బొజ్జగణపయ్యకు... భక్తితో!

వినాయకచవితి రోజున స్వామికి భక్తిశ్రద్ధలతో పూజ చేశాక... నైవేద్యాన్ని నివేదించడం తెలిసిందే. ఆ వంటకాల్లో ఈసారి స్వామికి ఇష్టమైన పదార్థాలను ఇలాంటి రుచుల్లో చేస్తే సరి. 

Updated : 30 Aug 2022 14:25 IST

బొజ్జగణపయ్యకు... భక్తితో!

వినాయకచవితి రోజున స్వామికి భక్తిశ్రద్ధలతో పూజ చేశాక... నైవేద్యాన్ని నివేదించడం తెలిసిందే. ఆ వంటకాల్లో ఈసారి స్వామికి ఇష్టమైన పదార్థాలను ఇలాంటి రుచుల్లో చేస్తే సరి. 


బెల్లం సొజ్జప్పాలు

కావలసినవి: మైదా: అర కప్పు, బొంబాయిరవ్వ: కప్పు, నెయ్యి: టేబుల్‌స్పూను, ఉప్పు: అరచెంచా. స్టఫింగ్‌కోసం: తాజా కొబ్బరి తురుము: కప్పు, ఎండుకొబ్బరిపొడి: అరకప్పు, బెల్లం తరుగు: ఒకటిన్నర కప్పు, గసగసాలు: రెండు టేబుల్‌ స్పూన్లు, రవ్వ: రెండు టేబుల్‌ స్పూన్లు, యాలకులపొడి: చెంచా, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: ఓ గిన్నెలో మైదా, రవ్వ, నెయ్యి, ఉప్పు తీసుకుని అన్నింటినీ కలుపుకోవాలి. ఆ తరువాత నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా చేసుకుని దానిమీద తడి వస్త్రాన్ని కప్పి గంటసేపు నాననివ్వాలి. స్టౌమీద బాణలిని పెట్టి గసగసాలు, రవ్వను విడివిడిగా వేయించుకోవాలి. అదే బాణలిలో బెల్లం తరుగు వేసి.. పావు కప్పు నీళ్లు పోయాలి. బెల్లం కరిగాక కొబ్బరితురుము, కొబ్బరిపొడి వేసి స్టౌని తగ్గించి కలుపుతూ ఉండాలి. ఇది దగ్గరకు అవుతున్నప్పుడు యాలకులపొడి, రవ్వ, గసగసాలు వేసి కలిపి స్టౌని కట్టేయాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని...చిన్న చపాతీలా ఒత్తుకోవాలి. అందులో ఒకటిన్నర చెంచా కొబ్బరి మిశ్రమాన్ని ఉంచి... అంచుల్ని జాగ్రత్తగా మూసి మళ్లీ ఒత్తుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండినీ చేసుకోవాలి. వీటిని గాలి తగలని డబ్బాలో వేసుకుంటే వారం వరకూ నిల్వ ఉంటాయి.


డ్రైఫ్రూట్స్‌ మోదక్‌

కావలసినవి: ఖర్జూరాలు: ఒకటిన్నర కప్పు, బాదం-జీడిపప్పు-కిస్‌మిస్‌: పావుకప్పు చొప్పున, ఎండుకొబ్బరిముక్కలు: పావుకప్పు, గసగసాలు: రెండు టేబుల్‌స్పూన్లు, నెయ్యి: చెంచా. 

తయారీ విధానం: ముందుగా బాదం, జీడిపప్పు, ఎండు కొబ్బరిముక్కలు, గసగసాలను విడివిడిగా వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో నెయ్యి వేయాలి. అందులో కిస్‌మిస్‌, ఖర్జూరాలను వేసి రెండు నిమిషాలు వేయించి దింపేయాలి. ఇప్పుడు ఈ పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసుకుని బరకగా గ్రైండ్‌ చేసుకుని తీసుకోవాలి.  ఆ తరువాత మోదక్‌ అచ్చులో ఈ మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి నొక్కితే... డ్రైఫ్రూట్స్‌ మోదక్‌ తయారైనట్లే. ఇదేవిధంగా మిగిలిన మిశ్రమాన్నీ చేసుకోవాలి.  


