Published : 24 Sep 2022 23:22 IST

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌... మీకు ఎవరి రోల్‌ కావాలి?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కలిసి ఆ పిల్లాడిని రక్షించే సీన్‌ని ఎంత బాగా తీశారో కదూ’...

‘మన్యంపులిలో మోహన్‌లాల్‌ పులితో పోరాడే సన్నివేశాలు చాలా సహజంగా అనిపిస్తాయి’...

ఇలా యాక్షన్‌ సినిమాల్లో నచ్చిన సీన్లను అప్పుడప్పుడూ గుర్తుచేసుకోవడం అభిమానులకు మామూలే. దీన్ని గుర్తించిన కొన్ని గేమింగ్‌ సంస్థలు అలాంటి యాక్షన్‌ సినిమాలను వీడియోగేమ్‌ల రూపంలోకి తీసుకొచ్చేయడంతో, అభిమానులు ఈ గేముల ద్వారా తమకు నచ్చిన హీరో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి, సాహసాలకు సై అనేస్తున్నారిప్పుడు.

ఓ సినిమా రెండున్నర లేదా మూడుగంటల పాటు పంచే వినోదం అంతాఇంతా కాదు. అందులో ఒక్కొక్కరికీ ఒక్కో అంశం నచ్చితే.. యాక్షన్‌ సన్నివేశాలూ, తాము ఎంతో ఇష్టపడే హీరోలు చేసే సాహసాలూ వాళ్ల అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతాయి. దాంతో.. నచ్చిన సినిమాను ఒకటికి పదిసార్లు చూస్తూ ఆ పాత్రల్లో తమని తాము ఊహించుకుంటుంటారు. ఆ ఊహను తాత్కాలికంగానైనా నిజం చేయాలనే ఆలోచనతో సాహసాలూ, పోరాటాలూ ఎక్కువగా ఉండే సినిమాలను ఇప్పుడు వీడియోగేమ్‌ల రూపంలోకి తీసుకొచ్చేస్తున్నాయి కొన్ని సంస్థలు. అలా వస్తున్న వాటిల్లో ‘బాహుబలి’ నుంచి ఆ మధ్య విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వరకూ చాలానే ఉన్నాయి. వాస్తవానికి వీడియోగేమ్‌లనేవి కొత్తేమీ కాదు. వాటికి ఉన్న ఆదరణా తెలిసిందే. అందుకే ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పుడు ఎన్నోరకాల ఆటలు మార్కెట్లో లభ్యమవుతూ సందడి చేస్తుంటే... తాజాగా ఈ సినిమా వీడియోగేమ్‌లూ వచ్చేసి గేమర్లను ఆకట్టుకుంటున్నాయి. అలా వస్తున్న గేముల్లో ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘మన్యంపులి’, ‘సాహో’, ‘భజరంగీభాయ్‌జాన్‌’, ‘మామాంగమ్‌’, ‘ధూమ్‌-3’... వంటివెన్నో ఉన్నాయి.

ఎలా ఆడతారంటే...

ఒకప్పుడు ఎవర్ని చూసినా టెంపుల్‌రన్‌ ఆడుతూ కనిపించేవారు. అందులో ఉన్న అవరోధాల్ని దాటుకుంటూ బంగారు నాణేలను సేకరిస్తూ ఒక్కో లెవల్‌నూ దాటడం వీడియోగేమ్‌లు ఆడేవారికి చాలా థ్రిల్లింగ్‌గా అనిపించేది. ఈ సినిమా గేమ్‌లు అంతకు మించిన థ్రిల్‌ను అందిస్తాయని అంటారు వీటి తయారీదారులు. ఉదాహరణకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గేమ్‌ను తీసుకుంటే... మనం రామ్‌చరణ్‌ లేదా ఎన్టీఆర్‌ పాత్రను ఎంచుకోవాలి. ఆ పాత్రకు తగినట్లుగా గుర్రం లేదా బండిమీద వేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న అవరోధాల్ని దాటుకుంటూ అందుబాటులో ఉండే రక్షణాయుధాలను తీసుకుంటూ... బాబును రక్షించాలన్నమాట. అదే ‘బాహుబలి’లో... శత్రువుల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు ప్రణాళికలు వేసుకోవడం, యుద్ధ వ్యూహాలు రచించుకోవడం, యుద్ధాలు చేయడం... ఇలా ఒకటేమిటి, ఆ సినిమాలో మనమే నటిస్తున్నామా అన్నంత సహజంగా ఉంటుందీ ఆట. ఇక ‘మన్యంపులి’ - గేమ్‌లో అయితే ఆయుధాలను తీసుకుంటూ వ్యూహాలను సిద్ధంచేసుకుంటూ.. పులిని చంపగలిగితే గెలిచినట్లు అన్నమాట. సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘భజరంగీ భాయ్‌జాన్‌’ గుర్తుందా... అది కూడా వీడియోగేమ్‌ రూపంలో అందుబాటులో ఉందిప్పుడు. ఇందులో అవరోధాలను అధిగమిస్తూ, శత్రుమూకలతో పోరాడుతూ పాపను సురక్షితంగా ఇంటికి చేర్చేవరకూ ఆట చాలా థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ‘సాహో’లో ఒక్కో లెవల్‌ని పూర్తిచేసేకొద్దీ రకరకాల ఆయుధాలు సొంతమవుతాయి. వాటన్నింటి సాయంతోనే ఇచ్చిన టార్గెట్లను పూర్తిచేయాలి. మామాంగమ్, ధూమ్‌-3 వంటివీ ఇంచుమించు ఇలానే ఉంటాయి. ఇలా ఏ ఆటను తీసుకున్నా... అందులో మనమే ప్రభాస్‌/రామ్‌చరణ్‌/మోహన్‌లాల్‌/సల్మాన్‌ఖాన్‌లా మారిపోయి... సాహసాలు చేసేయొచ్చు. ఆలస్యమెందుకు మరి.. నచ్చిన సినిమాను మళ్లీమళ్లీ చూడటం కన్నా.. ఇలా గేమ్‌ రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకుని... మీరే హీరో అయిపోండి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts