గోవాలో ఈశ్వర ఆలయం

గోవా ప్రకృతి అందాలకే కాదు.. ఆధ్యాత్మికంగానే ఎంతో విశిష్టమైనది. ఈ చిన్న రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలున్నాయి.  ఆది శంకరుల గురువు గోవిందపాదులకు గురువైన గౌడపాదచార్యుల ఆశ్రమం ఇక్కడే ఉంది. సనాతన ధర్మానికి కొలువైన నేలలో సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రతిష్టితమైన మంగేషీ మందిరం ఉంది. 

Updated : 14 Mar 2023 17:47 IST

గోవా ప్రకృతి అందాలకే కాదు.. ఆధ్యాత్మికంగానే ఎంతో విశిష్టమైనది. ఈ చిన్న రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలున్నాయి.  ఆది శంకరుల గురువు గోవిందపాదులకు గురువైన గౌడపాదచార్యుల ఆశ్రమం ఇక్కడే ఉంది. సనాతన ధర్మానికి కొలువైన నేలలో సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రతిష్టితమైన శ్రీమంగేశి మందిరం ఉంది. 

ఇక్కడే పరమేశ్వరుడు విహరించాడు..
 స్థలపురాణం ప్రకారం  ఒకసారి కైలాసంలో ఆటలాడుతుండగా పార్వతీ అమ్మవారి చేతిలో ఆయన ఓడిపోయాడు. దీంతో ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఏర్పరచుకున్నాడు. శంభునాథుడిని అన్వేషిస్తూ అమ్మవారు ఇక్కడకు వచ్చారు. ఆమెను చూసిన ఈశ్వరుడు పులి రూపంలో ముందుకు వచ్చారు. హఠాత్తుగా వచ్చిన పులిని చూసిన అమ్మవారు ఒక్క క్షణం నిశ్చేష్టురాలయ్యారు. అనంతరం తేరుకొని ‘త్రాహి మాం గిరీశ’ అంటూ ప్రార్థించింది. దీనర్థం పర్వతాలకు  ప్రభువైనా దేవా రక్షించు అని.  వెంటనే ఈశ్వరుడు తన పూర్వరూపంలోకి రావడంతో అమ్మవారి ఆనందానికి అంతులేకుండా పోయింది. మాం గిరీశీ అన్న పదమే కాలక్రమంలో మంగేశ్‌గా మారింది.

జువారి నది ఒడ్డున పరమశివుడు ప్రత్యక్షమైన ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారు. అనంతరం ఈ ప్రాంతాన్ని పోర్చుగీసువారు ఆక్రమించారు. ఆలయాన్ని నిర్మూలించారు. అయితే కొందరు భక్తులు శివలింగాన్ని సమీపంలోని ప్రియల్‌కు తరలించారు. నాలుగు శతాబ్ధాల పాటు ఇక్కడే పూజలు నిర్వహించారు. 18వ శతాబ్దంలో మరాఠా సైన్యాధికారి రామచంద్ర సుక్తాంకర్‌ ఆలయాన్ని పునర్‌ నిర్మించాలని నిర్ణయించారు. దీంతో ఆలయాన్ని నిర్మించి శివలింగాన్ని  ప్రతిష్టించారు. ఇక్కడ ఉన్న ఎత్తయిన దీపస్తంభం  ఆకర్షణగా నిలుస్తోంది. 

ప్రాంగణంలో ఆలయాలు

ప్రధాన దేవాలయంతో పాటు అనేక ఉపాలయాలను ఇక్కడ వీక్షించవచ్చు. వినాయక, భైరవ, ముక్తేశ్వర్‌, గ్రామదేవత శాంతేరి, దేవి భగవతి.. తదితర దేవుళ్లు ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. 

ఎలా చేరుకోవచ్చు,
గోవా రాజధాని పనాజీకి 22 కి.మీ.దూరంలో ఉంది 
దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గోవాకు రోడ్డు, రైలు, విమాన సౌకర్యాలున్నాయి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు