Published : 08 Oct 2022 23:55 IST

మా మంచి సర్పంచులు

సర్పంచిగా సంపాదన, పలుకుబడి గురించి ఆలోచించకుండా గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందడుగేస్తుంటారు కొందరు. అలా మంచి మనసుతో నిర్ణయాలు తీసుకుని పల్లె ప్రగతికి బాటలు వేస్తున్న సర్పంచులు వీళ్లు... ప్రజల మనసులను గెలుచుకోవడానికి ఏం చేశారంటే...


నగలు తాకట్టు పెట్టి

చాలాచోట్ల మహిళల చేతిలో అధికారమున్నా, పెత్తనం మాత్రం వారి భర్తలే చలాయిస్తుంటారు. మధ్యప్రదేశ్‌లోని ఝిరి గ్రామ సర్పంచి ఆశాబాయి కైత్వాస్‌ గెలిచినప్పుడు కూడా చాలామంది అలానే అనుకున్నారు. మహిళల్ని చిన్నచూపు చూసే ప్రాంతంలో సర్పంచిగా గెలిచిన ఆశా అధికారాన్ని భర్త చేతిలో పెట్టకుండా పల్లె ప్రగతే లక్ష్యంగా అడుగులేస్తోంది. ఝిరి హైవే పక్క గ్రామం కావడంతో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండేవి. పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయేది. ఆ సమస్య మీద దృష్టి పెట్టిన ఆశా- ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న కొన్ని హైవే గ్రామాల్లో సీసీ కెమెరాలు అమర్చుకున్న తరవాత దాన్నుంచి బయటపడటం గమనించింది. ఝిరిలో కూడా అలా సీసీ కెమెరాలు పెట్టాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. ప్రభుత్వాధికారుల్ని సంప్రదిస్తే భద్రత కల్పించడం పోలీసుల బాధ్యత అనేసి ఊరుకున్నారు తప్ప సమస్యని పట్టించుకోలేదు. దాంతో ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా తన బంగారాన్ని తాకట్టు పెట్టి, ఆ డబ్బుతో సీసీ కెమెరాలు, టీవీ కొనుగోలు చేసి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది ఆశా. తరవాత ఆ గ్రామంలో జరిగిన దొంగతనాలూ, వేధింపులూ, కిడ్నాప్‌ల వంటి ఘటనల్లో సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల్ని సులువుగా పట్టుకోగలుగుతున్నారు. ఆ భద్రత వల్ల క్రమంగా క్రైమ్‌ రేట్‌ కూడా అదుపులోకి వచ్చింది. పల్లె మెచ్చిన ప్రజాప్రతినిధిగా ఆశా ఇప్పుడు అందరి అభినందనలూ అందుకుంటోంది.


అప్పుడు ఫోన్‌ వదలాల్సిందే!

రోజుకు రెండుగంటలపాటు ఫోన్‌, టీవీ చూడకూడదనే నిబంధన మహారాష్ట్రలోని మోహిత్యాంచీ వడగావ్‌ అనే గ్రామంలో ఈ మధ్యనే అమల్లోకి వచ్చింది. డిజిటల్‌ డిటాక్సిఫికేషన్‌ పేరిట ప్రతిరోజూ రాత్రి ఏడు కాగానే ఆ గ్రామంలో ఓ సైరన్‌ మోగిస్తారు. ఆ శబ్దం వచ్చిన వెంటనే ఫోన్లూ, టీవీలూ కట్టేసి పిల్లలు పుస్తకాలు పట్టుకుంటారు. మహిళలంతా ఒకచోట చేరి వృత్తివిద్యా కోర్సులు నేర్చుకుంటారు. మగవారంతా ఊళ్లోని సమస్యల గురించి మాట్లాడుకుంటుంటారు. పిల్లల్ని చదువు దిశగా, పెద్దవారిని మానవ సంబంధాల వైపు నడిపించే ఈ ఆలోచన చేసింది ఆ గ్రామ సర్పంచి విజయ్‌ మోహితే. అందుకు కారణం... కరోనా తరవాత సరిగా స్కూళ్లు లేక పిల్లలు చదువులో వెనకబడిపోయారు. తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వారు నిమగ్నమవుతున్నారు. మరోవైపు పిల్లలు పుస్తకాలకు బదులు ఫోన్లతోనే గడిపేస్తున్నారు. టీచర్లు ఎంత చెప్పినా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో ఆ గ్రామ సర్పంచికి సమస్యను వివరించారు. అందుకే వాళ్లలో మార్పు తీసుకురావాలని ‘డిజిటల్‌ డిటాక్సిఫికేషన్‌’ నిర్ణయం తీసుకున్నాడు విజయ్‌. అంగన్‌వాడీ కార్యకర్తల సహకారంతో దాన్ని పక్కాగా అమలు చేస్తున్నాడు. దాంతో మహిళలు కొత్త కోర్సులు నేర్చుకుంటున్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులు పిల్లల హోం వర్కుల విషయంలో సాయమందిస్తున్నారు. మగవారంతా సత్సంబంధాలతో గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు.  


పోషకాహారానికి ప్రాధాన్యం

పల్లెల్లో ఉండేవారు చాలామంది పనుల గురించి తప్ప తీసుకునే ఆహారం మీద అసలు శ్రద్ధ పెట్టరు. అయితే రాజస్థాన్‌లోని బుండి సర్పంచి మహేందర్‌ కుమార్‌ శర్మ తమ గ్రామంలోని చిన్నారులకీ, మహిళలకీ పోషకాహారం అందించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాడు. బాల్యవివాహాల్ని అడ్డుకుంటూ- ఆడపిల్లల్ని స్కూళ్లకు పంపాలనే కచ్చితమైన నిబంధన పెట్టాడు. తన తల్లికి బాల్య వివాహం జరగడంతో ప్రసవమయ్యాక తీవ్రఅనారోగ్య సమస్యల్ని ఎదుర్కొందని తెలిసి ఆ నిర్ణయం తీసుకున్నాడు. అందుకే గ్రామంలో మహిళలకూ, చిన్నారులకూ ప్రతినెలా వైద్య పరీక్షలు చేయిస్తుంటాడు. పోషకాహార లోపంతో బాధపడేవారికి డ్రైఫ్రూట్స్‌, పళ్లూ, కాయగూరలూ తన ఖర్చులతోనే అందిస్తుంటాడు. బాలింతలూ, పసిపిల్లల ఆరోగ్యం గురించి ఇంటింటికీ వెళ్ల్లి ఆరా తీస్తుంటాడు. ప్రతి ఆదివారం మాంసాహారాన్ని రాయితీతో అమ్మాలనే నిబంధన కూడా అమలు చేస్తున్నాడు. మహేందర్‌ మూలంగా గ్రామస్థులు ఆహారం, ఆరోగ్యం మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. పిల్లలు పోషకాహారలోపం బారిన పడకుండా పూర్తి ఆరోగ్యంతో స్కూళ్లకు వెళుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు