ఆ సూర్యకిరణం.. ఓ అనుకోని అద్భుతం!

రామప్ప ఆలయంలో... రాతిగుట్టల్ని కాస్తా రమణీయ శిల్పాలుగా మార్చినప్పుడు మనం లేము. లేపాక్షిలో... బండరాళ్లని గాల్లో తేలే స్తంభాలుగా ఎలా మలచారో ఎవ్వరం చూడలేదు.

Updated : 22 Mar 2022 15:48 IST

ఆ సూర్యకిరణం.. ఓ అనుకోని అద్భుతం!

రామప్ప ఆలయంలో... రాతిగుట్టల్ని కాస్తా రమణీయ శిల్పాలుగా మార్చినప్పుడు మనం లేము. లేపాక్షిలో... బండరాళ్లని గాల్లో తేలే స్తంభాలుగా ఎలా మలచారో ఎవ్వరం చూడలేదు. అరసవల్లిలో... సూర్యకిరణాలు దేవుని పాదాలు తడిమే అద్భుతం ఎలా సాధ్యమైందో కూడా ఎరగం. ఈ వాస్తుశిల్ప అద్భుతాలు నేటికాలంలోనూ సాధ్యమేనని... యాదాద్రితో ప్రత్యక్షంగా చూపించారు ఆనంద్‌ సాయి. ‘గుట్ట’ని కాస్తా దిట్టమైన శిల్పాల దేవాలయంగా మార్చిన రూపశిల్పి ఆయనే. ఓ సినిమా కళాదర్శకుడు తనను తాను వాస్తుశిల్పిగా మార్చుకున్న ఆ విశిష్ట ప్రయాణం...

సాయి మాటల్లోనే...

‘శ్రీరంగ రంగనాథుని దివ్యరూపము చూడవే...’ - ఆ ఆలయంలోకి అడుగుపెడుతు న్నప్పుడు నా చెవుల్లో ఈ పాట రింగుమంటూ ఉంది. ఇంకా వేసవి ప్రారంభంకాకున్నా... ఎండ చుర్రుమంటోంది. పక్కనే-కావేరి ఉపనది కొల్లిడం చల్లటి గాలిని పంపిస్తున్నా... ఉక్కపోత తగ్గట్లేదు. కానీ ఆ ఉక్కపోత ఆలయంలోకి అడుగుపెట్టేదాకే. లోనికి ప్రవేశించాక చల్లదనం చుట్టుముట్టేసింది. ఇందుకు కారణమేమిటా అని చుట్టూ చూస్తే... అప్పుడు నా కళ్లలో పడింది నల్లరాయి! ఆ రోజు తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో ఉన్నాన్నేను. అక్కడి శ్రీరంగనాథుడే కాదు గర్భగుడి, ముఖమంటపం, స్తంభాలూ... ఇలా చాలావరకూ ఇప్పుడు మనం కృష్ణశిల అంటున్న నల్లరాయితో నిర్మించినవే. అందువల్లే బయటెంత ఉక్కపోత ఉన్నా... లోపల చల్లగానే అనిపించింది. ‘ఇదే కృష్ణశిలని... యాదాద్రి ఆలయంలో వాడితే ఎలా ఉంటుంది?’ అనిపించింది. శ్రీరంగం మెట్లమీదే కూర్చుని వెంటనే కాగితం, స్కెచ్‌లు తీసి ఓ నమూనాని గీసి చూశాను... అద్భుతంగా ఉంటుందనిపించింది. అప్పుడు నాకు మరో ఆలోచనా వచ్చింది... ‘కేవలం గర్భాలయానికో, ముఖమండపాలకో పరిమితం కాకుండా ఆలయం యావత్తూ ఈ కృష్ణశిలనే ఉపయోగిస్తే?’ అని. ప్రపంచంలో ఏ ఆలయంలోనూ అలా లేదు... అది సాధించిన ఘనత యాదాద్రికే దక్కుతుందనుకున్నాను. కానీ అదంత సులభంకాదు. ఈ గట్టిశిలని శిల్పంగా మార్చడం చాలా కష్టం. మిగతా రాళ్లలా ఇది ఉలికి అంత సులభంగా లొంగదు. నా డిజైన్స్‌లోని అతి సూక్ష్మమైన అందాలని ఈ రాళ్లలోకి తేవాలంటే శిల్పులు చాలా కష్టపడాలి. దాంతోపాటూ రాయి సేకరణకయ్యే ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. అందువల్ల కాస్త తటపటాయింపుతోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు ఈ ప్రతిపాదనని పెట్టాను. ఆయన వెంటనే పనుల్లోకి దిగమన్నారు. మొదట్లో నా అంచనా లక్షన్నర టన్నుల కృష్ణశిల కావాలని. కానీ పనులన్నీ పూర్తయ్యేసరికి మరో 70 వేల టన్నులు అవసరమయ్యాయి. అయితేనేం... రాజగోపురం నుంచి రాతిమెట్లదాకా అణువణువునా కృష్ణశిలని నింపుకున్న తొలి ఆలయంగా యాదాద్రి నిలిచింది. ఇదొక్కటే కాదు... ఈ ఆలయం వెనక మరెన్నో ఆలయాల స్ఫూర్తి ఉంది.

