Diwali festival: 5 రోజుల ‘దీపావళి’.. ఈ 4 పురాణ గాథలు తెలుసా?

చిన్నాపెద్దా అందరూ కలిసి ఎంతో ఆనందంగా చేసుకొనే వెలుగుల పండుగ దీపావళి(Diwali festival). తమ జీవితంలో అమావాస్య చీకట్లను పారదోలి వెలుగులు నింపే సంతోషాల సంబరమిది.

Updated : 25 Mar 2023 15:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్నాపెద్దా అందరూ కలిసి ఎంతో ఆనందంగా చేసుకొనే వెలుగుల పండుగ దీపావళి(Diwali festival). తమ జీవితంలో అమావాస్య చీకట్లను పారదోలి వెలుగులు నింపే సంతోషాల సంబరమిది. ఈ తరంలో చాలామంది దీపావళి(Diwali) అంటే ఒక్కరోజు పండుగే అనుకుంటారు. నిజానికి ఇది ఐదు రోజుల పాటు జరుపుకొనే ఆనందాల వేడుక. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలి పాడ్యమి, భగిని హస్త భోజనం (భాయిదూజ్‌) వేడుకల కలబోతగా ఇంటా బయటా కాంతులు నింపే ఈ దివ్వెల పండుగ గురించి చెప్పే పురాణ గాథలివే.. 

మన సనాతన ధర్మంలో ప్రతి పండుగకూ విశేష ప్రాధాన్యం ఉంటుంది. పురాణాల ప్రకారం చీకటి నిరాశ నిస్పృహలకు, అజ్ఞానానికి గుర్తు. కాంతి (వెలుగు) ఆనందానికి, ఉత్సాహానికి ప్రతీక. అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానపు వెలుగుల్లోకి పయనించి జీవితంలో కొత్త అర్థాలు వెతుక్కోవాలని చెప్పడమే దీపావళి ఉద్దేశం. ‘దీపం ఐశ్వర్యం. అంధకారం దరిద్రం. దీపం ఉన్న చోట జ్ఞాన సంపద ఉంటుంది. దీపం సాక్షాత్తూ లక్ష్మీదేవి..’ అని మన పురాణాలు పేర్కొంటున్నాయి. దీపావళి రోజున దీప లక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలూ కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. సనాతన ధర్మంలో ఏ శుభకార్యం జరిగినా దీపాన్ని వెలిగించడం ఒక సంప్రదాయం. దీపకాంతిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో తెలియచేసినది శాస్త్రము. దీపంలో కనిపించే ఎర్రని కాంతి బ్రహ్మదేవునిగా, నీలకాంతి విష్ణు భగవానునిగా, తెల్లటి కాంతి పరమశివునికి ప్రతినిధులుగా చెబుతుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆశ్వయుజ మాసం అమావాస్య స్వాతి నక్షత్రంతో కూడిన రోజును దీపావళిగా తెలియజేశారు. దీపావళికి సంబంధించి పురాణాల ప్రకారం నాలుగు కథలు ఉన్నాయి. 

  • రావణాసురుడితో జరిగిన యుద్ధంతో విజయం సాధించిన శ్రీరామచంద్రుడు సీతాదేవి సమేతంగా అయోధ్యకు విచ్చేసినటువంటి రోజు ఆశ్వయుజ మాసం అమావాస్య అని రామాయణం పేర్కొంది. ఈరోజు దీపాలను వెలిగించి సీతారాములకు స్వాగతం పలికినట్లుగా పురాణాలు తెలియజేశాయి. 
  • నరకాసురుని సంహరించిన తరువాత ఆ రాక్షసుడి పీడ విరగడైపోవడంతో ప్రజలంతా ఈ అమావాస్య రోజు దీపాలను వెలిగించి పండుగలా చేసుకున్నారని.. ఆ పరంపర నేటికీ కొనసాగుతున్నదని పురాణాలు పేర్కొన్నాయి. 
  • పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి దీపావళి రోజే ఉద్భవించినట్లుగానూ చెబుతారు. అష్టైశ్వర్యాలూ ప్రసాదించే లక్ష్మీదేవిని దీపావళి రోజు సాయంత్రం పూజించడం ఎంతో విశేషంగా భావిస్తారు. 
  • మహాభారతంలో కౌరవులు సాగించిన మాయా జూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని తిరిగి తమ రాజ్యానికి వచ్చినటువంటి రోజును దీపావళిగా తెలియజేస్తారు. పైన పేర్కొన్న ఈ నాలుగు పురాణ గాథల ప్రకారం దీపావళి ప్రాధాన్యత మనకు అర్థమవుతోంది.

ఈ ఐదు రోజులూ ఏం చేయాలి?

మన సనాతన ధర్మంలో దక్షిణాయనానికి అందులోను విశేషంగా ఆశ్వయుజ కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దక్షిణాయనంలో ఆశ్వయుజ మాసం బహుళ పక్ష త్రయోదశి నుంచి కార్తీకమాసం శుక్ల పక్ష ద్వితీయ వరకు ఈ 5రోజులూ దీపాల పండుగ లేదా దీపావళి పండుగగా ప్రత్యేకంగా జరుపుకొంటారు. ఈ ఐదు రోజులూ ఎవరైతే సాయంకాల సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకుని స్నానమాచరించి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తారో వారి జీవితంలో ధన కనక వస్తు వాహనాదులకు లోటు ఉండదని పెద్దలు తెలిపారు. బహుళ పక్ష త్రయోదశి దీపావళి పండుగల్లో మొదటి రోజు ఈ రోజు ధన త్రయోదశిగా, ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం, లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేయడం విశేషం. దీపావళి పండుగలో తొలి రోజు ధన త్రయోదశి. రెండో రోజు నరక చతుర్దశి. దీపావళి పండుగలో ప్రత్యేకమైనది దీపావళి అమావాస్య. ఈరోజు ప్రతి ఒక్కరూ తలస్నానం ఆచరించి కొత్త బట్టలు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆరోజు దీపాలను వెలిగించి, చిన్న పిల్లలతో దివిటీలను అంటించాలి.  దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవి ఆరాధన చేసేవారికి సకల సంపదలు సిద్ధిస్తాయని శాస్త్ర వచనం.

కృత యుగం ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు దీపావళి. త్రేతాయుగం ప్రకారం శ్రీరాముడు సీతతో కలిసి అయోధ్యకు ప్రయాణం చేసిన రోజు దీపావళి. ద్వాపరయుగ ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని వచ్చిన రోజు దీపావళిగా మన పురాణాలు పేర్కొంటున్నాయి. దీపావళి సమయంలో నాలుగో రోజు బలి పాడ్యమి. ఈరోజు బలి చక్రవర్తి తన రాజ్యాన్ని దానమిచ్చినటువంటి రోజు. ఈ రోజు వామనావతారంలో విష్ణుమూర్తిని పూజించడం, బలిచక్రవర్తి కథను వినడం..  అలాగే ఈరోజు సాయంత్రం లక్ష్మీ ఆరాధన దీపారాధన చేయడం వల్ల విశేష పుణ్యఫలం దక్కుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. దీపావళి పండుగలో ఐదో రోజు యమ ద్వితీయ. దీన్నే భాతృ విదియగానూ, భగినీ హస్తభోజనం/ భాయిదూజ్‌గా పిలుస్తారు. ఉత్తరాదిన రాముడు, భరతుడు మధ్య సమాగమన ఉదంతం జరిగిన రోజుగా పురాణాలు పేర్కొంటున్నాయి. దీన్ని భరత్ మిలాప్ అని కూడా పిలుస్తారు. ఈ ఐదు రోజులు అభ్యంగ స్నానమాచారించడం, దీపారాధన చేయడం, లక్ష్మీదేవిని పూజించడం సంప్రదాయం.. ఇలా చేసిన వారికి సకల సంపదలు కలిగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, ప్రముఖ ఆధాత్మికవేత్త పంచాంగకర్త 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని