Updated : 27 Nov 2022 03:51 IST

గంగా నదిలో...పడవ ప్రయాణం

నాలుగువేల కిలోమీటర్ల నదీ విహారం... 2 దేశాల్లో 50 రోజుల్లో 50 పర్యటక ప్రాంతాలను చుట్టేస్తూ సాగే అద్భుత యాత్ర- అందులోనూ అత్యాధునిక సౌకర్యాలు కలిగిన క్రూజ్‌ షిప్‌లో! తలుచుకుంటేనే ఎగ్జైటింగ్‌గా ఉంది కదా... జీవితాంతం మర్చిపోలేని అనుభవాలను అందించే ఆ యాత్ర ఎప్పుడు ఎక్కడ ప్రారంభమవుతోందీ అంటే...

సంపన్నులంటే పెద్ద పెద్ద క్రూజ్‌ షిప్పుల్లో సముద్రయానాలు చేస్తూ జలవిహారాన్ని ఆస్వాదిస్తుంటారు. సామాన్యులకు ఆ ఆనందాన్ని నదులపై తిరిగే పడవలే అందిస్తున్నాయి. ఒకటి రెండ్రోజుల పాటు లేదంటే వారం పాటు నదీవిహారాల్ని ఏర్పాటు చేస్తున్నాయి ఆయా రాష్ట్రాల్లోని పర్యటక శాఖలు. అయితే, ఈసారి ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యటక ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం చేపట్టబోతోంది. ‘గంగా విలాస్‌’ పేరుతో నౌకను రూపొందించి సుదీర్ఘ ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నారు అధికారులు. విభిన్న ప్రాంతాల గుండా సాగుతూ థ్రిల్‌ను పంచే ఈ ప్రయాణం ప్రత్యేకతలు ఎన్నో.

వారణాసిలోని గంగా నదిలో 2023 జనవరి 10న మొదలయ్యే తొలి అతిపెద్ద నౌకా విహారం 50 రోజుల్లో... 2 దేశాల్లో... 27 నదుల్లో... 4000 కిలోమీటర్లు సాగుతుంది. సకల సౌకర్యాలూ కలిగిన గంగా విలాస్‌ క్రూజ్‌ వారణాసిలో మొదలై- బక్సర్‌, రామ్‌నగర్‌, ఘాజీపూర్‌ మీదుగా ఎనిమిదో రోజు పట్నా చేరుతుంది. అక్కడి నుంచి 12 రోజుల తరవాత కోల్‌కతాలో అడుగుపెడుతుంది. ఉదయానికి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ గంగ-బ్రహ్మపుత్ర సంగమ స్థానం నుంచి బ్రహ్మపుత్ర నది గుండా భారత్‌లోని అసోం వైపు సాగుతుంది. అలా బంగ్లాదేశ్‌లో దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మార్చి 1 నాటికి అసోంలోని బోగీబీల్‌ చేరడంతో యాత్ర ముగుస్తుంది.

జాతీయపార్కుల గుండా

భారతదేశం- బంగ్లాదేశ్‌ల్లో 27 నదీ వ్యవస్థల గుండా ప్రయాణించే ఈ అతిపెద్ద పడవ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతాలను తాకుతూ ముందుకు సాగుతుంది. యాభై రోజుల్లో యాభై ప్రాంతాలను సందర్శించేలా అధికారులు ప్రయాణ మార్గాన్ని రూపొందించారు. అలానే, మనదేశంలో సుందర్‌బన్స్‌ డెల్టా, కజిరంగా నేషనల్‌పార్క్‌తో సహా అనేక జాతీయ పార్కుల గుండా ప్రయాణిస్తుంది గంగా విలాస్‌ క్రూజ్‌. దీనిలో మొదలు నుంచి చివరి దాకా యాత్ర చేయాలనుకునే వారితో పాటు నిర్దేశిత ప్రాంతాల్లో దిగిపోవాలనుకునే వారికీ అవకాశం కల్పిస్తున్నారు. అంటే వారణాసిలో ఎక్కి పట్నాలో దిగిపోవచ్చు. పట్నాలో ఎక్కి కోల్‌కతాలో దిగొచ్చన్నమాట.

అంతారా లగ్జరీ రివర్‌ క్రూజెస్‌, జేఎం బాక్సీ రివర్‌ క్రూజ్‌ సంస్థలతో కలిసి ప్రభుత్వ ‘ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ ఈ యాత్రలను నిర్వహించనుంది. టికెట్‌ ధరను ఇంకా నిర్ణయించాల్సి ఉంది. బుకింగ్‌ వివరాలను కూడా త్వరలోనే వెల్లడిస్తారు. ఇక, అంతారా సంస్థ ఆధునిక సౌకర్యాలు, స్టైలిష్‌ ఇంటీరియర్‌ లుక్‌తో రూపొందించిన గంగా విలాస్‌లో 18 లగ్జరీ సూట్స్‌, ఇతర కామన్‌ రూమ్స్‌ ఉన్నాయి. గదుల్లో వైఫై, ఏసీ, టీవీ, బయటకు చూసేందుకు బాల్కనీ వసతి, స్మోక్‌ డిటెక్టర్‌ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. జిమ్‌, స్పా, రెస్టరంట్‌ అదనం. రెస్టరంట్‌లో కాంటినెంటల్‌తోపాటు దేశీ రుచుల్నీ అందించే షెఫ్‌లూ ఉన్నారు. నచ్చిన మెనూ ఎంచుకుని ఎంచక్కా ఆస్వాదించే బఫే కౌంటర్లనీ సిద్ధం చేసి ఉంచారు. అలానే, ఈ సుదీర్ఘ ప్రయాణంలో వినోదం కోసం సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలూ ఉంటాయి. గంగమ్మను కళ్లారా చూడాలనీ... ఒక్కసారి అక్కడ పవిత్ర స్నానం చేయాలనుకునే వాళ్లెందరో కదా. మరి ఆ నదిలోనే విహారమంటే... ఎంత ఉల్లాసం... మనసుకు ఎంత ఆనందం! అది మన సొంతం కావాలంటే గంగా విలాస్‌ క్రూజ్‌లోకి ఎక్కేయాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు