్నిట్లో వచ్చిన వైవిధ్యం పీటల్లోనూ రావాల్సిందేగా. అందుకే మార్కెట్లో ఇప్పుడు రకరకాల పూజా పీఠాలూ దొరుకుతున్నాయి. ఇత్తడి, వెండి, బంగారు పూతలతో ఉండేవీ, అందమైన ముగ్గులూ, పూల డిజైన్ల చెక్క పీటలూ అందుబాటులో ఉన్నాయి. వేరు వేరు సైజుల్లో, వివిధ ఎత్తుల్లో ఉన్న ఈ పీటల్లో నచ్చినవాటిని ఎంచుకుని ఈసారి దేవికి పీఠంగా అమర్చండి.


అందమైన వాయనం! 

పూజ ముగిసిన తర్వాత ముత్తయిదువులందరికీ వాయనాలు ఇవ్వడం అనేది ఆనవాయితీ. ఆకులూ, పసుపూ కుంకుమా, పూలూ, అరటి పండ్లూ, జాకెట్‌ ముక్కలూ... వీటన్నింటినీ ఓ పళ్లెంలోనో, చేటలోనో పెట్టి వచ్చినవారికి వాయనాల్లా ఇస్తుంటారు. ప్రతిదాంట్లో చూపిన కొత్తదనం ముత్తయిదువులకు ఇచ్చే తాంబూలాల్లోనూ ఉండాలనుకున్న పడతులు... ఇలా బుట్టల్లోనూ అందంగా సర్ది ఇవ్వొచ్చు. విడివిడిగా వస్తువులన్నింటినీ కొని సొంతంగా అందమైన వాయనాల బుట్టల్ని తయారుచేసుకోవచ్చు. ఆ అవకాశం లేకపోతే... అన్నీ అమర్చి ఉన్న వాయనాలూ అందుబాటులో ఉన్నాయి. ఈసారి వ్రతానికి ‘ఇస్తినమ్మ వాయనం...’ అంటూ ముస్తాబుచేసిన ఈ వాయనాల్ని ముత్తయిదువు చేతిలో పెట్టారంటే ‘పుచ్చుకుంటినమ్మ వాయనం...’ అంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే మీ అభిరుచిని మెచ్చుకుంటారు! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..