బెల్లం-రవ్వ ఉండ్రాళ్లు

కావలసినవి: బొంబాయిరవ్వ: అరకప్పు, బెల్లం తరుగు: అరకప్పు, తాజా కొబ్బరి తురుము: పావుకప్పు, పెసరపప్పు: టేబుల్‌స్పూను (అరగంట ముందు నానబెట్టుకోవాలి), యాలకులపొడి: పావుచెంచా, నెయ్యి: రెండు చెంచాలు, నీళ్లు: కప్పు.

తయారీ విధానం: స్టౌమీద బాణలిని పెట్టి రవ్వను దోరగా వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో నీళ్లు, బెల్లం తరుగు వేసుకోవాలి. బెల్లం కరిగి పాకంలా అవుతున్నప్పుడు కొబ్బరితురుము, పెసరపప్పు వేసి కలపాలి. రెండు నిమిషాలయ్యాక బొంబాయిరవ్వ, యాలకులపొడి, చెంచా నెయ్యి వేసుకుని బాగా కలిపి స్టౌని సిమ్‌లో పెట్టి దగ్గరకు అయ్యాక దింపేయాలి. వేడి పూర్తిగా చల్లారాక చేతికి నెయ్యి రాసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఉండ్రాళ్లలా చేసుకుని ఆవిరిమీద ఎనిమిది నుంచి పది నిమిషాల వరకూ ఉడికించుకుని తీసుకోవాలి.


పాలకూర వడ

కావలసినవి: మినప్పప్పు: ఒకటిన్నర కప్పు, పాలకూర తరుగు: పావుకప్పు, కొత్తిమీరా, పుదీనా తరుగు: రెండూ కలిపి అరకప్పు, పచ్చిమిర్చి తరుగు: రెండు చెంచాలు, అల్లం: చిన్నముక్క, ఉప్పు: తగినంత, నూనె:
వేయించేందుకు సరిపడా, జీలకర్ర: చెంచా, కరివేపాకు తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీ విధానం: మినప్పప్పును నాలుగైదు గంటల ముందు నానబెట్టుకోవాలి. ఆ తరువాత నీళ్లు పూర్తిగా వంపేసి మిక్సీలో వేసుకుని రెండుమూడు చెంచాల నీళ్లు చల్లుకుంటూ... గారెల పిండిలా గట్టిగా రుబ్బుకుని తీసుకోవాలి. పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం కూడా మెత్తని పేస్టులా చేసుకుని మినప్పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ మినప్పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని పల్చని గారెల్లా చేసుకుంటూ కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


చిట్కా

కొబ్బరిపాలు చిక్కగా రావాలంటే...

పిండివంటల తయారీలో కొబ్బరిపాలు, కొబ్బరితురుమును వాడు తున్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

* తాజా కొబ్బరి తురుములో కొద్దిగా తడి ఉంటుంది. ఆ తడి కూడా లేకుండా ఉండాలంటే... కొబ్బరిని మిక్సీలో వేసుకుని గ్రైండ్‌ చేసుకున్నా... తురుముకున్నా... బాణలిలో దోరగా వేయించుకుంటే సరి. లేదంటే.. అవెన్‌లో అయిదారు నిమిషాలు బేక్‌చేసుకుంటే తడిపోతుంది.

* కొబ్బరిపాలు పల్చగా అయ్యాయా...  మూడు చెంచాల చల్లని నీళ్లల్లో చెంచా మొక్కజొన్నపిండిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయిని పెట్టి కొబ్బరిపాలు పోసి.. స్టౌని సిమ్‌లో పెట్టాలి. అందులో మొక్కజొన్న మిశ్రమాన్ని వేసి.. కలుపుతూ ఉంటే అయిదారునిమిషాలకు పాలు చిక్కగా మారతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..