రామేశ్వరం
పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో దేశానికి దక్షిణ భాగంలో వున్న మహాక్షేత్రం రామేశ్వరం. లయకారకుడైన శివుడు రామనాథస్వామిగా భక్తులను ఆశీర్వదిస్తుంటారు. తమిళనాడులోని ఈ ఆలయం బంగాళాఖాతం పాక్ జలసంధిలోని ఒక ద్వీపంలో నెలకొనివుంది. తమిళనాడుకు ప్రధాన భూభాగమైన మండపానికి సమీపంలోని రామేశ్వరం ...
పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో దేశానికి దక్షిణ భాగంలో వున్న మహాక్షేత్రం రామేశ్వరం. లయకారకుడైన శివుడు రామనాథస్వామిగా భక్తులను ఆశీర్వదిస్తుంటారు. తమిళనాడులోని ఈ ఆలయం బంగాళాఖాతం పాక్ జలసంధిలోని ఒక ద్వీపంలో నెలకొనివుంది. తమిళనాడుకు ప్రధాన భూభాగమైన మండపానికి సమీపంలోని రామేశ్వరం ద్వీపంలో వున్న ఈ క్షేత్రం విశిష్టమైనది. శ్రీరాముడు, సీతాదేవిలు స్వయంగా ప్రతిష్టించిన శివలింగాలను ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. రామేశ్వరం ద్వీపం భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్వస్థలం కావడం విశేషం.
క్షేత్రప్రాశస్త్యం
సీతను అన్వేషించేందుకు వానరులతో కలసి లంకకు వెళ్లే క్రమంలో రామేశ్వరం నుంచే రామసేతును నిర్మించారు. తరువాత యుద్ధంలో రావణాసుర సంహారం జరుగుతుంది. బ్రహ్మహత్య పాతకానికి ప్రాయోశ్చితంగా శ్రీరాముడు శివ పూజ చేయాలని నిర్ణయిస్తాడు. వెంటనే ఆంజనేయుడిని హిమగిరుల నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని కోరుతాడు. అయితే ఆంజనేయుని రాక ఆలస్యం కావడంతో సీతాదేవి సముద్ర ఇసుకతో సైకత లింగాన్ని తయారుచేసి పూజలు నిర్వహిస్తారు. కొంత సమయానికి హనుమంతుడు శివలింగాన్ని తీసుకురావడంతో దానికి పూజలు నిర్వహిస్తారు. ఈ విధంగా రెండు లింగాలు ఆలయంలో వుండటం విశేషం. హనుమ తీసుకువచ్చిన లింగాన్ని విశ్వలింగం అంటారు. మొదట దర్శనంతో పాటు పూజలను ఈ లింగానికి చేయాలని రామచంద్రుల వారి ఆదేశమని పురాణాలు వెల్లడిస్తున్నాయి.
ఆలయ నిర్మాణశైలి
ద్రవిడ సంప్రదాయరీతిలో నిర్మించారు. ఆలయం చుట్టూ పెద్దదైన ప్రహారీ గోడ వుంది. గోపురాలు కూడా ఎక్కువ ఎత్తులో వున్నాయి. ఆలయంలోపల నడవాలు వున్నాయి. ప్రపంచంలోనే అతిపొడవైన నడవా (కారిడార్)గా వీటికి విశిష్టమైన గుర్తింపు వుంది. ఆలయంలో ఉత్సవ మూర్తులను వుంచే మండపాన్ని చొక్కటన్ మండపం అంటారు. చదరంగం పట్టిక ఆకారంలో వుండటంతో దీనికి ఈ పేరు వచ్చింది.
తీర్థాలు
రామేశ్వరం ద్వీపంలో అనేక తీర్థాలున్నాయి. రామనాథస్వామి ఆలయంలోనే 22 తీర్థాలున్నాయి. వీటిలో స్నానం చేయడం ఎంతో పుణ్యదాయకమని ఆలయచరిత్ర పేర్కొంటుంది. ఈ తీర్థాలు చిన్న చిన్న బావుల్లాగా వుండటం విశేషం. ఈ జలాలతో పుణ్యస్నానం చేస్తే తపస్సు చేసిన ఫలం వస్తుంది. ఆలయం బయట నుంచి కొంతదూరంలోనే సముద్రతీరం కనిపిస్తుంది. ఇక్కడ అలలు లేకుండా ప్రశాంతంగా వుండటం విశేషం. కాశీ యాత్రకు వెళ్లి అక్కడి గంగాజలాలను తీసుకువచ్చి రామేశ్వరంలోని సముద్రంలో కలిపితే కానీ కాశీయాత్ర పూర్తిచేసినట్టు అని పెద్దలు పేర్కొంటారు.
ప్రకృతి ఒడిలో రామేశ్వరం
రామేశ్వరం ఒక ద్వీపం. దీనికి మరో పేరు పంబన్ ద్వీపం. పాక్ జలసంధి భారత్- శ్రీలంకను వేరుచేస్తుంది. ఇక్కడ అటవీప్రాంతం ఎక్కువగా వుండటంతో ఎక్కడచూసినా పచ్చదనం కనపడుతుంది. ఒక వైపు సముద్రం, మరో వైపు పచ్చదనం మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
ఆలయాలు: ప్రధాన మందిరమైన అరుల్‌మిగు రామనాథస్వామి ఆలయ ప్రాంగణంలో పలు దేవాలయాలున్నాయి. అమ్మవారు పర్వతవర్ధిని, విశాలక్షి, విష్ణు, వినాయక మందిరాలున్నాయి. అనుప్పు మండపం, సుక్రవర మండపం, సేతుపతి మండపం, కల్యాణ మండపం, నంది మందిరం... తదితర విశిష్ట ప్రదేశాలను ఆలయంలో వీక్షించవచ్చు.
రామసేతు: ద్వీపం చివరి ప్రదేశమైన ధనుష్కోడి వద్దకు వెళితే శ్రీలంక వరకు నిర్మించిన రామసేతు భాగాలు కనిపిస్తాయి. 1964లో వచ్చిన భీకర తుపానులో ధనుష్కోడి పూర్తిగా ధ్వంసమైంది. ఆ శిథిలాలను మనం చూడవచ్చు. ధనుష్కోడి నుంచి శ్రీలంక తలైమన్నార్‌కు చేరుకోవచ్చు.
ఎలా చేరుకోవాలి
⇒ రామేశ్వరానికి సమీప విమానాశ్రయం మధురై. అక్కడ నుంచి వాహనం లేదా రైలులో ప్రయాణించి చేరుకోవచ్చు.
⇒ మధురైతో పాటు పలు ప్రాంతాల నుంచి రైలు సౌకర్యముంది.
⇒ రోడ్డు సదుపాయముంది.
⇒ మండపం నుంచి రామేశ్వర ద్వీపానికి బ్రిటిషువారు 1914లో రైలుమార్గం నిర్మించారు. సముద్రంలో దాదాపు మూడు కి.మీ. మేర నిర్మించిన ఈ మార్గం ఇంజినీరింగ్ ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుంది. మధ్యలో నౌకలు వెళ్లాల్సి వస్తే కొంచం మేర రైలు మార్గం పైకి లేచి దారి ఇచ్చే విధంగా నిర్మించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
South Korea: విదేశాల్లోని అమెరికా అతిపెద్ద మిలటరీ స్థావరంలో డ్రగ్స్..!
-
KTR: గ్రేటర్ పరిధిలో ఎన్నికల్లోగా లక్ష ఇళ్ల పంపిణీ: కేటీఆర్
-
Donald Trump : ఎన్నికల ప్రచారంలో పిజ్జాలు పంచిన ట్రంప్..
-
కృష్ణా జిల్లాలో దారుణం.. దంపతులను నరికి చంపిన దుండగులు
-
Gurpatwant Singh: అటువంటి వారు కెనడాను వీడండి.. వేర్పాటువాది బెదిరింపు
-
Ayyannapatrudu: తెదేపా కోసం ప్రాణాలు వదిలేందుకూ సిద్ధం: అయ్యన్నపాత్రుడు