కాకిని హంసగా మార్చిన క్షేత్రం!

పాపాలను కడిగివేసే గంగమ్మ పాపవిమోచనాన్ని పొందింది ఈ దివ్యక్షేత్రానే. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వేణుగోపాల స్వామి వెలసిందీ ఈ పుణ్యతీర్థానే. ఇక,

Updated : 14 Mar 2023 15:15 IST
పాపాలను కడిగివేసే గంగమ్మ పాపవిమోచనాన్ని పొందింది ఈ దివ్యక్షేత్రానే. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వేణుగోపాల స్వామి వెలసిందీ ఈ పుణ్యతీర్థానే. ఇక, ఇక్కడి గుడిని సాక్షాత్తూ దేవతలే నిర్మించారని ప్రతీతి. అదే కృష్ణాజిల్లా హంసలదీవి ప్రాంతంలో కొలువైన రుక్మిణీ సమేత వేణుగోపాల స్వామి ఆలయం.
హంసలదీవి పేరు వినగానే కృష్ణానది సాగరంలో సంగమించే ప్రాంతం గుర్తొస్తుంది. మహారాష్ట్రలో జన్మించి నేలను సస్యశ్యామలం చేస్తూ వేల కిలోమీటర్లు ప్రయాణించే కృష్ణమ్మలోని ఓ పాయ కోడూరు మండలం హంసల దీవిలో సముద్రంలో కలుస్తుంది. నది సముద్రంలో కలిసే చోటుకు ప్రత్యేక విశిష్టతను ఆపాదించింది శాస్త్రం. ఇలాంటి చోట్ల స్నానమాచరిస్తే జన్మజన్మల పాపాలూ నశిస్తాయని చెబుతుంది. కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే అలాంటి పవిత్ర స్థలానే రుక్ష్మిణీ సమేతంగా వేణుగోపాల స్వామి కొలువయ్యాడు.

స్థల పురాణం

హంసల దీవి దగ్గరి సాగర సంగమంలో దేవతలు పుణ్యస్నానాలు ఆచరించి ఆ చోటునే స్వామిని నెలకొల్పి ఆలయాన్ని ఒక్క రాత్రిలో నిర్మించారని స్థల పురాణం పేర్కొంటోంది. ఆలయాన్ని దేవతలు నిర్మిస్తుండగా కోడి కూసే వేళకు ఒక మనిషి చూడటంతో దేవతలు శిలలుగా మారిపోయారని చెబుతుంటారు. ఆలయంలో శిల్పాలుగా ఉన్న దేవతా విగ్రహాలు వారివేనని నమ్ముతారు. కొన్నేళ్ల క్రితం వరకూ అసంపూర్తిగా మిగిలిపోయిన రాజగోపురాన్ని ఇందుకు సాక్ష్యంగా చెప్పేవారు. విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం 1995 ప్రాంతంలో ఈ ఆలయాన్ని దత్తత తీసుకుంది. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఏటా కల్యాణోత్సవాలు నిర్వహిస్తోంది. ఆలయం లోపల స్తంభాలపై రాసి ఉన్న లిపి ఏంటన్నది పురావస్తు శాస్త్రవేత్తలు తెలుసుకోలేక పోవడంతో అది దేవలిపేనని అక్కడి వారు చెబుతారు. సంతానం లేని వారు ఇక్కడి స్వామికి మొక్కుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం. అందుకే సంతాన వేణుగోపాలస్వామిగా ఈ స్వామి ప్రసిద్ధి చెందాడు. రెండు దశాబ్దాల క్రితం వరకూ అనంతవరం భక్తసమాజమైన కుప్పావారి వంశీయులు ఈ ఆలయ నిర్వహణ చూసుకుంటూ, ఏటా స్వామివారి కల్యాణోత్సవాలను జరిపేవారు.

ఆ పేరెలా వచ్చిందంటే..!

పూర్వం ప్రజలు పాప ప్రక్షాళన కోసం గంగానదిలో స్నానమాచరిస్తుండేవారట. పాప భారాన్ని మోయలేక నదీమతల్లి విష్ణుమూర్తి వద్ద మొరపెట్టుకుంది. దీంతో ‘పాపానికి ప్రతీకైన నలుపు రంగును ధరించి కాకి రూపంలో పుణ్యనదుల్లో స్నానమాచరించు... ఎక్కడైతే నీ నలుపు రంగు పోయి, తెలుపు రంగు వస్తుందో అక్కడితో నీకు పాపవిముక్తి లభిస్తుంది’అని వరమిస్తాడు విష్ణువు. దీంతో కాకిరూపం దాల్చిన గంగమ్మ పుణ్యనదుల్లో స్నానమాచరిస్తూ హంసలదీవిలోని సాగరసంగమానికి వచ్చి అక్కడ కూడా అలాగే చేసింది. ఇక్కడి నీళ్లలో మునగగానే ఆమె నలుపు రంగు మాయమై తెల్లటి హంసలా మారిపోయిందట. అందుకే ఈప్రాంతానికి హంసల దీవి అని పేరొచ్చిందని పురాణగాథ..!
పూజలు ఇలా..వేణుగోపాలస్వామి కల్యాణోత్సవాలు ఏటా మాఘమాసంలో అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. చతుర్దశి రోజున స్వామిని పెండ్లికొడుకుని చేస్తారు, రెండో రోజు కల్యాణోత్సవం ఉంటుంది. మూడో రోజు మాఘపౌర్ణమి, ఆరోజు సముద్ర స్నానమాచరిస్తే సర్వపాపాలూ పోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఆ రోజు రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి వచ్చి లక్షల మంది భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అదే రోజు స్వామికి ఘనంగా చక్రస్నాన కార్యక్రమం నిర్వహిస్తారు.

ఆ సాయంత్రం గ్రామంలో స్వామివారి

రథోత్సవం, నాలుగో రోజు ప్రత్యేక పూజలు, అయిదో రోజు స్వామివారి పవళింపుసేవతో కల్యాణోత్సవాలు ముగుస్తాయి. ఇక్కడి స్వామికి ఏడాది పొడవునా దీవి వంశీయులు నిత్యపూజలు చేస్తారు. కృష్ణాష్టమితో పాటు, ధనుర్మాసంలో నెలరోజులూ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీకమాసం మొత్తం ఆకాశ దీపాలంకరణ సేవలు నిర్వహిస్తారు.

ఎలా చేరుకోవాలంటే..!

హంసలదీవికి వెళ్లాలంటే విజయవాడ నుంచి అవనిగడ్డ వరకూ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. అవనిగడ్డ నుంచి కోడూరు మండలానికి 13 కి.మీ. బస్సు సర్వీసులు తరచూ ఉంటాయి. కోడూరు నుంచి ఆటోలు అందుబాటులో ఉంటాయి. అక్కడ నుంచి సాగరసంగమానికి చేరడానికి 7 కి.మీ. దూరం. బస్సులూ, ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయాన్ని చేరవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని