ద్రాక్షారామం ..నిటలాక్షుని వైభవం

‘నమశ్శివాయ’ అన్న పంచాక్షరీ మంత్రాన్ని రుద్ర నమకానికి హృదయక్షేత్రంగా భావించే ధార్మికులు - మాఘ బహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా భావిస్తారు. భక్తితో శివలింగాన్ని అభిషేకిస్తారు. ముఖ్యంగా త్రిలింగ భూమిగా పేరొందిన తెలుగునాట శివరాత్రి వైభవం మిన్నంటుతుంది.

Updated : 14 Mar 2023 15:11 IST

‘నమశ్శివాయ’ అన్న పంచాక్షరీ మంత్రాన్ని రుద్ర నమకానికి హృదయక్షేత్రంగా భావించే ధార్మికులు - మాఘ బహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా భావిస్తారు. భక్తితో శివలింగాన్ని అభిషేకిస్తారు. ముఖ్యంగా త్రిలింగ భూమిగా పేరొందిన తెలుగునాట శివరాత్రి వైభవం మిన్నంటుతుంది. పంచారామాల్లో ఒకటిగా ప్రణతులందుకొనే ద్రాక్షారామంలో భీమేశ్వర మూర్తి భక్తులను నిరంతరం ఆశీర్వదిస్తుంటాడు. తూర్పుగోదావరి జిల్లాలోని సప్తగోదావరి తీరాన వెలసిన భీమేశ్వరమూర్తిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి.‘కాశ్యాం తు మరణాన్ముక్తిఃజీవనం మరణం వాపి
శ్రేయో భీమేశ్వరపట్టణే..’ .. భీమేశ్వరుడు నిండుగా కొలువుదీరిన ద్రాక్షారామ ప్రాశస్త్యాన్ని తెలిపే ఈ శ్లోకానికి ‘కాశీలో నివసిస్తే మరణానంతరం మోక్షం లభిస్తుంది. భీమేశ్వరుడిని పూజిస్తే, కొన్ని క్షణాలైనా ఆయన సన్నిధిలో గడిపితే జీవన సౌఖ్యం, కైవల్యం రెండూ లభిస్తాయి’ అని అర్థం. దక్షిణ కాశీగా పేరొందిన ఈ క్షేత్రరాజం పౌరాణిక గాథల్లో అభివర్ణితమైంది. పంచారామాల్లో ఒకటిగా భక్తకోటి పూజలందుకుంటోంది.
తెలుగుసీమ పంచారామాలకు ప్రసిద్ధి చెందింది. త్రిపురాసురుణ్ణి పాశుపతాస్త్రంతో అంతమొందించిన పరమేశ్వరుడు, ఆ అసురుడు అర్పించే శివలింగాన్ని అయిదు ఖండాలు చేయగా- అవి ప్రతిష్ఠితమైన ప్రాంతాలేపంచారామాలని ఓ ఐతిహ్యం ఉంది. ఆ లింగ శకలాలు పాలకొల్లులో క్షీరారామేశ్వరుడిగా, సామర్లకోటలో కొమరారామ మూర్తిగా, అమరావతిలో అమరేశ్వరుడిగా, భీమవరం, ద్రాక్షారామ క్షేత్రాల్లో భీమేశ్వరుడుగా పూజలందుకొంటున్నాయి.

దక్షిణ కాశి!

ద్రాక్షారామం దక్షవాటికగా పౌరాణిక ప్రాశస్త్యాన్ని పొందింది. పంచారామాల్లోని ఇతర క్షేత్రాల్లో లేని విశేషాలు ద్రాక్షారామానికి ఉన్నాయి. త్రిలింగ క్షేత్రాల్లోనూ, అష్టాదశ శక్తిపీఠాల్లోనూ ఈ భీమేశ్వర పట్టణానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి సప్తగోదావరి పుష్కరిణిలో స్నానం చేసి, మాణిక్యాంబ సమేతుడైన భీమేశ్వరస్వామిని దర్శిస్తే, సాంబశివుడు సర్వపాపాల్నీ హరింపజేస్తాడని భక్తుల విశ్వాసం. కారుణ్య మూర్తి అయిన కనకసభాపతి కామితార్థాలను అనుగ్రహిస్తాడని ధార్మికుల నమ్మకం. భీమేశ్వరుడులాంటి దైవం, దక్షవాటిక అయిన ద్రాక్షారామం లాంటి ధామం, సప్తగోదావరిని పోలిన తీర్థరాజం.. జగత్తులో లేవని స్కాందపురాణం చెప్తోంది.

పురాణ గాథల్లో

దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం కనుక ఈ క్షేత్రానికి దక్షారామం అని పేరు వచ్చిందని ప్రతీతి. దక్షారామం కాలగమనంలో ‘దాక్షారామం’, ‘ద్రాక్షారామం’ అని పేర్లను సంతరించుకొంది. ఈ క్షేత్రం స్థల పురాణందక్షయజ్ఞ గాథతో ముడిపడి ఉంది. సతీదేవి తండ్రి దక్షప్రజాపతి ఒక బృహత్‌ యజ్ఞాన్ని తలపెట్టి, తన అల్లుడైన శివుణ్ణి తప్ప అందరు దేవతల్నీ ఆహ్వానించాడు. తండ్రి నిర్వహిస్తున్న యాగాన్ని చూడాలన్న కుతూహలంతో సతీదేవి దక్షవాటికకు వెళదాం రండి అని శివుణ్ణి అడుగుతుంది. పిలవని పేరంటానికి వెళ్లడం తనకిష్టం లేదని కైలాసపతి తిరస్కరిస్తాడు. భర్త తోడు రాకపోయినా ఒంటరిగానే వెళ్లేందుకు సతీదేవి నిశ్చయించుకొంటుంది. తల్లితండ్రులు తనను ఆదరిస్తారనీ, అక్కున చేర్చుకుంటారనీ భావించిన సతీదేవికి దక్షవాటికలో ఆశాభంగం అవుతుంది. తోబుట్టువుల మధ్య తలెత్తుకు తిరగలేక, శివుడికి తన ముఖాన్ని చూపించలేక దాక్షాయణి కాలి బొటన వేలితో నేలపై రాసి నిప్పు రవ్వలు సృష్టిస్తుంది. అన్యమార్గం కానరాక ఆత్మాహుతి చేసుకొంటుంది. సతీ వియోగాన్ని భరించలేని భూతనాథుడు, జటాజూటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించి, దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేయమని ఆజ్ఞాపిస్తాడు. భస్మీపటలం అయిన దక్షవాటికలోని సతీదేవి సూక్ష్మశరీరాన్ని భుజస్కందాలపై ధరించి-నటరాజు లయ తాండవం చేస్తాడు. ఆ ప్రళయహేలకు అడ్డుకట్టలు వేసేందుకు మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి సూక్ష్మశరీరాన్ని పద్దెనిమిది ఖండాలు చేస్తాడు. అవి భూమిపై పడిన ప్రాంతాల్లో అష్టాదశ శక్తి పీఠాలు ఆవిర్భావించాయనీ, సనాతన ధర్మ పూర్వవైభవ పునరుద్ధరణ కోసం భరతఖండ ఆద్యంతం పర్యటించిన ఆదిశంకరులు వీటిలో అర్చనాదుల్ని వ్యవస్థీకృతం చేశారనీ అంటారు. దాక్షాయణి ఆత్మాహుతి చేసుకొన్న చోట పరమేశ్వరుడు భీమరూపంలో స్వయంభువుడయ్యాడని ద్రాక్షారామ స్థలపురాణం చెబుతోంది. తొలుత ఈ లింగాన్ని కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు అర్చించాడని పురాణోక్తి.

అంతర్వాహిని

స్వయంభువుడైన భీమేశ్వరుణ్ణి అర్చించేందుకు సప్తరుషులు ఇక్కడికి గోదావరిని తీసుకువచ్చారని అంటారు. దీనికి సంబంధించిన ఓ ప్రసిద్ధ గాథ ప్రాచుర్యంలో ఉంది. ద్రాక్షారామానికి పది కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తోన్న గోదావరి జలాలతో భీమేశ్వరుడికి అభిషేకం చేయాలని సప్తర్షులు తలపోశారు. అందుకు వీలుగా గోదావరిని తమ వెంట తరలించాలని భావించారు. అయితే పరవళ్లుతొక్కే గోదావరీ జలాలు తన యజ్ఞానికి భంగం కలిగిస్తాయని భావించిన తుల్యుడనే మునీశ్వరుడు, సప్తర్షులను నిలువరిస్తాడు. అది ఘర్షణకు దారితీసే సమయంలో వేదవ్యాసుడు వారి తగవును పరిష్కరిస్తాడు. గోదావరి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ద్రాక్షారామానికి చేరుకొంటుందనీ, అక్కడ సప్త గోదావరి పేరుతో పుష్కరిణిగా అవతరిస్తుందనీ తెలియజేస్తాడు. సప్తర్షులు భీమేశ్వరుడి సన్నిధికి చేరుకొనే వేళకు, సప్తగోదావరి జలాలతో సూర్యుడు తొలి అభిషేకాన్ని పూర్తిచేశాడనీ, ఆ విధంగా స్వయంభువును మొదటిసారిగా అర్చించిన ఖ్యాతి ఆదిత్యుడి సొంతమైందనీ క్షేత్రగాథ చెప్తోంది.

హరిహర మైత్రీ క్షేతం

ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి లక్ష్మీనారాయణుడు క్షేత్ర పాలకుడు కావడం విశేషం. హరిహరులిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరనీ, ఇరువురికీ పూజాదికాలు సరిసమానంగా అర్పించాలనీ ద్రాక్షారామంలోని కల్యాణోత్సవాలు చెప్పక చెబుతాయి. అర్ధశరీరాన్ని సతికి అనుగ్రహించిన మాణిక్యాంబా సమేత భీమేశ్వరుడికీ, హృదయేశ్వరిని వక్షస్థలం మీద ధరించిన లక్ష్మీనారాయణుడికీ ఏటా మాఘశుద్ధ ఏకాదశి రోజున వేదికపై కల్యాణాలు నిర్వహించే దృశ్యాన్ని ద్రాక్షారామంలో మాత్రమే దర్శించగలం. శైవులకూ, వైష్ణవులకూ ఇవి నేత్రపర్వం చేస్తాయి. ఆలయ ప్రాకారం చుట్టూ కాలభైరవుడు, ఢుండి గణపతి, విరూపాక్షుడు, నటరాజు, సప్తమాతృకలు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, చతుర్మఖ బ్రహ్మ, లక్ష్మీ గణపతి, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, వీరభద్రుడు, సురేశ్వర చండీశ్వరాది దేవీదేవతామూర్తులూ కొలువుదీరి ఉంటారు.

అనుపమాన నిర్మాణశైలి!

ద్రాక్షారామ భీమేశ్వరాలయం- నాలుగువైపులా నాలుగు ఎత్తయిన రాజగోపురాలతో, పన్నెండు ఎకరాలకుపై బడిన విస్తీర్ణంలో నెలకొని ఉంది. ఆలయానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ధ్వజస్తంభం డెబ్భై అడుగుల పొడుగున దర్శనమిస్తుంది. ఎత్తయిన రాతిగోడలతో నిర్మించిన సుదీర్ఘ ప్రాకారాల మధ్య మాణిక్యాంబతో కొలువుదీరిన భీమేశ్వరుడి దివ్యసన్నిధి కైలాస సభావేదికను తలపిస్తుంది. భీమేశ్వరుణ్ణి దర్శించేందుకు భక్తులు మొత్తం అయిదు ప్రాకారాలు దాటాల్సి ఉంటుంది. బయటి ప్రహరీ నుంచి వెళ్తే, ఇంకో ప్రాకారం వస్తుంది. దాని మధ్య ప్రధానాలయం రెండు అంతస్థులుగా ఉంటుంది. రెండో ప్రాకారం నుంచి గర్భాలయానికి వెళ్లడానికి మెట్లుంటాయి. సుమారు ఇరవై అడుగుల ఎత్తుండే పై అంతస్థులో మళ్లీ మూడు ప్రాకారాలు ఉంటాయి. వీటిని ప్రదక్షిణ చేస్తూ గర్భాలంయంలోకి ప్రవేశించవచ్చు. ఈ ప్రదక్షిణ మార్గాన్నే ‘చీకటి కోణం’ అంటారు. విద్యుచ్ఛక్తి లేని రోజుల్లో ఈ ప్రాకారాలు కటిక చీకటితో నిండి ఉండేవి. అందువల్ల వీటిలోని మొదటి రెండు ప్రాకారాల గోడలపై రాతి బొడిపెలు కనిపిస్తాయి. మునుపు ఈ బొడిపెల్లో నవరత్నాలు పొదిగారనీ, అవి భక్తులకు వెలుగులు అందించేవనీ అంటారు. చివరిగా అయిదో ప్రాకారంలో స్ఫటిక లింగ రూపంలో భీమేశ్వరుడు భక్తులకు తన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. దిగువ అంతస్థులోని అట్టడుగు పీఠం నుంచి భీమేశ్వర లింగం, సుమారు నలభై అడుగుల పొడవు ఉంటుంది.
ప్రధాన ఆలయానికి తూర్పున అశ్వత్థనారాయణ వృక్షం ఉంది. సంతానం లేనివారు, లౌకిక సమస్యలతో సతమతమవుతున్న వారు ఈ వృక్షాన్ని భక్తితో కొలిస్తే సంతతి కలుగుతుందనీ, సమస్యలు పరిష్కారం అవుతాయనీ ధార్మికులు విశ్వసిస్తారు. సప్తగోదావరిగా వ్యవహరించే పవిత్ర పుష్కరిణికి వెళ్లే తోవలో సప్తర్షులు, అరుంధతీ దేవి ప్రతిమలు ఉన్నాయి. అత్రి, భృగు, కౌస్త, వశిష్ఠ, గౌతమ, కశ్యప, అంగీరస రుషులు, వశిష్ఠుడి ధర్మపత్ని అరుంధతి శిల్పాలు చిన్న చిన్న గుళ్లలో దర్శనమిస్తాయి. ప్రధాన ప్రాకారంలో అనేక మంటపాలున్నాయి. వాటిని- కొట్టార, గాంగేయరాయ, గండభేరుండదేవ, నంది, దీపావళి, నాట్య, శనివార, గయ, అర్క, తిరుచుట్టుమాలిక, మృగయా రామ మంటపాలని అంటారు.

చారిత్రక నేపథ్యం

వేంగిని రాజధానిగా చేసుకొని త్రిలింగ దేశాన్ని పాలించిన తూర్పుచాళుక్యుల కాలంలో తెలుగు సాహితీ సంస్కృతులు పరిఢవిల్లాయి. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారత కావ్యాన్ని ఆంధ్రీకరించేందుకు అంకురార్పణ జరిగింది. ఈ రాజుల ఏలుబడిలోనే క్రీస్తుశకం 1022-1061 సంవత్సరాల మధ్య వేంగి రాజ్యాన్ని ఏలిన రాజరాజ నరేంద్రుడి ఆస్థానకవి అయిన నన్నయ భట్టారకుడు భారతాంధ్రీకరణకు శ్రీకారం చుట్టాడు.
రాజరాజనరేంద్రుడికి పూర్వికుడైన చాళుక్య భీముడు క్రీస్తుశకం 892-922 సంవత్సరాల మధ్య రాజ్యాన్ని పాలిస్తున్న రోజుల్లో ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని నిర్మించాడని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఆలయ స్తంభాలపైన, గోడల మీద మొత్తం 832 శాసనాలు చెక్కి ఉన్నాయి. క్రీస్తుశకం 11 వ శతాబ్ది నుంచి 15వ శతాబ్ది వరకూ అనేక చారిత్రక విశేషాలను ఈ శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. తూర్పు చాళుక్యులతో పాటు తూర్పు గాంగేయులు, కాకతీయులు, కొండవీటి రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర రాజులు ద్రాక్షారామంలో శివార్చన కోసం భూరి విరాళాలిచ్చారు. వారు నిర్మించిన మంటపాలు, గోపురాలు, ప్రాకారాలు, కల్పించిన అనేక వసతులు ద్రాక్షారామాన్ని క్షేత్రరాజంగా తీర్చిదిద్దాయి.

అష్టోత్తర శతలింగాలు

ద్రాక్షారామంలోని స్వయంభూలింగాన్ని భక్తులు సందర్శించేందుకు వీలైన రీతిలో- రుద్రమూర్తిని శాంతపరచేందుకు ఈ క్షేత్రం చుట్టూ ఎనిమిది సోమేశ్వర ఆలయాలను చంద్రుడు నిర్మించాడని అంటారు. ద్రాక్షారామం పరిసరాల్లోని కోలంక, వెంటూరు, కోటిపల్లి, వెల్ల, దంగేరు, కోరుమిల్లి, సోమేశ్వరం, పెనుమళ్ల గ్రామాల్లో ఈ ఆలయాలు ఉన్నాయి. ప్రధానమైన భీమేశ్వర ఆలయంలోకి ప్రవేశిస్తే- రెండో ప్రాకారంలోని ‘భీమసభ’ అని వ్యవహరించే ఒక పీఠం కనిపిస్తుంది. దీనిపై నూట ఎనిమిది శివలింగాలు దర్శనిమిస్తాయి. కవి సార్వభౌముడుగా ప్రసిద్ధి చెందిన శ్రీనాథుడు రచించిన ‘భీమ ఖండం’ కావ్యంలో ఈ అష్టోత్తర శతలింగాల ప్రస్తావన ఉందని పరిశోధకులు గుర్తించారు. జ్యోతిష ప్రాముఖ్యం ఉన్న ఈ క్షేత్రాన్ని ఒకప్పుడు భక్తులు విశేషంగా దర్శించారనీ, వృత్తాకారంలో ఉండే ఈ ప్రదేశాలన్నిటినీ కలిపి శ్రీనాథుడు ‘భీమఖండం’గా కావ్యావిష్కరణ చేశాడనీ సాహితీ విమర్శకులు పేర్కొంటారు.

ఉత్సవ వైభవాలు

ద్రాక్షారామంలో నిత్యోత్సవాల్ని నిర్వహించేందుకు వీలుగా వందల సంఖ్యలో రాజులు, జమీందారులు భూ, కనక, వస్తు, వాహన, ద్రవ్య, రూపాల్లో పెద్ద ఎత్తున విరాళాలిచ్చారు. ఉత్సవాలకు విచ్చేసే యాత్రికుల వసతుల కోసం సత్రాల్ని నిర్మించారు. ఏటా మాఘమాసంలో ఎనిమిది నుంచి పది రోజుల పాటు ఇక్కడ కల్యాణోత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భంలో అంకురార్పణ, ధ్వజారోహణ, అభిషేకాదుల్ని నిర్వహిస్తారు. ఏటా మార్గశిర పౌర్ణమి రోజున, ఆరుద్ర నక్షత్రం ప్రవేశించే సందర్భంలో ఆర్ద్రోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంలో క్రతువులు నిర్వహించి హవిస్సును అర్పిస్తారు. చైత్ర పౌర్ణమి నాడు మాణిక్యాంబ, భీమేశ్వరుల్ని ప్రత్యేకంగా దవనంతో అర్చిస్తూ ఉయ్యాల్లో ­పుతూ డోలోత్సవాన్ని జరుపుతారు. అలాగే వేసవిలో స్వామిని వనవిహారానికి తీసుకు వేళ్లే ‘తోట ఉత్సవం’, ఉగాది ముందు రోజు ‘కొత్త’ అమావాస్య నాడు ‘ మాఘంత దాసోత్సవం’ ద్రాక్షారామంలో ఏటా నిర్వహిస్తారు. వీటితో పాటు చైత్రమాసంలో ‘గౌరీ వ్రతం’, వైశాఖ మాసంలో ‘అక్షయ తృతీయ చందనోత్సవం’ ప్రసిద్ధి చెందినవి.
ఏడాది పొడవునా వేడుకలతో అలరారే ద్రాక్షారామానికి చేరుకోవడానికి రాజమండ్రి, కాకినాడల నుంచి ప్రతి అరగంటకూ బస్సులున్నాయి. స్వయంభువుడైన సాంబశివుణ్ణి భీమేశ్వర లింగ రూపంలో దర్శిస్తూ - ‘నమఃపార్వతీపతయే హరహరమహాదేవ’ అని భక్తి ప్రపత్తులతో ఎలుగెత్తి ఘోషించే ధార్మికులకు ద్రాక్షారామం అవశ్య దర్శనీయం.

ఎలా చేరుకోవాలి

* కాకినాడకు 28 కి.మీ. దూరంలో ఉంది.
* రాజమండ్రికి 50 కి.మీ. దూరంలో, అమలాపురానికి 25 కి.మీ.దూరంలో ఉంది.
* రైలు ద్వారా రాజమండ్రి, కాకినాడ చేరుకొని అక్కడి నుంచి ఇతర వాహనాలలో ఈ క్షేత్రానికి వెళ్లొచ్చు.
* దేశంలోని ప్రధాన పట్టణాలతో రహదారి సౌకర్యముంది.
* బస్సు సర్వీసులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు