చిన్ని కృష్ణుడికి ఆకలెక్కువ..

చిన్నికృష్ణ.. ముద్దులకృష్ణ..మురిపాల కృష్ణ అంటూ గోవిందుడిని ప్రార్థిస్తాం. గోకులంలో చిన్నికృష్ణుడు ఎన్నో అద్భుతాలను ప్రదర్శించారు. కేరళలోని కొట్టాయం సమీపంలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం ఎన్నో అద్భుతాలకు సాక్ష్యంగా నిలుస్తోంది.

Updated : 14 Mar 2023 18:16 IST

చిన్నికృష్ణ.. ముద్దులకృష్ణ..మురిపాల కృష్ణ అంటూ గోవిందుడిని ప్రార్థిస్తాం. గోకులంలో చిన్నికృష్ణుడు ఎన్నో అద్భుతాలను ప్రదర్శించారు. కేరళలోని కొట్టాయం సమీపంలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం ఎన్నో అద్భుతాలకు సాక్ష్యంగా నిలుస్తోంది. స్వామి వారి విగ్రహానికి ఏడుసార్లు మహానైవేద్యం పెడుతారు. ప్రతిసారి నైవేద్యం తగ్గిపోవడం విశేషం.

పాండవులకు విగ్రహాన్ని ఇచ్చిన గోకుల నందనుడు..

మహాభారత కాలంలో వనవాసం, అజ్ఞాతవాసం సమయంలో నాలుగు చేతులతో కూడిన తన విగ్రహాన్ని సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు పాండవులకు ఇచ్చినట్టు స్థలపురాణం చెబుతోంది. అజ్ఞాతవాసం అనంతరం పాండవులు వెళ్లే సమయంలో స్థానిక ప్రజలు తమకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని ప్రార్థించడంతో వారికి ఇచ్చారు. అక్కడే ఒక మందిరాన్ని నిర్మించిన భగవంతుడిని స్థానికులు ఆరాధించేవారు.  అయితే కాలక్రమంలో పూజలు లేకపోవడంతో కొందరు ఆ విగ్రహాన్ని సముద్రంలో కలిపివేశారు.  అనంతర కాలంలో విశ్వమంగళం స్వామియార్‌ ఒక పడవలో అక్కడకు వచ్చారు. ఒక ప్రాంతంలో పడవ ముందుకు సాగకపోవడంతో సముద్రంలోకి దూకాడు. అడుగుభాగాన శ్రీకృష్ణ విగ్రహం కనిపించింది. వెంటనే తీసుకొని పడవను చేరుకున్నాడు. అయితే పడవ తూర్పువైపుగా పయనించి ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశానికి చేరుకోవడంతో అక్కడే విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు తెలుస్తోంది.

స్వామివారికి విశ్రాంతి కొన్ని నిమిషాలే..

ప్రతి రాత్రి ఏకాంత సేవ తరువాత ఆలయాన్ని మూసివేస్తారు. తరువాత కొన్ని నిమిషాల్లోనే ఆలయాన్ని తెరుస్తారు. ఈ సందర్భంగా తాళం రాకపోతే దానిని విరగొట్టేందుకు అర్చకుడు గొడ్డలి పట్టుకొని ఉంటారు. గ్రహణ సమయాల్లోనూ ఆలయాన్ని మూసివేయారు. గతంలో ఒకసారి మూసివేస్తే స్వామివారు ఆకలితో బాధపడి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదులైంది. దీంతో గ్రహణ సమయాల్లోనూ మూసివేయరు. రోజుకు ఏడు సార్లు స్వామికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ నైవేద్యం రుచికరంగా ఉంటుంది. భక్తులందరూ  నైవేద్యాన్ని స్వీకరించాలని భగవంతుని అభీష్టం. అందుకే ప్రసాదం ఇంకా ఎవరికైనా అందలేదా అని పూజరులు అడుగుతారు. కంస వధ సందర్భంగా ప్రత్యేకమైన ఢంకాను కృష్ణుడు మోగించారట. అలాంటి ఢంకా ఇక్కడ ఉంది. ఆలయప్రాంగణంలో గణపతి,భూతనాధ,శివ, భగవతి,  సుబ్రమణ్య, యక్షి ఆలయాలున్నాయి. పూరం ఉత్సవాల సందర్భంగా ఏనుగులతో పెద్ద ప్రదర్శన ఉంటుంది. పదేళ్లలోపు చిన్నారులు బాలకృష్ణుల అలంకారంలో ఆలయంలో తిరుగుతుంటారు. 

ఎలా చేరుకోవచ్చు..
 కొట్టాయంకు రోడ్డు, రైల్వే మార్గాలున్నాయి.

కొచ్చి విమానాశ్రయం నుంచి ఇక్కడకు చేరుకోవచ్చు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని