పరమ పవిత్రం.. కేదారం..

పరమేశ్వరుని సన్నిధానాల్లో పరమ పవిత్రమైనది కేదార్‌నాథ్‌ మహాక్షేత్రం. హిమగిరుల్లో నెలకొన్న ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా యుగయుగాలుగా వేలాదిమంది భక్తుల పూజలు అందుకుంటోంది.

Updated : 14 Mar 2023 15:02 IST

పరమేశ్వరుని సన్నిధానాల్లో పరమ పవిత్రమైనది కేదార్‌నాథ్‌ మహాక్షేత్రం. హిమగిరుల్లో నెలకొన్న ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా యుగయుగాలుగా వేలాదిమంది భక్తుల పూజలు అందుకుంటోంది. రుద్రహిమాలయ పర్వత ప్రాంతాల్లోని ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే భక్తులు చాలా శ్రమించాల్సి వుంటుంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్‌ జిల్లాలోని పర్వతాల్లో పరమశివుడు కేదారేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తారు. శీతాకాలంలో ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. వేసవికాలం ప్రారంభంలోనే ఆలయాన్ని తెరవడం సంప్రదాయంగా వస్తోంది. మందాకిని నది జన్మస్థానం కూడా కేదార్‌నాథ్‌ సమీప పర్వతాల్లోనే వుంది.

స్వయంభువుగా శివుడు..

పరమశివుడు ఇక్కడ స్వయంభువుగా భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంటాడు. ద్వాపరయుగంలో కురుక్షేత్ర యుద్ధం అనంతరం పాండవులు విజేతలుగా నిలుస్తారు. అయితే యుద్ధంలో తమ సొంత దాయాదులను చంపవలసివచ్చినందుకు ఎంతగానో వేదనకు గురవుతారు. తమ పాపాల నుంచి విముక్తి పొందేందుకు మహేశ్వరుని దర్శనం కోసం హిమాలయాలకు చేరుకుంటారు. ఈశ్వరుడు వృషభరూపంలో కేదారం వద్ద వుండటాన్ని పాండవులు గమనిస్తారు. వారు వచ్చేలోగా శివుడు భూమిలోకి వెళ్లిపోతాడు. పాండవులకు మోపురం మాత్రమే దర్శనమిస్తుంది. ఆ దర్శనంతో పాండవులకు పాప విముక్తి కలుగుతుంది. భూమిలోకి వెళ్లిన పరమేశ్వరుని ముఖ భాగం నేపాల్‌లోని పశుపతినాథ ఆలయంలో వున్నట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. మధ్యమహేశ్వర్‌, తుంగ్‌నాథ్‌, రుద్రనాథ్‌, కల్పేశ్వర్‌, కేదార్‌నాథ్‌... ఈ ఐదింటిని పంచ కేదార్‌నాథ్‌ క్షేత్రాలుగా పేర్కొంటారు.

ఆధ్యాత్మికశిఖరం

మంచుకొండల్లోని కేదార్‌నాథ్‌ క్షేత్రానికి చేరుకోవడం అత్యంత శ్రమతో కూడుకున్న పని. కానీ శివానుగ్రహం భక్తుల్ని ఆ ఇబ్బందులనుంచి దూరంచేస్తుంది. ఇక్కడ ఆలయాన్ని పాండవులు నిర్మించారని తెలుస్తోంది. అనంతరం ఆదిశంకరాచార్యులు ప్రాచీన ఆలయానికి సమీపంలోనే ప్రస్తుతం మనం చూసే ఆలయాన్ని నిర్మించారు. ఎన్నో వందల సంవత్సరాలు మంచుతో కప్పబడిన మహాపుణ్యక్షేత్రం అనంతరం దర్శనమివ్వడం భగవద్‌ అనుగ్రహమే. ఆదిశంకరులు ఇక్కడి నుంచే కైలాసానికి చేరుకున్నట్టు ప్రాచీన గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఆదిశంకరుల సమాధిని కూడా ఆలయ సమీపంలో దర్శించవచ్చు. మంచు కొండల నడుమ పెద్ద పెద్ద రాళ్లతో ఆలయాన్ని నిర్మించడం దైవానుగ్రహమని పెద్దలు చెబుతారు. ఆలయం ముందు భాగంలో కుంతీదేవి, పాండవులు, శ్రీకృష్ణ విగ్రహాలు వుంటాయి. ఆలయం ముందు నంది విగ్రహం వుంటుంది. ఆలయంలో పరమశివుడు సదాశివమూర్తిగా దర్శనమిస్తారు.

కొండలనెక్కి... శ్రమను అధిగమించి

ఉత్తరాఖండ్‌లోని పవిత్రపుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌, యమునోత్రి, గంగోత్రిలను దర్శించుకోవడాన్ని మినీ చార్‌ధామ్‌ యాత్రగా పేర్కొంటారు. కేదార్‌నాథ్‌ ప్రయాణం క్లిష్టంగా వుంటుంది. రిషికేశ్‌ నుంచి గౌరీకుండ్‌ వరకు సులభంగా చేరుకోవచ్చు. గౌరీకుండ్‌ నుంచి గుర్రాలు, డోలీలు లేదా కాలినడక ద్వారా ప్రయాణించాల్సి వుంటుంది. హిమపాతంతో కూడిన ప్రతికూల వాతావరణంలో భక్తులు ప్రయాణించాలి. హెలికాప్టర్ల సర్వీసులను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కల్పించింది. కానీ ఈ ప్రయాణానికి ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. సముద్రమట్టానికి దాదాపు 3500 మీటర్ల ఎత్తులో వుండే కేదార్‌నాథ్‌ను చేరుకోవడంతో బడలిక మొత్తం ఎగిరిపోతుంది. ఆ నీలకంఠుని దర్శనంతో ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది.

ఎలా చేరుకోవాలి

రోడ్డు మార్గం: రిషికేశ్‌, హరిద్వార్‌, డెహ్రాడూన్‌, దిల్లీనుంచి రోడ్డు మార్గం వుంది. గౌరీకుండ్‌ నుంచి 14 కి.మీ. నడక ప్రయాణముంటుంది. 2013లో సంభవించిన వరదల అనంతరం ఈ మార్గం ధ్వంసమయింది. మార్గాన్ని పునర్‌నిర్మించారు.
రైలుమార్గం : రిషికేశ్‌ రైల్వేస్టేషన్‌ 243 కి.మీ. దూరంలో వుంది. రిషికేశ్‌కు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి రైలు సౌకర్యముంది.
విమానయానం: డెహ్రాడూన్‌లోని జాలిగ్రాంట్‌ విమానాశ్రయం. 243 కి.మీ.లో వుంది.
మే నుంచి అక్టోబరు మాసాల మధ్య కాలం కేదారేశ్వరుడిని దర్శించుకునేందుకు అనుకూలమైన సమయం. శీతాకాలం నుంచి వేసవి కాలం ప్రారంభం వరకు ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. మే చివర నుంచి జూన్‌ నెలాఖరు వరకు రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయి. 2013లో వర్షాలు ఎక్కువగా కురవడంతో అనేక నదులకు వరదలు ఏర్పడ్డాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని యాత్ర కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సి వుంటుంది. ఉత్తరాఖండ్‌ పర్యాటక శాఖతో పాటు పలు ప్రైవేటు సంస్థలు ప్యాకేజీ యాత్రను నిర్వహిస్తుంటాయి. వీటిని ముందుగా సంప్రదించి వెళ్లడం ఉత్తమం. మంచు కురిసే ప్రాంతంలో ప్రయాణం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని