సిరుల తల్లి వరాల కల్పవల్లి

లక్ష్మీదేవి... సర్వాభరణ భూషితంగా దర్శనమిస్తుంది. బంగారు బిందెల్లోంచి స్వర్ణ కాసులు కురిపిస్తూ ప్రకాశిస్తుంది. ధనం, ధాన్యం, ధైర్యం, సంతానం సకల ఐశ్వర్యాలనూ సమకూరుస్తుంది.

Updated : 23 Mar 2023 03:48 IST

మార్చి 26 శ్రీలక్ష్మీ పంచమి

లక్ష్మీదేవి... సర్వాభరణ భూషితంగా దర్శనమిస్తుంది. బంగారు బిందెల్లోంచి స్వర్ణ కాసులు కురిపిస్తూ ప్రకాశిస్తుంది. ధనం, ధాన్యం, ధైర్యం, సంతానం సకల ఐశ్వర్యాలనూ సమకూరుస్తుంది. మేధో సంపదనిచ్చి నవచైతన్యానికి కారణమవుతుంది..
చైత్ర శుక్ల పంచమి లక్ష్మీ పంచమి. పంచమి శబ్దానికి జ్ఞానమనే అర్థమూ ఉంది. ఆర్జన, పొదుపు, డబ్బు విలువ తెలుసుకోవడం, దుబారాను నియంత్రించడం వంటి ఆర్థిక క్రమశిక్షణ అలవరచు కోవాలన్నదే ఈ పర్వంలో దాగిన రహస్యం. లక్ష్మీదేవి బంగారు ఛాయతో, స్వర్ణాభరణాలతో దర్శనమిస్తుంది. హిరణ్యగర్భజుడైన విష్ణుమూర్తికి అమరిన బంగారు ఛాయ లక్ష్మీదేవి. అందుకే దేవిని ‘హిరణ్యవర్ణాం’ అని వర్ణిస్తూ స్తుతిస్తారు. అంటే విష్ణువుకి లక్ష్మి ప్రకాశాన్ని కలిగిస్తోందని అర్థం. మన శరీరంలో శ్రీలక్ష్మి చెవి తమ్మెల్లో, కాలి చీలమండలో నివాసముంటుందని చెబుతారు. ఈ రెండు చోటుల్లోనే ఎందుకున్నదంటే తక్కువ మాట్లాడి ఎక్కువ వినేవాళ్లు పనిమంతులు, ఆర్జించగలరు. కనుక వినే చెవులు నివాసమయ్యాయి. ఇక చీల మండని సంస్కృతంలో ‘ఉశనం’ అంటారు. ఇది భోగభాగ్యాలకు, ఆరోగ్యానికి, నిత్య కర్మలకు, ఉద్యోగ విధులకు కారణమైన శనీశ్వరుడి స్థానం. అందుకే చీలమండలు తడిసేలా కాళ్లు కడుక్కోమనే సంప్రదాయం ఉంది. అప్పుడే లక్ష్మి నిలుస్తుంది. స్థూలంగా పరిశుభ్రత ఉన్నచోటే లక్ష్మీదేవి నివసిస్తుంది, కర్మలు ఆచరిస్తేనే ధనం వస్తుందని భావం.

లక్ష్మికి ముందు శ్రీ ఎందుకు?

శ్రీ అంటే ధనం, ధాన్యం, సంతానం, వీరత్వం, విజయం, ధైర్యం, విద్య, బంగారం, వెండి, మణి మాణిక్యాల్లాంటి సంపదలన్నీ వస్తాయి. ప్రేమ, బుద్ధి, మేధ వంటి రూపాల్లో మనని జీవింపచేసి నవ చైతన్యానికి కారణమవుతుంది లక్ష్మి. అందుకే పెద్దల పేరుకు ముందు శ్రీ శబ్దం చేర్చి గౌరవించుకుంటాం. పేరుకు ముందు శ్రీ చేర్చకుంటే అది అమర్యాదే కాదు, అశుభమనీ చెబుతారు. కారణం సదరు వ్యక్తి ప్రాణంతో లేరనే అర్థం కూడా వస్తుంది కనుక. ధనధాన్యాది సంపదలు ప్రసాదించమనే కాదు సర్వ జీవులనూ కాపాడమంటూ శ్రీలక్ష్మిని పూజిస్తాం.

గుడ్లగూబ ఎందుకు..

లక్ష్మిని రాత్రి సమయంలో ఆరాధిస్తే విశేష ఫలితముంటుంది. దీనికి సూచిక ఆమె పగటిపూట చూడలేని (దివాంధ ప్రాణి) గుడ్లగూబను తన వాహనంగా చేసుకోవడం. ధర్మార్థకామమోక్షాలను ఆశించే యోగులు రాత్రి నిశ్శబ్ద వేళలో మేల్కొని ధ్యానముద్రలో ఉంటారు. అలాంటి వారంటే తనకు ప్రీతి అని చెప్పడానికే ఆమె ఉలూకం అనే గుడ్లగూబను తన వాహనంగా చేసుకుంది. గుడ్లగూబ రాత్రి వేళల్లో చైతన్యవంతంగా ఉంటుంది కదా! ‘దివాంధ’ పదంలోని ‘దివ’ శబ్దం జ్ఞానాన్ని సూచిస్తుంది. అలాంటి ఙ్ఞాన రూపాన్ని పొందడానికి రాత్రివేళ అనుకూల సమయమని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తుంది ఉలూక వాహనం.

అమావాస్య - లక్ష్మీపూజ

లక్ష్మీదేవి చేత ధరించిన రెండు పద్మాల వెనుక విశేషార్థం ఉంది. అవి సాధకుల మనసుకు సంకేతాలు. కుడిచేతిలోని పద్మం పూర్తిగా వికసించేది పూర్ణిమనాడు. ఎడమ చేతిలోని పద్మం అంతే పూర్తిగా లయించేది అమావాస్య రోజున. ఆ రెండు పద్మాలకు ఇదే అర్థం. శక్తికి ప్రతిరూపమైన ఎడమ చేతిలోని పద్మం పామరులను ఆకట్టుకుంటే, కుడిచేతిలోని పద్మం భక్తులు, సాధకులు, పండితులను ఆకర్షిస్తుంది. దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజిస్తాం. చీకటిలో పూజించడం వల్ల మనసు సంపూర్ణంగా లగ్నమవుతుంది అన్నది అంతరార్థం. అందుకే ఆ అమావాస్య రోజున చేసే లక్ష్మీ పూజకు ప్రాముఖ్యత నిచ్చారు పెద్దలు. లక్ష్మీదేవిని కీర్తిస్తూ అన్నమయ్య ఆణిముత్యాల్లాంటి పద కవితలు అల్లారు. లక్ష్మీపూజ మనలో జవజీవాలు నింపుతుంది. దేవీపూజను నిర్లక్యం చేసిన ఇంద్రుడు, బలి వంటి వారు తమ సర్వ సంపదలూ పోగొట్టుకోవలసి వచ్చింది. తనకు విలువలేని చోట లక్ష్మి క్షణమైనా నిలవదు. ప్రవహించే నీరు ఎంత ఉపయుక్తమో చలనం లేక నిలిచిపోయిన జలం అంత నిరుపయోగం. అది దుర్గంధభూయిష్టం కూడా. సద్వినియోగం చేయని ధనం అలాంటిదే. అందుకే సందలను నిల్వ చేయకూడదు, నలుగురి కోసం వినియోగించాలని హితవు చెబుతారు.

లక్ష్మీదేవి త్యాగబుద్ధి

శ్రీమత్‌ సౌభాగ్యజననీం లక్ష్మీం సనాతనీం
సర్వకామఫలావాప్తి సాధనైక శుభావహమ్‌

అధర్వణ వేదం, లక్ష్మి హృదయంలో పేర్కొన్న ఈ శ్లోకంలో ‘సౌభాగ్యజననీం’ పదానికి లోతైన అర్థముంది. సాధారణంగా స్త్రీలకు ‘భగము’ అనే పదాన్ని అన్వయిస్తే.. ఇందులో ఉన్న అంతరార్థం.. భగమంటే పుట్టుక, నాశనం. జన్మ అంటే ప్రసవం, విజన్మ.. అంటే గర్భస్రావం. విద్య అంటే సంసార సారాన్ని గ్రహించడం. అవిద్య అంటే అలాంటి సంసార పరమార్థాన్ని అర్థం చేసుకోలేక పోవడం. ఆ విధంగా లక్ష్మీదేవి ఆరు సంపదలను కలిగి ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే ఆ అమ్మ.. సర్వజ్ఞత, నిత్య తృప్తి, బోధన, స్వతంత్రత, నిత్య లుప్తి, అనంతత్వం- అనే ఆరు ఐశ్వర్యాలను కలిగి ఉందని గ్రహించాలి. లక్ష్మీదేవి భగ రూపమైన సంతాన సామర్థ్యాన్నీ, సౌభాగ్యాన్నీ తన తోటి స్త్రీ వర్గ జీవులకు వరంగా ప్రసాదిస్తోంది. తాను మాత్రం సంతానం లేకుండా విశ్వంలోని ప్రతి జీవీ తన సంతానమే అంటూ త్యాగబుద్ధిని చాటుతోంది. సంపదలను తోటివారికి పంచడంలోనే సంతోషం, సంతుష్టి ఉన్నాయని లక్ష్మీదేవి బోధిస్తోంది.
డాక్టర్‌ జయదేవ్‌ చల్లా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు