వైకుంఠనాధుడు రథంపై వచ్చిన క్షేత్రం

భగవాన్‌ శ్రీ మహావిష్ణువు వైకుంఠ నుంచి తన రథంతో భూమిపై దిగి వెలసిన మహా పుణ్యక్షేత్రం కుంభకోణం. తమిళనాడులోని  ఆలయాల నగరమైన కుంభకోణంలో శివ, కేశవులకు అనేక ఆలయాలు ఉన్నాయి. శేషశయనుడు స్వయంగా వెలసిన క్షేత్రం ఇదేనని  ఆళ్వారుల గ్రంథాలు వెల్లడిస్తున్నాయి.

Updated : 14 Mar 2023 17:40 IST

భగవాన్‌ శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి తన రథంతో భూమిపై దిగి వెలసిన మహా పుణ్యక్షేత్రం కుంభకోణం. తమిళనాడులోని  ఆలయాల నగరమైన కుంభకోణంలో శివ, కేశవులకు అనేక ఆలయాలు ఉన్నాయి. శేషశయనుడు స్వయంగా వెలసిన క్షేత్రం ఇదేనని  ఆళ్వారుల గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. తిరుపతి, శ్రీరంగం తరువాత అంతటి పుణ్యక్షేత్రమిది.  సారంగపాణిగా వెలసిన భక్తనందనుడు  శయనిస్తూ వేలాది భక్తులను ఆశీర్వదిస్తుంటారు. అనంతునికి అత్యంత భక్తులైన 12 మంది ఆళ్వారులు నాలాయిర ప్రబంధంలో  సారంగపాణిపై అనేక దివ్యగీతాలను రచించారు. 

స్థలపురాణం

భృగుమహర్షి వైకుంఠానికి వచ్చిన సమయంలో  తనను గమనించలేదన్న కోపంతో ఏకంగా వైకుంఠనాధుని ఛాతీపై కాలితో కొడతాడు.  అయితే భక్త దయాళువు అయిన సుదర్శనధారి  ఏ మాత్రం ఆగ్రహం ప్రదర్శించకుండా అతిధి మర్యాదలు చేస్తాడు. దీంతో ఆగ్రహించిన అమ్మవారు భూలోకానికి వెళ్లిపోతారు. ఆమెను అన్వేషిస్తూ భక్తవల్లభుడు భూలోకానికి వెళ్లిపోతాడు. అక్కడే తిరుమల కొండల్లో స్వయంభువుగా అవతరిస్తాడు. కొంతకాలం అనంతరం  తన తప్పు మన్నించమని మహర్షి అమ్మవారిని వేడుకుంటాడు. తన కుమార్తెగా జన్మించాలని కోరుకుంటాడు. దీంతో అమ్మవారు భృగువును తపస్సు చేయాలని ఆదేశిస్తుంది. దీంతో మహర్షి కుంభకోణం తపస్సు ఆచరించి స్థానికంగా ఉన్న హేమ పుష్కరిణిలో  అమ్మవారు చిన్న శిశువుగా ఉండటం చూసి తీసుకువెళ్లి పెంచుకుంటాడు. అమ్మవారికి కోమలవల్లి అని పేరుపెడతారు. అనంతర కాలంలో అమ్మవారి కోసం వైకుంఠం నుంచి రథంలో స్వామివారు అక్కడకు చేరుకుంటారు.  అనంతరం వారి వివాహం అంగరంగవైభవంగా జరుగుతుంది. భూలోకానికి వచ్చే క్రమంలో స్వామి కొన్నాళ్లు భూగర్భంలో ఉంటారు. వైకుంఠం నుంచి వచ్చే సమయంలో చేతిలో సారంగం అనే విల్లును ధరించి ఉండటంతో సారంగపాణిగా పేరు వచ్చింది. 

శ్రీలక్ష్మీదేవి అమ్మవారు ఆవిర్భవించిన క్షేత్రం

శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు స్వయంగా బాలికగా అవతారం దాల్చిన క్షేత్రం కావడంతో కోమలవల్లి-శ్రీలక్ష్మి క్షేత్రంగా పేరువచ్చింది. వివాహం అనంతరం శ్రీమహావిష్ణువు ఇక్కడ అత్తింట్లో నివాసం ఉంటారు. అందుకే తమిళంలో స్వామిని వీట్టోడు మాప్పిళ్లై అంటారు.  అంటే ఇంటిలో ఉండే అల్లుడు అని అర్థం. ఈ ఆలయంలో తొలిపూజలు అమ్మవారికి నిర్వహిస్తారు.  

అద్భుత కట్టడం

రథంపై వచ్చారు కాబట్టి ఆలయాన్ని రథం ఆకారంలో నిర్మించారు. చోళుల కాలంలో ఆలయాన్ని నిర్మించారు. ప్రధాన గర్భాలయంలో స్వామి అమ్మవారు కోమలవల్లితో కలిసి భక్తులకు దర్శనమిస్తారు.  గాలిగోపురం 11 అంతస్థులతో ఉంటుంది. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహామహం ఉత్సవం జరిపే 5 ఆలయాల్లో సారంగపాణి ఆలయం ఒకటి. ఆలయానికి ముందు వున్న  పొట్రమరై పుష్కరిణి ఇందుకు వేదికగా నిలుస్తుంది. భరతనాట్యంలోని  108 భంగిమలను ఆలయ గోడలపై చిత్రించారు. పంచరంగ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇవన్నీ కావేరి తీరంలో ఉంటాయి. శ్రీరంగపట్న, శ్రీరంగం, అప్పలరంగం, పరిమళ రంగనాధుని ఆలయాల తరువాత సారంగపాణి ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న రెండు రథాలు భారీగా ఉంటాయి. రథోత్సవం వైభవంగా జరుగుతుంది.

ఇలా చేరుకోవచ్చు..

తమిళనాడులోని తంజావూర్‌ జిల్లాలో ఉన్న కుంభకోణానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు సౌకర్యాలున్నాయి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు