కపిల తీర్థం:శ్రీవారి సన్నిధిలో శివాలయం

తిరుమల అంటే శ్రీవారే. అణువణువూ వేంకటేశ్వరుడే. తమిళంలో తిరు అంటే శ్రీ అనీ, మల అంటే శైలం (కొండ) అనీ కూడా అర్థం. అంటే తిరుమల... శ్రీశైలమన్నమాట. శివకేశవులకు భేదం లేదు కదా... అలాంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండటంలో ఆశ్చర్యమేముంది! అలా తిరుపతిలో వెలసిన పవిత్ర తీర్థరాజమే కపిలతీర్థం...

Updated : 14 Mar 2023 19:26 IST

తిరుమల అంటే శ్రీవారే. అణువణువూ వేంకటేశ్వరుడే. తమిళంలో తిరు అంటే శ్రీ అనీ, మల అంటే శైలం (కొండ) అనీ కూడా అర్థం. అంటే తిరుమల... శ్రీశైలమన్నమాట. శివకేశవులకు భేదం లేదు కదా... అలాంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండటంలో ఆశ్చర్యమేముంది! అలా తిరుపతిలో వెలసిన పవిత్ర తీర్థరాజమే కపిలతీర్థం.

ప్రపంచ ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ శ్రీవారి ఆలయంతోపాటు గోవిందరాజస్వామి, కోదండరామస్వామివారి ఆలయాలున్నాయి. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవక్షేత్రం కూడా ఉంది. అదే కపిలతీర్థం. తిరుపతికి ఉత్తరంగా, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. ముఖ్యంగా, వర్షాకాలంలో ఇక్కడకు వస్తే... ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు చూపుతిప్పనివ్వవు. ఇక్కడి ప్రశాంత వాతావరణం... అడుగుతీసి అడుగు వేయనివ్వదు.ఇంతటి సుమనోహర తీర్థం ఇక్కడ ఎలా ఏర్పడిందంటే...కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళంనుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం. కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైనది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇక్కడి లింగాన్ని కూడా కపిల లింగం అంటారు. ఆ తరవాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట. అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమనికూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు.

ఈ ఆలయానికి ఉన్నత శిఖరమా అనిపించేలా ఉంటాయి తిరుమల కొండలు. ఆ కొండలమీది నుంచి గలగలా పారుతూ, 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్‌ తీర్థమనీ పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపించారట. రాతిమెట్లు, సంధ్యావందన దీపాలనూ ఏర్పాటుచేశారు. అందుకే, అప్పట్నుంచీ దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు.

చోళుల కాలంలో...

11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్రచోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అప్పట్లో రాయన్‌ రాజేంద్రచోళ అనే చోళ అధికారి దీని నిర్మాణ సూత్రధారి. చోళులు శివభక్తులు కావడంతో దీన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్మించారు. ఆహ్లాదకరమైన కపిల తీర్థాన్ని చోళులు అభివృద్ధి చేస్తే... అచ్యుతదేవరాయల హయాంలో వైష్ణవులు దీన్ని ఆళ్వారుతీర్థంగా మార్చారు. ఈ ఆలయానికి ముందు ఒక పాడుబడ్డ గుడి ఉంటుంది. అది నమ్మాళ్వార్‌ అనే ఆళ్వారు గుడి అని చెబుతారు. 12వ శతాబ్దం నుంచీ 18వ శతాబ్దం వరకూ దీన్ని ఆళ్వారు తీర్థంగానే వ్యవహరించారు. పదహారో శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన సెవ్వుసాని అనే దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేసిందట. ఆలయంలోని వినాయకుణ్ణి ఆవిడే ప్రతిష్ఠించిందట. కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామితోపాటు కాశీవిశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉన్నారు.

పూజలు... సేవలు...

కపిలతీర్థం పరమ పవిత్రమైనదని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమినాడు మధ్యాహ్నవేళ ముల్లోకాల్లోని సకలతీర్థాలూ నాలుగు గంటలపాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలూ దూదిపింజల్లా పోతాయని ప్రసిద్ధి. స్నానమాచరించిన తరవాత నువ్వుగింజంత బంగారాన్ని దానం చేసినా... కొండంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. అందుకే కార్తీకమాసం ప్రారంభం కాగానే ఈ తీర్థానికి భక్తులు పోటెత్తుతారు. నిత్యం ఈ తీర్థంలో పుణ్యస్నానాలు చేసి పరమేశ్వరుడికి ప్రీతికరంగా దీపాలు వెలిగిస్తారు. శివుడికి ఆరుద్రా నక్షత్రం అంటే చాలా ఇష్టమట. అందుకే, కార్తీకంలో ఆరుద్రా నక్షత్రం రోజున... ఆలయంలో లక్షబిళ్వార్చన, అన్నాభిషేకం ఘనంగా జరుగుతాయి. ఏటా డిసెంబరులో తెప్పోత్సవాలూ, మాఘమాసంలో 10రోజులపాటు బ్రహ్మోత్సవాలూ నిర్వహిస్తారు.

దర్శన భాగ్యం ఇలా...

తిరుపతి బస్టాండు నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో అలిపిరి మార్గంలో కపిలతీర్థం ఆలయం ఉంది. బస్టాండు సమీపంలోని రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతీ అరగంటకూ నడిచే తితిదే ఉచిత బస్సుల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ఆటోలూ ఉంటాయి. మదనపల్లి, చిత్తూరుల నుంచి తిరుపతి వచ్చే బస్సులు ఈ ఆలయం మీదుగానే వెళ్తాయి.

- పట్టా మోహన్‌కుమార్‌, న్యూస్‌టుడే, తిరుపతి(సాంస్కృతికం)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని