ఈ గుడికి వెళ్తే... యమబాధలు ఉండవట!

దక్షిణాభిముఖంగా ప్రవహించే గోదావరి నదీతీరంలో వెలసిన ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ ఆలయం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతోంది.  దక్షిణ కాశీగా, తీర్థ రాజంగా, హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం ఫిబ్రవరి 26 నుంచీ జరిగే

Updated : 14 Mar 2023 13:07 IST

దక్షిణాభిముఖంగా ప్రవహించే గోదావరి నదీతీరంలో వెలసిన ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ ఆలయం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతోంది.  దక్షిణ కాశీగా, తీర్థ రాజంగా, హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం ఫిబ్రవరి 26 నుంచీ జరిగే బ్రహ్మోత్సవాలకు అంగరంగవైభవంగా ముస్తాబవుతోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఆలయ ప్రాంగణంలో యమధర్మరాజు కోవెల ఉంది. ఈ కారణంగానే ‘ధర్మపురికి వస్తే యమపురి ఉండద’నే నానుడి ప్రసిద్ధి చెందింది.

‘దక్షిణాభిముఖీ గంగా యత్ర దేవోనృకేసరీ తత్ర శ్రీహృదయం తీర్థం కాశ్యాత్‌ శతగుణం భవేత్‌’... అనే శ్లోకం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం విశిష్టతను చాటుతోంది. ఇక్కడ శ్రీలక్ష్మీనరసింహస్వామి యోగానంద రూపుడై భాసిల్లుతున్నాడు. స్వామివారి విగ్రహం మొత్తం సాలగ్రామ శిలతోనే తయారైంది. విగ్రహం చుట్టూ దశావతారాల ముద్రలు సుందరంగా కనిపిస్తుంటాయి. ప్రశాంత చిత్తంతో స్వామివారిని తలచినంతనే దుఃఖాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

స్థలపురాణం 

ధర్మవర్మ అనే మహారాజు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించడం వల్లే ధర్మపురి అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం క్రీ.శ.1422-33 కాలంలో బహమనీ సుల్తానుల దండయాత్రలో ధ్వంసమైంది. తిరిగి ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో పునరుద్ధరించినట్లు ధర్మపురి క్షేత్ర చరిత్ర తెలియజేస్తోంది. పామునే పతిగా పొందిన సత్యవతీదేవి ఎన్ని గుళ్లూగోపురాలూ తిరిగినా ఫలితం కనిపించలేదు. చివరికి ధర్మపురికి వచ్చి నృసింహస్వామిని దర్శించుకుందట. గోదావరిలో స్నానం ఆచరించగానే సత్యవతీదేవి భర్తకు సర్పరూపం పోయి సుందర రూపం వచ్చినట్లు స్థల పురాణం తెలుపుతోంది. అందువల్లే ధర్మపురిని దర్శించిన వారికి యమపురి ఉండదన్న నానుడి వచ్చిందని స్థానికుల విశ్వాసం. చారిత్రకంగానూ ఈ ప్రాంతం ప్రసిద్ధి పొందింది. ధర్మపురి పట్టణం వేదాలకూ, ప్రాచీన సంస్కృతికీ, సంగీత సాహిత్యాలకూ పుట్టినిల్లుగా పేరుగాంచింది. ఇక్కడ బ్రహ్మపుష్కరిణితోపాటు సత్యవతీ ఆలయం (ఇసుక స్తంభం) ప్రసిద్ధి చెందింది. స్వామివారిని దర్శిస్తే మానసిక, శారీరక బాధల నుంచి విముక్తి లభిస్తుందనీ, ఆయురారోగ్య, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనీ భక్తుల విశ్వాసం. దేవస్థానంలో పక్కపక్కనే ఉన్న ఉగ్ర, యోగస్వాముల ఆలయాలతోపాటు, శ్రీవేంకటేశ్వర, గోపాలస్వామి గుళ్లూ, ముందు భాగంలో శ్రీరామలింగేశ్వరుడి కోవెలా ఉన్నాయి.

ఉత్సవాలు 

ఏటా ఈ ఆలయంలో శ్రీనృసింహ నవరాత్రి ఉత్సవాలూ, శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున కోనేరులో జరిగే పంచసహస్ర దీపాలంకరణల్లో పాల్గొనడానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అలాగే ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలూ, ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఇక్కడ ఘనంగా జరుపుతారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే కళ్యాణోత్సవం, డోలోత్సవం, రథోత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గోదావరి నదీ తీరంలో ఏటా కార్తీకమాసంలో అమావాస్య నుంచి పౌర్ణమి వరకూ నిత్యం గంగాహారతి ఇస్తారు.

 

ఇలా చేరుకోవచ్చు ..

జగిత్యాల జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ధర్మపురి ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రతి 20 నిమిషాలకో బస్సు బయల్దేరుతుంది. కరీంనగర్‌ నుంచి ధర్మారం, వెల్గటూర్‌, రాయపట్నం మీదుగా 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చేరుకోవచ్చు. రైల్లో రావాలనుకుంటే మంచిర్యాల స్టేషన్‌లో దిగి, 

లక్సెట్టిపేట మీదుగా 40 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి ధర్మపురికి చేరుకోవచ్చు.

- చల్లారం రామచంద్రారెడ్డి, ఈనాడు, కరీంనగర్‌ 
ఫొటోలు: గుండి నర్సయ్య

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని