చల్లనివేళ... చికెన్‌ కూర

వాతావరణం చల్లగా మారుతున్నప్పుడు మసాలా కూరలు తినాలనిపించడం సహజం. అవి కూడా చికెన్‌తో అయితే... ఇంక తిరుగేముంది.

Updated : 07 Jul 2024 05:19 IST

వాతావరణం చల్లగా మారుతున్నప్పుడు మసాలా కూరలు తినాలనిపించడం సహజం. అవి కూడా చికెన్‌తో అయితే... ఇంక తిరుగేముంది. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా ఇలా రకరకాలుగా చికెన్‌ వెరైటీలు చేసుకుని ఆస్వాదిస్తే ఎలా ఉంటుందంటారూ...


కడాయి చికెన్‌

కావలసినవి: చికెన్‌: అరకేజీ, ఉల్లిపాయ ముక్కలు: ముప్పావుకప్పు, టొమాటో గుజ్జు: ఒకటింబావు కప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు: టేబుల్‌స్పూను, క్యాప్సికం: ఒకటి, కారం: చెంచా, పసుపు: పావుచెంచా, ఉప్పు: తగినంత, జీలకర్ర: అరచెంచా, గరంమసాలా: చెంచా, వెన్న: టేబుల్‌స్పూను, నూనె: పావుకప్పు.  
మసాలా కోసం: దనియాలు: టేబుల్‌స్పూను, సోంపు: చెంచా, లవంగాలు: రెండు, దాల్చినచెక్క: చిన్నముక్క, యాలకులు: మూడు, మిరియాలు: పావుచెంచా, ఎండుమిర్చి: రెండు.  

తయారీ విధానం: మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలను దోరగా వేయించుకుని పొడి చేసుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి జీలకర్ర, సగం ఉల్లిపాయముక్కలు, అల్లంవెల్లుల్లిపేస్టు వేయించి చికెన్‌ వేయాలి. ఇందులో కారం, పసుపు, తగినంత ఉప్పు, గరంమసాలా, చేసిపెట్టుకున్న మసాలా రెండు పెద్ద చెంచాలు, టొమాటో గుజ్జు వేసి కలిపి మూత పెట్టాలి. చికెన్‌ ముప్పావువంతు ఉడికాక దింపేయాలి. మరో కడాయిని స్టవ్‌మీద పెట్టి వెన్న వేసి క్యాప్సికం ముక్కలు, మిగిలిన ఉల్లిపాయముక్కలు వేయించి చికెన్‌ కూర వేసి కలపాలి. చికెన్‌ పూర్తిగా ఉడికాక స్టవ్‌ కట్టేస్తే చాలు.


దమ్‌ కా ముర్గ్‌

కావలసినవి:  ఉల్లిపాయలు: మూడు, జీడిపప్పు: పన్నెండు, బాదం: పది, కొబ్బరిపొడి: రెండు టేబుల్‌స్పూన్లు, గసగసాలు: చెంచా, చికెన్‌: అరకేజీ, అల్లంవెల్లుల్లి పేస్టు: రెండు చెంచాలు, పసుపు: పావుచెంచా, దనియాలపొడి: రెండు చెంచాలు, కారం: రెండు చెంచాలు, జీలకర్రపొడి: అరచెంచా, మిరియాలపొడి: అరచెంచా, గరం మసాలా: చెంచా, ఉప్పు: తగినంత, నిమ్మరసం: చెంచా, యాలకులు: మూడు, దాల్చినచెక్క: చిన్నముక్క, బిర్యానీఆకు: ఒకటి, లవంగాలు: నాలుగు, నూనె: పావుకప్పు, పుదీనా ఆకులు: పావుకప్పు, కొత్తిమీర తరుగు: పావుకప్పు, పెరుగు: అరకప్పు, పచ్చిమిర్చి: రెండు.

తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయముక్కల్ని రెండు చెంచాల నూనెలో ఎర్రగా వేయించుకుని పెట్టుకోవాలి. అదే కడాయిలో జీడిపప్పు, బాదం, కొబ్బరిపొడి, గసగసాలను విడివిడిగా వేయించుకుని తీసుకోవాలి. జీడిపప్పు, బాదం, కొబ్బరిపొడి, గసగసాలను పావుకప్పు నీళ్లతో మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు చికెన్‌ ముక్కలపైన ముప్పావువంతు వేయించిన ఉల్లిపాయముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, దనియాలపొడి, కారం, జీలకర్రపొడి, మిరియాలపొడి, పెరుగు, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి అరగంట ఫ్రిజ్‌లో పెట్టాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి మిగిలిన నూనె వేసి.. యాలకులు, దాల్చినచెక్క, బిర్యానీఆకు, లవంగాలు వేయించి మారినేట్‌ చేసుకున్న చికెన్‌ను వేసి, పావుకప్పు నీళ్లు పోయాలి. చికెన్‌ పూర్తిగా ఉడికి దగ్గరకు అయ్యాక మిగిలిన ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు వేసి కలిపి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.


తోటకూర చికెన్‌

కావలసినవి: చికెన్‌: అరకేజీ, తోటకూర కట్టలు: అయిదు, నూనె: పావుకప్పు, పచ్చిమిర్చి: నాలుగు, ఉల్లిపాయలు: రెండు, టొమాటోలు: రెండు, పసుపు: అరచెంచా, అల్లంవెల్లుల్లిపేస్టు: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, కారం: రెండు టేబుల్‌స్పూన్లు, దనియాలపొడి: చెంచా, గరంమసాలా: చెంచా, పెరుగు: పావుకప్పు, కొత్తిమీర తరుగు: కొద్దిగా.  

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక పచ్చిమిర్చి తరుగును వేయించి... ఉల్లిపాయముక్కల్ని వేయాలి. అవి వేగుతున్నప్పుడు అల్లంవెల్లుల్లి పేస్టు, టొమాటో తరుగు, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి అన్నింటినీ కలపాలి. రెండు నిమిషాలయ్యాక చికెన్‌ ముక్కలు, దనియాలపొడి, గరంమసాలా వేసి కలిపి మూత పెట్టాలి. చికెన్‌ ముప్పావు వంతు ఉడికాక తోటకూర తరుగు వేయాలి. తోటకూర కూడా మగ్గి, చికెన్‌ పూర్తిగా ఉడికాక పెరుగు, కొత్తిమీర తరుగు వేసి కలిపి... అయిదు నిమిషాలయ్యాక దింపేస్తే సరి.


కేరళ చికెన్‌ మసాలా

కావలసినవి: చికెన్‌: అరకేజీ, ఉల్లిపాయలు: రెండు, అల్లం పేస్టు: టేబుల్‌స్పూను, వెల్లుల్లి తరుగు: చెంచా, పచ్చిమిర్చి: రెండు టొమాటో: ఒకటి, పసుపు: అరచెంచా, జీలకర్ర పొడి: చెంచా, దనియాలపొడి: టేబుల్‌స్పూను, కారం: చెంచా, ఉప్పు: తగినంత, కొబ్బరిపాలు: అరకప్పు, నూనె: పావుకప్పు.

తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి ఉల్లిపాయముక్కల్ని వేయించాలి. ఇందులో అల్లంపేస్టు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేయించి పసుపు, జీలకర్రపొడి, దనియాలపొడి, కారం, తగినంత ఉప్పు, టొమాటో ముక్కలు, చికెన్‌ వేసి అన్నింటినీ కలిపి కప్పు నీళ్లు పోయాలి. చికెన్‌ పూర్తిగా ఉడికాక కొబ్బరిపాలు పోసి కలిపి పది నిమిషాలయ్యాక స్టవ్‌ని కట్టేయాలి.

- అమన్నరాజు, ఎగ్జిక్యూటివ్‌ షెఫ్‌, నొవొటల్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..