ఆ విశేషాల్లోకి వెళ్లేముందు...

యాదగిరి గుట్టకి 2010లో తొలిసారి మా మామగారితో కలిసి వెళ్లాన్నేను. కింద నుంచి చూస్తే చాలా మామూలుగా అనిపించింది. పైకి వెళ్లినా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ కనిపించలేదు. కానీ... దర్శనం కోసం మెట్లు దిగుతున్నప్పుడూ, గుహలోకి వంగి నడుస్తున్నప్పుడూ ‘ఇదీ అని చెప్పలేని’ అనుభూతేదో నన్ను చుట్టుముట్టింది. ఎదుట ఉన్న లక్ష్మీనరసింహుడు ఒక్కసారిగా నా గుండెకి దగ్గరైపోయాడు. చిన్నప్పటి నుంచీ నేను దేశంలోని ఎన్నో ఆలయాలని సందర్శిస్తూ ఉన్నాను కానీ... ఇలాంటి ఆత్మీయ ఆధ్యాత్మిక భావనకి లోనైన సందర్భాలు చాలా తక్కువ.

ఇంటికొచ్చాక పనుల్లో పడి ఆ ఆలయాన్ని పూర్తిగా మరచిపోయాను. సినిమాలతోపాటూ వీఐపీల పెళ్ళిళ్ళకి ఆలయంలాంటి సెట్టింగులు వేస్తూ బిజీ అయిపోయాను. అలా ఓసారి ‘మై హోమ్స్‌’ సంస్థవాళ్ల పెళ్ళికి నేను వేసిన సెట్‌ చినజీయర్‌ స్వామిగారికి బాగా నచ్చిందట. నన్నోసారి పిలిచి హైదరాబాద్‌ శివారులో నిర్మిస్తున్న సమతామూర్తి ఆధ్యాత్మిక కేంద్రానికి డిజైన్‌ చేసే బాధ్యతలు అప్పగించారు.

ఆ పనులు చేస్తున్నప్పుడే - యాదాద్రి కోసం డిజైన్స్‌ ఎంపిక చేస్తున్నారని స్వామీజీ చెప్పారు. అందుకోసం యాదాద్రిని డిజైన్‌ చేయడానికి కూర్చున్నాను.

మూడేళ్లకిందట చూసిన ఆలయం ఇప్పుడు నాకు బొత్తిగా గుర్తురాలేదు. గూగుల్‌ శాటిలైట్‌ చిత్రాల సాయంతో యాదగిరి గుట్టని చూస్తుంటే... నాకు ఆలయం ఎక్కడా కనపడలేదు. చుట్టూ ఉన్న నిర్మాణాలు ఆలయాన్ని మరుగుపరిచాయి. అలాకాకుండా- ఎంత దూరం నుంచి చూసినా ఆలయం కనిపించేలా పొడవైన విమానంతో, విశాలమైన ప్రాకారాలతో డిజైన్‌ చేశాను. అది తీసుకుని సెక్రటేరియట్‌లోని సీఎం ఛాంబర్‌లోకి అడుగుపెట్టగానే ఆయన అధికారులతో ‘వచ్చేవారం గుట్టకి వెళ్లడానికి ప్లాన్‌ చేయండి’ అంటున్నారు. నన్ను చూడగానే డిజైన్‌ చూపించమన్నారు. చూడగానే... ‘నా చిన్నప్పుడు రైల్లో పోతుంటే ఆలయం చక్కగా కనిపించేది. ఇప్పుడలా లేదు. మీ డిజైన్‌తో సుదూరం నుంచి కూడా ఆలయం కనిపిస్తుంది, బావుంది’ అన్నారు. వెంటనే అధికారులతో ‘యాదాద్రికి వచ్చేవారం కాదు... సాయితోపాటూ ఎల్లుండే వెళతాను!’ అనేశారు.

ఆ సమస్యని ఊహించలేదు...

సీఎంతోపాటూ యాదగిరి గుట్టకి వెళ్లాకకానీ నా డిజైన్‌లో ఉన్న ప్రధాన సమస్యేమిటో అర్థంకాలేదు. నేను దక్షిణంవైపు ఖాళీ స్థలం ఉంటుందని ఊహించి... అక్కడ మాడవీధులు ఉండేలా గీశాను. కానీ దక్షిణం - గుట్టకి లోయలాంటి ప్రాంతం... అక్కడ వీధులెలా సాధ్యమవుతాయి... ఇలా చేశానేమిటబ్బా!’ అనుకున్నాను. కానీ సీఎంకి నా డిజైన్‌ మార్చడం ఇష్టం లేదు. అప్పుడే లోతట్టుగా ఉన్న ప్రాంతాన్ని ఎత్తుపెంచి గోడలా కడదామన్న ఆలోచన వచ్చింది. ఈ పనికి కనీసం వందకోట్లన్నా ఖర్చవుతుంది. అయినా సరే... ముందుకే వెళదామన్నారు సీఎం. అంతేకాదు, ఆ కొండమొత్తాన్నీ నాకు అప్పగించింది. బస్‌ షెల్టర్‌, క్యూలైన్‌, ఇతరత్రా ఆలయాల డిజైన్‌... అన్నీ నన్నే చూసుకోమన్నారు. ముందుగా డ్రోన్‌ల ద్వారా ఫొటోలు తీయించి, ఆ ఫొటోలపైన నా డిజైన్‌ని పెట్టి... దాని ప్రకారం మార్పులు చేయడం మొదలుపెట్టాను. ఆలయంలోని ప్రతి అణువునీ పరిగణనలోకి తీసుకుని... రెండేళ్లపాటు ఆగమశాస్త్రానుగుణంగా నాలుగువేల డిజైన్‌లు రూపొందించాను. ప్రపంచంలో ఎక్కడాలేని విశేషాలని దీనికి అద్దాలనుకున్నాను. ఆలయం మొత్తం కృష్ణశిలతో నిర్మించాలన్నది అందులో ఒకటి. మిగతావాటిల్లో నా మనస్సుకి బాగా దగ్గరైనవి ఇవి...

విమానం తీరు వేరు...

మన భారతదేశంలోని ఆలయాలు స్థూలంగా నాగర, ద్రవిడ అని రెండు రకాల వాస్తు నిర్మాణంలో ఉంటాయి. నాగర అంటే ఉత్తరాది శైలి, ద్రవిడ అంటే దక్షిణాది శైలి. దక్షిణాదిలోనూ పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ అని మరెన్నో రకాలున్నాయి. మన ప్రాచీన ఆలయాలన్నీ వీటిలో ఏదో ఒక శైలిలో ఇమిడిపోతాయి. కానీ... నేను దేశంలోని అన్ని శైలుల్నీ ఒక్క యాదాద్రి ఆలయంలోనే చూపాలనుకున్నాను. రాజగోపురంతోనే ఇందుకు శ్రీకారం చుట్టాను. తిరుమల ఆలయాల్లో ఉండే దక్షిణాది ‘రాయల’ గోపురమే దీనికి నమూనా. మిగతా ఐదుగోపురాలకీ ఇదే పద్ధతి పాటించాను కానీ... విమానం విషయంలో ప్రత్యేకత చాటాలనుకున్నాను. తిరుమల ఆలయంలా చిన్నగా కాకుండా... ఎంతదూరం నుంచైనా కనపడేలా ఎత్తుగా పెట్టాలనుకున్నాను. ఇందుకోసం గత వెయ్యేళ్లుగా ఎవరూ వాడని పల్లవుల గోపురం శైలిని తీసుకున్నాను. దానిపైన సుదర్శన చక్రంపెట్టాను!

అష్టభుజ మండపాలు...

భక్తులు దర్శనానికి వచ్చినప్పుడో... బ్రహ్మోత్సవాలప్పుడు స్వామివారి ఊరేగింపుని చూడటానికో... అన్ని ఆలయాల్లోనూ క్యూలైన్‌లు విడిగా ఉంటాయి. ఇవి గుడికి సంబంధించిన మిగతా ఆర్కిటెక్చర్‌తో కలవకుండా ఓ షెడ్డులా అనిపిస్తాయి. అలా కాకుండా... నేను మొదటి ప్రాకారాన్నే భక్తులు వెళ్లగలిగే మండపంలా మార్చాను. భక్తులకి చల్లటి నీడనిచ్చే ఇంతపెద్ద అష్టభుజ మంటపం దేశంలో ఇంకెక్కడా ఉండదు.

ఓ ఆలయాన్ని నిర్మించే శిల్పులు... తమ కళాసామర్థ్యం మొత్తాన్నీ చూపేది ముఖమండపం నిర్మాణంలోనే. యాదాద్రి ఆలయంలో ఆ ముఖమండపాన్ని ఓ మహరాజమందిరంలానే తీర్చిదిద్దాలని భావించాను. తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి ఆలయంలోని సాలభంజిక రూపాల్ని ప్రేరణగా తీసుకున్నాను. కాకపోతే  వైష్ణవ ఆళ్వార్ల ప్రతిమల్ని పెట్టాలనుకున్నాం. ఆ ఆలోచన బాగానే ఉన్నా... ఆళ్వార్ల ప్రతిమలు కూర్చున్న భంగిమలోనే ఉంటాయి. కూర్చున్న మూర్తులకి పెద్దగా అందాల్ని తీసుకురాలేము. ఈ విషయాన్నే జీయర్‌ స్వామిగారితో చర్చిస్తే నిల్చున్నట్టే విగ్రహాలని చేయమన్నారు. అలా పన్నెండుమంది ఆళ్వార్లని సుందరమూర్తు లుగా ముఖమండపంలో తీర్చిదిద్దాం.

దీపం వెలిగించినట్టే...

గర్భగుడిలో వెలిగించిన దీపం... మూలవిరాట్టు మోముపైన పడి ఎంత చక్కటి దివ్యరూపాన్ని సాక్షాత్కరింపచేస్తుందో కదా! ఒక్క మూలవిరాట్టే కాదు ఆలయంలోని ప్రతి దేవతామూర్తికీ అలాంటి దివ్యరూపాన్ని ఇవ్వాలని లైట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. రాత్రుల్లో ఈ విగ్రహాలని చూస్తే... వాటికవే చుట్టూ వెలుగుని సంతరించుకున్న భావన కలిగేలా ప్రత్యేక హోల్డర్‌లు వాడాం. ఆలయం వెలుపలా ఓ క్యూలైన్‌ ఏర్పాటుచేయాలన్న నిర్ణయం చివర్లో తీసుకున్నదే కానీ... అది కూడా ప్రత్యేకంగా ఉండాలనుకున్నాను. ఇత్తడితో అడుగడుగునా శిల్పకళ ఉట్టిపడేలా ఉత్తరాది ‘నగర’ పద్ధతిలో డిజైన్‌ చేశాను. కాకపోతే, ఇత్తడి ఎక్కువ వేడిని వెదజల్లుతుంది. ఆ సమస్యని నివారించడానికి ఇత్తడికి అల్యూమినియం జతచేసి... అందమైన రూపాలని తీర్చిదిద్దాం. మనదేశంలో ఎక్కడా ఇలాంటి క్యూలైన్‌ని చూడలేం.

అనుకోని అద్భుతం ఇది...

శ్రీకాకుళం అరసవిల్లి ఆలయంలో ఏడాదికోసారి సూర్య కిరణాలు దేవుని పాదం చెంత పడతాయి కదా... యాదాద్రిలో ప్రతి సూర్యాస్తమయానా అలాంటి అద్భుతాన్ని చూడొచ్చు. నిజానికి, ఇందుకోసం మేము ప్రత్యేకంగా ఏదీ చేయలేదు. ఆగమశాస్త్రం ప్రకారం అన్నీ ఒకే లైన్‌లో ఉండేలా తీర్చిదిద్దుతుంటే... వేంచేపు మండపం నుంచి నేరుగా ఇలా సూర్యకిరణం పడటాన్ని గమనించాము. ఆ కిరణానికి ఏ అడ్డూరాకుండా చిన్నపాటి మార్పులు చేశామంతే. ఈ అద్భుతం ఎలా జరిగింది... అసలు ఈ ఆలయ పునరుద్ధరణ ఈ స్థాయిలో ఇంత వేగంగా ఎలా సాధ్యమైంది... అని ఆలోచిస్తే నాకు అనిపిస్తున్నదల్లా ఒక్కటే... డిజైన్‌ చేసింది నేనే అయినా, దాన్ని దీక్షగా అమలు చేసింది సీఎం కేసీఆర్‌ అయినా... ఈ పనులన్నీ చేయించుకుంది మాత్రం ఆ లక్ష్మీనారసింహుడే అని!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..