Updated : 18 Sep 2022 12:04 IST

వీళ్లు పేదల కలెక్టర్లు!

కలెక్టరుగా తమ విధులు నిర్వహిస్తూనే సామాన్యుల గురించీ ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు వీళ్లంతా. హోదాను పక్కన పెట్టి... పేదలతో మమేకమైన ఆ కలెక్టర్లు ఎవరూ ఏం చేస్తున్నారూ అంటే...


వారాంతం వైద్యం చేస్తూ...

కలెక్టర్‌ హోదాలో వారమంతా బిజీబిజీగా ఉంటుంది ఆకాంక్ష భాస్కర్‌. ఆదివారం, సెలవురోజుల్లో మాత్రం డాక్టర్‌గా పేదలకు వైద్యం చేసి మందులు ఉచితంగా అందిస్తుంటుంది. కనీసం రోడ్డు వసతి కూడా లేని గిరిజన గ్రామాలకూ కాలినడకన వెళ్లి శిబిరాలు ఏర్పాటు చేస్తుంటుంది. అలానే మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి అక్కడ సమస్యలేంటో తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా అడుగులేస్తుంటుంది. వైద్యం కోసం ఆమె బంగ్లాకు ఎవరొచ్చినా సేవలందించే ఆకాంక్ష పుట్టి పెరిగింది వారణాసిలో. తల్లిదండ్రుల స్ఫూర్తితో డాక్టరైన ఆమె ఉద్యోగంలో భాగంగా ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అక్కడ కనీస సౌకర్యాలూ, సిబ్బందీ లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కోవడం- మారుమూల గ్రామాల వాళ్లు అనారోగ్యాల గురించి కనీస అవగాహన లేక పసరు మందులపైనే ఆధారపడటం చూసింది. అలాంటి పరిస్థితుల్లో మార్పులు తేవాలని కష్టపడి చదివి ఐఏఎస్‌ అయి పశ్చిమబంగాలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్‌గా పనిచేసింది. తరవాత పంచాయతీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీగా బదిలీ అయినా ఆమె సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది.


సైకిల్‌పైనే విధులకి

ఐఏఎస్‌ అధికారులకు ప్రభుత్వం వాహనాల్నీ, ప్రత్యేక సిబ్బందినీ కేటాయిస్తుంది. వాళ్లు ఎక్కడికెళ్లినా ఇతర అధికారులూ, సహాయకులూ ఎప్పుడూ వెంటే ఉంటారు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌ జిల్లా కలెక్టర్‌ సందీప్‌ మాత్రం ఎలాంటి ఆర్భాటంగానీ, వాహనాలుగానీ, సిబ్బందీగానీ లేకుండా సొంత సైకిల్‌పైనే బయటకు వెళుతుంటాడు. అత్యవసర మీటింగులున్నప్పుడూ, వర్షాలు పడినప్పుడూ, దూర ప్రాంతాలకి వెళ్లేటప్పుడూ మాత్రమే ప్రభుత్వ వాహనాన్ని వాడుకుంటాడు. కాలుష్యాన్ని తగ్గించాలనీ, ఇంధనాన్ని ఆదా చేసి ప్రభుత్వానికి ఖర్చు తగ్గించాలనీ ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. అలానే సైకిల్‌పైన వెళ్లేటప్పుడు రోడ్లు ఎలా ఉన్నదీ అర్థమవుతుందనీ, ప్రజల సమస్యలు తెలుసుకోవడం సాధ్యమవుతుందనే సందీప్‌ - సమయం దొరికితే చాలు మురికివాడలకీ,
మారుమూల గ్రామాలకీ¨ వెళుతూ సామాన్యులకి ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పిస్తుంటాడు. ఆ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయో లేదో ఆరాతీస్తుంటాడు. అందని వారికి దగ్గరుండి మరీ సమస్యల్ని పరిష్కరించి లబ్ధి చేకూరేలా చూస్తుంటాడు.


వారానికోసారి విందు

మణిపూర్‌లోని తామెంగ్లాంగ్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆర్మ్‌స్ట్రాంగ్‌ పామేని మిరకిల్‌ మాన్‌ అంటారు. పేదరికంలో పుట్టి పెరిగిన ఆర్మ్‌స్ట్రాంగ్‌ టౌసెమ్‌- తామెంగ్లాంగ్‌ మధ్య దాదాపు వంద కిలోమీటర్ల పొడవైన రోడ్డును వేయించాడు. అప్పటి వరకూ ఆ రోడ్డు వసతి లేక 31 గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆ రోడ్డుపైన దృష్టి పెట్టి ప్రభుతాన్ని సంప్రదించాడు. ఎంపీలూ, ఇతర రాజకీయనాయకుల దృష్టికీ సమస్యని తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఆర్మ్‌స్ట్రాంగ్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో ఆ రోడ్డు గురించి వివరిస్తూ విరాళాలు సేకరించడం మొదలుపెట్టాడు. అలా ఆరునెలల్లో దాదాపు 40 లక్షలు సమకూరడంతో ప్రజల సాయం తీసుకుని రోడ్డు వేయించాడు, నదులపైన బ్రిడ్జిలూ కట్టించాడు. ఆ తరవాతా ఎన్నో మంచి పనులు చేశాడు. కొన్నాళ్లకి ఆ రాష్ట్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నాక ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులను వారానికోసారి ఇంటికి పిలిచి భోజనం పెట్టడం మొదలుపెట్టాడు. ఆసమయంలో పిల్లల కలలూ, ఆశయాల గురించి తెలుసుకుంటూ కలెక్టర్‌ కార్యాలయం ఎలా పనిచేస్తుందో వారికి చూపిస్తున్నాడు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts