నిశ్చలమూర్తి...నిర్మలభక్తి
నిశ్చలత్వానికి నిలువెత్తు నిదర్శనం ఆ మహర్షి. నిర్మలత్వానికి నిండైన సాక్ష్యం ఆ మౌనర్షి. ఆ తపోధనుడి తేజోమయ వీక్షణం, ఆశ్రితుల్లో అనాదిగా పేరుకున్న అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తుంది. పరమ నాస్తికులను కూడా పారమార్థిక పిపాసులుగా మార్చేస్తుంది.
అరుణాచలంలో రమణాశ్రమం ఆరంభమైన తొలి నాళ్లవి. రోజూ ఎందరో భక్తులు, శ్రీమంతులు మహర్షిని దర్శించేవారు. దాంతో ఆశ్రమంలో సొమ్ము ఉంటుందన్న భ్రమతో దొంగలు పడ్డారు. డబ్బూ, విలువైన వస్తువులూ లేవని ఆశ్రమవాసులను కొట్టారు. అడ్డువచ్చిన మహర్షిపై కూడా దాడి చేశారు. మర్నాడు సందర్శకులు వచ్చేసరికి రమణులు గాయాలతోనే ఉడుతలకు జీడిపప్పు తినిపిస్తున్నారు. బాధపడుతున్న భక్తులతో ‘ఇప్పుడేమైందని?! మీరు పూలతో పూజిస్తే వారు కర్రలతో పూజించారు. అదీ పూజే. ఇది గ్రహించి నప్పుడు, అది అర్థం చేసుకోవద్దా?’ అంటూ నవ్వేశారు. అలా కృష్ణభగవానుడిలా అవమానాలూ, అభినందనలూ నిందలు, స్తుతులను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞులాయన. అందుకే దొంగల సంగతి ఫిర్యాదు కూడా చేయనివ్వలేదు.
సామాన్యుల్లో సామాన్యుడిగా...
తాను ఆధ్యాత్మిక మేరుశిఖరమైనా ఎన్నడూ ప్రత్యేకం అనుకోలేదు. సమత్వమే ఆధ్యాత్మిక సాధన అనేవారు. ప్రాధాన్యత ఇవ్వబోతే ‘నన్ను హెచ్చించి ఇతరులని చిన్నచేయడాన్ని ఒప్పుకోలేను. నాలో ఉన్న పరమాత్మే అందరిలోనూ ఉన్నాడు’ అనేవారు. ఏదైనా వాదించాలి, దేన్నయినా రుజువు చేయాలనే ఆరాటం ఉండేది కాదు. తన భావాలను బలవంతంగా రుద్దేవారు కాదు. ఆయన దైనందిన జీవితం క్రమబద్ధంగా సాగేది. తను ఉపయోగించే వస్తువులూ, పుస్తకాలను నిర్ణీత స్థానాల్లో ఉంచేవారు. వారి ఏకైక వస్త్రం కౌపీనం. అదెప్పుడూ మల్లెపువ్వులా తెల్లగా ఉండేది. గడియారాలను రేడియో సమయానికి అనుగుణంగా ఉంచేవారు.
బ్రహ్మజ్ఞానీ.. భాగవతోత్తముడూ...
ఆదిశంకరాచార్యులు వివేక చూడామణిలో ‘బ్రహ్మజ్ఞాని నిరుపేద అయినా నిత్యసంతోషిగా, అసహాయుడైనా మహాబలశాలిగా, భుజింపకున్నా నిత్య తృప్తుడుగా ఉంటూ అందరినీ సమదృష్టితో చూస్తాడు’ అన్నారు. ఆ లక్షణాలన్నీ రమణమహర్షిలో చూస్తాం. ఆయన భక్తిలో పరాకాష్ఠకు చేరిన భాగవతోత్తముడు కూడా! చిన్నప్పుడు స్వగ్రామం తిరుచ్చుళిలో కుటుంబసభ్యులు కోపగించుకోగా ఆలయానికి వెళ్లి దుఃఖించారట. ‘ఏ కాస్త బాధ కలిగినా నాకు తెలీకుండానే ఆలయాలకు పరుగెత్తేవాణ్ణి’ అని మననం చేసుకున్నారు. అరుణాచలంలో ఓ భక్తుడు వినాయకచవితి సందర్భంగా గణపతిపై పద్యాలు రాయమంటే భక్తితో రాశారు. అలాగే ఓ శివరాత్రినాడు పరమశివుడిపై తెలుగులో ప్రార్థన గీతాలు రాశారు.
అపర శుకమహర్షి
రామకృష్ణ మఠం, మిషన్ల సర్వాధ్యక్షులుగా వ్యవహరించిన స్వామి రంగనాథానంద ‘రమణులు అసాధారణులు. అందరినీ ఆకట్టుకోగల మహనీయులు. పరమభాగవతోత్తముని లక్షణాలను పుణికిపుచ్చుకున్నవారు. భాగవతాన్ని వినిపించిన శుకమహర్షికి, రమణమహర్షికి ఎన్నో పోలికలు ఉన్నాయి. వారి శాంతచిత్తం, నిశ్చలత్వం దుఃఖాల నుంచి బయటపడేస్తాయనటంలో సందేహం లేదు. మహర్షి అపార జ్ఞానాన్ని అంచనా వేయటం బహు కష్టం’ అన్నారు.
నాస్తికుడు ఆస్తికుడిగా...
స్వామి చిన్మయానంద రమణులను దర్శించి నాస్తికుడు కాస్తా ఆస్తికుడిగా మారిపోయారు. ఆ సంగతే ‘యాదృచ్ఛికంగా రమణాశ్రమానికి వెళ్లాను. ఆ రోజుల్లో దేవుడంటే అంత నమ్మకం లేదు. మహర్షి నా కళ్లలోకి చూశారు. అంతే! ఆ చూపు ఏకంగా అంతరంగంలోకి ప్రసరించింది. ఏం జరిగిందో తెలీదు. నా సంశయాలన్నీ ప్రక్షాళనమయ్యాయి. నాస్తికత్వం సమసిపోయింది’ అంటూ చెప్పారు. ఇలా ఎందరో మేధావులూ, సామాన్యులూ కూడా రమణుల సన్నిధిలో జీవితాలను ధన్యం చేసుకున్నారు.
‘కాయ’కష్టమూ ఆయన కనికరమే!
ఆ నిశ్చలత్వం, నిర్మలత్వమే రమణుల బోధనల్లోనూ ప్రతిఫలించేవి. ఓ సందర్భంలో భక్తుడొకరు ‘భగవాన్! మేమింత భక్తులమైనా, మాకెందుకు ఇన్ని కష్టాలు?’ అనడిగాడు. అప్పుడు రమణులు ‘కష్టాలను వరంగా భావించాలి. దేవుడిపై మనసు మరలటానికి అవెంతో ఉపయోగపడతాయి. వాటితో మనసు శుద్ధి అవుతుంది. రజకుడు వస్త్రాలను శుభ్రం చేసేందుకు ఉతుకుతాడు. మలినాల్ని తొలగించేందుకే అతనలా చేస్తాడు. భక్తుల మనసులు శుద్ధి కావటానికి దైవం కూడా శరీరానికి కష్టాలు కలిగిస్తాడు. సహనం వహిస్తే ఆనందం దక్కుతుంది’ అన్నారు. మరోసారి ఓ భక్తుడు వేసవిలో చలువ ప్రదేశాలకు వెళ్తున్నట్లు చెప్పినప్పుడు ‘నిజమైన చల్లదనం లోపల ఉంది. అది తెలుసుకుంటే ఎక్కడైనా చల్లగానే ఉంటుంది. పాదాల రక్షణకు చెప్పులు ధరిస్తే సరిపోతుంది. అంతేకానీ నేలంతా తోలుముక్కతో కప్పలేం కదా!’ అన్నారు.
నీతో నీవు.. నీలో నీవు..
‘నిశ్చలంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? మనసెందుకు పరిపరి విధాల పరుగెడుతుంది?’ అని ఓ భక్తురాలు అడిగింది. అప్పుడు రమణులు ‘ఎందరినో కలుసుకోవటంలో రోజులు గడిచిపోతాయి. మనల్ని మనం కలుసుకోవటానికి మాత్రం సమయం దొరకటంలేదు. అందుకే ఇంత అలజడి. నిన్ను నువ్వు కలుసుకుని, నువ్వెవరో తెలుసుకో! నీతో నువ్వు.. నీలో నువ్వు ఉండటానికి ప్రయత్నించు. ఇతరులకు ఎంత చెప్పినా గ్రహించలేరు. అందుకే ముందు నువ్వు మంచిగా ఉండు. మౌనం పాటించు’ అన్నారు. ఈ సూత్రంతోనే మహర్షి తనలో తాను యోచిస్తూ చూపుతోనే ఎందరినో మార్చేసే వారు. గుడిపాటి వెంకట చలం అంతే! రమణుల దర్శనంతో సంపూర్ణంగా మారిపోయారు. ‘ఆకాశాన్నంటే ఆ గంభీర శ్యామలాకృతి నాపై దృష్టి నిలిపింది. ఇనుమును చీల్చే అగ్నికీలలా, పాషాణాన్ని కరిగించే కేంద్రీకృత సూర్యరశ్మిలా ఆ తేజోమయ వీక్షణం నా హృదయాంతరాళంలోకి ప్రసరించి భగ్గున మండింది. నేను లేను.. నేను లేను.. నేను భావించుకున్నది ఏదీ లేదు’ అంటూ మహర్షికి శరణాగతులయ్యారు.
బి.సైదులు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Chiranjeevi: జన్మజన్మలకు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాం..: చిరంజీవి
-
India News
PM Modi: బడ్జెట్ సమావేశాల వేళ.. మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ
-
General News
TelangaNews: ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్ఎల్పీఆర్బీ కీలక నిర్ణయం
-
Movies News
Social Look: ఆ హీరోతో ఫొటో దిగినందుకు ఖుష్బూ సుందర్ ఆనందం.. పులివెందులలో అషు!
-
India News
IndiGo: అత్యవసర ద్వారం కవర్ తొలగింపు యత్నం.. విమానం గాల్లో ఉండగా ఘటన!
-
Technology News
E-Waste: ఈ-వ్యర్థాల నియంత్రణ దిశగా భారత్ అడుగులు!