జూబ్లీహిల్స్‌ ‘పెద్దమ్మతల్లి‘

మొక్కితే కరుణిస్తుంది. కోరితే వరమిస్తుంది. ప్రదక్షిణ చేస్తే నీడై నిలుస్తుంది. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ... మనసున్న తల్లి! ఆలయ ఆవరణలో కాలుపెట్టగానే అమ్మ ఒడికి చేరినంత నిశ్చింత!

Updated : 14 Mar 2023 14:05 IST

మొక్కితే కరుణిస్తుంది. కోరితే వరమిస్తుంది. ప్రదక్షిణ చేస్తే నీడై నిలుస్తుంది. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ... మనసున్న తల్లి! ఆలయ ఆవరణలో కాలుపెట్టగానే అమ్మ ఒడికి చేరినంత నిశ్చింత!

మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్నీ పీడించేవాడు. యజ్ఞయాగాదుల్ని నాశనం చేసేవాడు. రుషి పత్నుల్ని చెరబట్టేవాడు. ఇంద్రాదులను తరిమి కొట్టేవాడు. త్రిమూర్తులు కూడా ఆ ధాటికి తట్టుకోలేకపోయారు. ‘పాహిమాం’ అంటూ శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు. మహిషుడేం సామాన్యుడు కాడు. మహా బలవంతుడు. అందులోనూ, వరగర్వంతో విర్రవీగుతున్నాడు. మహాశక్తి ముందు రాక్షసశక్తి చిన్నబోయింది. అంతిమ విజయం అమ్మవారిదే! ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరమనిపించింది. దుర్గమమైన అడవుల్లో...బండరాళ్ల మధ్య కొద్దిరోజులు సేదతీరింది. అదే...జూబ్లీహిల్స్‌లో ప్రస్తుతం పెద్దమ్మ దేవస్థానమున్న ప్రాంతమని స్థానిక ఐతిహ్యం. ‘పెద్దమ్మ’ అన్న మాట ఏ పురాణాల్లోనూ కనిపించదు. ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు. ముగ్గురమ్మల మూలపుటమ్మే.. కడు పెద్దమ్మ! ఏడు ఎకరాల ఆవరణలో విస్తరించిన ఆధ్యాత్మిక క్షేత్రం...జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి గుడి! హైదరాబాద్‌ నాలుగు వందల సంవత్సరాల ప్రాచీన నగరం. భాగ్యనగర నిర్మాణానికి చాలా చాలా ముందే ...ఆమాటకొస్తే, వేల సంవత్సరాల క్రితమే జూబ్లీహిల్స్‌ ఆదిమతెగలకు ఆవాసంగా ఉండేదంటారు. వేటే జీవనంగా బతికే ఆ అమాయకులు తమ కులదేవత పెద్దమ్మ తల్లిని భక్తితో కొలిచేవారు.మంచి జరిగితే, నైవేద్యాలిచ్చి అమ్మ సమక్షంలో సంబరాలు జరుపుకునేవారు. చెడు జరిగితే, జంతు బలులతో తల్లికి శాంతులు జరిపించేవారు. కాలప్రవాహంలో ఆ తెగలు అంతరించిపోయాయి. జూబ్లీహిల్స్‌ అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారింది. కానీ, అలనాటి అమ్మతల్లి ఆనవాళ్లు మాత్రం మిగిలాయి. రెండున్నర దశాబ్దాల క్రితం దాకా.. ఇక్కడో చిన్న ఆలయం ఉండేదట. ఎవరైనా వచ్చి వెలిగిస్తే దీపం వెలిగేది, లేదంటే లేదు. ఆ సమయంలో... రాత్రిళ్లు అమ్మ అడుగుల సవ్వడులు వినిపించేవని స్థానికులు చెబుతారు. భక్తులకు కల్లో కనిపించి ... తనకో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించిందట.

పీజేఆర్‌ చొరవతో

కాంగ్రెస్‌ దివంగత నేత పి.జనార్దన్‌రెడ్డికి అమ్మవారంటే మహా భక్తి. తల్లి ప్రేరణతో ఆయన ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. 1993లో ప్రారంభమైన నిర్మాణం ఏడాదికల్లా పూర్తయింది. హంపీ విరూపాక్ష స్వామి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఐదు అంతస్తుల ఎత్తులో గర్భగుడి, ఏడంతస్తుల్లో రాజగోపురం, గణపతి - లక్ష్మీ - సరస్వతి ఆలయాలు ప్రాణంపోసుకున్నాయి. నిజానికి, ప్రభుత్వం అప్పట్లో ఇక్కడ ఉన్నతాధికారుల నివాస సముదాయాన్ని ఏర్పాటు చేయాలనుకుంది. పీజేఆర్‌ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పట్టుబట్టి .. అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. పెద్దమ్మ దేవస్థానంలో దసరా నవరాత్రులు, శాకంబరి ఉత్సవాలు, ఆషాఢ బోనాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం నాగదోష పూజలు చేస్తారు. మాఘశుద్ధ పంచమి నుంచి సప్తమి వరకు వార్షిక రథోత్సవం కన్నులపండువగా జరుగుతుంది. మంగళ శుక్రవారాల్లో పదిహేనువేల మందీ, పర్వదినాల్లో లక్ష మందీ అమ్మవారిని దర్శించుకుంటారు.

ఎన్నో కార్యక్రమాలు

ఆలయానికి విచ్చేసే భక్తులు అమ్మవారిని కళ్లారా దర్శించుకుని, మనసారా స్మరించుకోడానికి అవసరమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తోంది ధర్మకర్తల మండలి. భక్తుల కోసం వసతి గృహాలు కట్టించారు. అమ్మవారి సేవకే జీవితాల్ని అంకితం చేసిన అర్చకుల కోసం నివాస సముదాయాన్ని నిర్మించారు. ముల్లోకాల మూలపుటమ్మ ... ఘనంగా వూరేగడానికి అందమైన రథాన్ని తయారు చేయించారు. నవశక్తి, నాగదేవత ఆలయాలు వెలిశాయి. వివాహాది శుభకార్యాల కోసం కల్యాణ మండపం నిర్మించారు. ఉత్తర దిక్కున యాగశాల, పుష్కరిణి ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో...భారీ శంఖ-చక్ర-త్రిశూలాలు ప్రత్యేక ఆకర్షణ. ప్రతి మంగళవారం, శుక్రవారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు. పెళ్లిళ్లు, పుట్టినరోజులు, పరీక్షల్లో పిల్లల ఉత్తీర్ణతలు ... ఏకాస్త మంచి జరిగినా అన్నదాన కార్యక్రమానికి తమవంతు విరాళం అందించే వారు ఎంతోమంది! ‘భక్తుల నుంచి అందే విరాళాలపై వచ్చే వడ్డీతోనే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాం’ అంటారు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.బాలాజీ. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ప్రస్తుతం ఉన్న నలభై షెడ్ల స్థానంలో... నూటఇరవై షెడ్లను నిర్మించే ఆలోచన ఉందని చెబుతారు ట్రస్టీ పి.విష్ణువర్దన్‌రెడ్డి.

- దాసరి భాస్కర్‌ న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని