నేతి లింగం.. వడక్కునాథన్‌

పరమేశ్వరుని ఆలయాల్లో కేరళ రాష్ట్రంలోని వడక్కునాథన్‌ విశష్టమైనది. త్రిస్సూర్‌లో ఉన్న ఈ ఆలయంలో పరమేశ్వరుడు వడక్కునాథన్‌గా పూజలందుకుంటున్నాడు. బ్రహ్మాండ పురాణంలో ఈ ఆలయ ప్రస్తావన

Updated : 14 Mar 2023 17:26 IST

పరమేశ్వరుని ఆలయాల్లో కేరళ రాష్ట్రంలోని వడక్కునాథన్‌ విశష్టమైనది. త్రిస్సూర్‌లో ఉన్న ఈ ఆలయంలో పరమేశ్వరుడు వడక్కునాథన్‌గా పూజలందుకుంటున్నాడు. బ్రహ్మాండ పురాణంలో ఈ ఆలయ ప్రస్తావన కనిపిస్తుంది. పరశురాముడే ఈ ఆలయాన్ని ప్రతిష్టించినట్టు స్థలపురాణం చెబుతోంది. ఇక్కడ లింగాకారం చుట్టూ నెయ్యి పెద్ద ఎత్తున పేరుకుని ఉండడం విశేషం.

కైలాసనాథుడే తరలివచ్చాడు

ఒకానొక సమయంలో పరశురాముడు కొత్త భూభాగం కావాలని వరుణుడిని కోరాడు. సముద్రంలో గొడ్డలిని విసిరితే విసిరినంత మేర భూభాగం లభిస్తుందని వరుణుడు చెప్పడంతో భార్గవరాముడు గొడ్డలి విసిరాడు. దీంతో సముద్రం వెనక్కు వెళ్లింది. ఇలా కొత్తగా ఏర్పడిన భూభాగమే కేరళ అని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఈ కొత్త భూమిలో పరమేశ్వరుడిని ప్రతిష్టించాలని ఆశించిన పరశురాముడు కైలాసానికి వెళ్లి ప్రార్థించగా భక్తదయాళుడైన శివుడు.. పార్వతి, వినాయకుడు, కార్తీకేయుడితో కలిసి పరశురాముడి వెంట బయలుదేరారు. త్రిస్సూర్‌ ప్రాంతంలోని ఒక పెద్ద మర్రిచెట్టు వద్ద వారు నిలిచిపోతారు. వెంటనే  ఆ ప్రాంతంలో దేదీప్యమానమైన వెలుగులు ప్రసరించాయి. స్వామివారికి ఇష్టమైన ప్రదేశం అదేనని గ్రహించిన పరశురాముడు అక్కడే ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ ఈశ్వరుడు లింగరూపంలో ప్రతిష్టితం కావడంతో శ్రీమూల స్థానమని పేర్కొంటారు. అనంతరం కాలక్రమంలో ఈ ప్రాంతం కొచ్చిన్‌ రాజుల పాలనలోకి వచ్చింది. అప్పటి రాజు శివలింగాన్ని సమీపంలోని కట్టడంలోకి తరలించారు. ఇప్పటికీ ఆ ప్రదేశంలో మనం శ్రీ మూలస్థానాన్ని వీక్షించవచ్చు.

నేతితో నిండిన విగ్రహం

ప్రధాన ఆలయంలోని శివలింగంపై దాదాపు 16 అడుగుల మేర నెయ్యి నిండిపోయి ఉంటుంది. ఏళ్ల తరబడి నెయ్యితో అభిషేకం చేస్తుండటంతో హిమాలయ పర్వతమే ఆలయం లోపల ఉన్నట్టు కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో అనేక ఉపాలయాలు ఉంటాయి.

* శంకరుడి తల్లిదండ్రులైన ఆర్యాంబ, శివగురులు వడక్కునాథన్‌ ఆలయాన్ని సందర్శించడంతో స్వామి అనుగ్రహంతో ఆది శంకరులు జన్మించినట్టు ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి.

* వడక్కునాథన్‌ ఆలయాన్ని భారీ రాళ్లు, కలపతో నిర్మించారు. కొన్ని ఎకరాల వైశాల్యంలో ఈ  నిర్మాణం ఉంది. నాలుగు గోపురాలు ఠీవిగా కనిపిస్తాయి. గోడలపై వందల సంవత్సరాల ముందు గీసిన రంగు రంగుల చిత్రాలు భక్తులను ఆకట్టుకుంటాయి.

పూరం ఉత్సవాలు చూడాల్సిందే..
కేరళలోని ఆలయాల్లో వేడుకలు సర్వసాధారణం. వీటికి తలమానికం ఇక్కడ జరిగే పూరం ఉత్సవాలు. పూరం అంటే ఆలయ ఉత్సవాలు అని అర్థం. ఏటా జరిగే ఈ ఉత్సవాలను వీక్షించేందుకు లక్షలాదిమంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. ప్రధాన ఆలయం ముందు భాగంలో ఉన్న మైదానంలో పూరం నిర్వహిస్తారు. తిరువాంబడి, పరమేక్కవు బృందాలుగా పోటీపడతారు. ఇరువైపులా అలంకరణతో ఉన్న ఏనుగులు నిలబడతాయి. ఎదురెదురుగా ఉన్న బృందాలు పంచవాద్యాలను వాయిస్తాయి. గంటల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. అనంతరం రంగురంగుల బాణసంచా కాల్చడంతో వేడుకలు ముగుస్తాయి.

ఎలా చేరుకోవచ్చంటే..
త్రిస్సూర్‌ను దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రోడ్డు సౌకర్యముంది.
త్రిస్సూర్‌ రైల్వేస్టేషన్‌లో దిగి ఆలయానికి చేరుకోవచ్చు.
సమీప విమానాశ్రయం కొచిలో ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని