జ్ఞానజ్యోతుల సత్సంగం

జనన మరణాలనే సంసార చక్రం నుంచి జీవిని దూరంచేసి మోక్షాన్ని ప్రసాదించే మార్గాల్లో సత్సంగం ఒకటి.

Updated : 14 Mar 2023 13:35 IST

జనన మరణాలనే సంసార చక్రం నుంచి జీవిని దూరంచేసి మోక్షాన్ని ప్రసాదించే మార్గాల్లో సత్సంగం ఒకటి.

సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం

సంభాషణం కోటితీర్థం వందనం మోక్షసాధనం

అంటోంది శాస్త్రం. అందుకు నిదర్శనమీ పురాణ కథ. ఒకసారి నారద మహర్షి సత్సంగం గొప్పతనమేంటని విష్ణుమూర్తిని అడిగాడు. ‘అది తెలియాలంటే దండకారణ్యం వెళ్లి అప్పుడే గుడ్డు నుంచి రాబోతున్న పక్షినడుగు’ అన్నాడు. నారదుణ్ణి వెళ్లి దాన్ని అడిగేలోపు అది తేరిపార చూసి గిలగిల కొట్టుకుని చనిపోయింది. జరిగింది చెప్పగా ‘ఆశ్రమంలో ఆవు ఈనబోతోంది. ఆ లేగదూడనడుగు’ అన్నాడు విష్ణుమూర్తి. దేవర్షి అడగబోతే అది కూడా ప్రాణం విడిచింది. ఈసారి ‘మహారాజుకు కొడుకు పుట్ట బోతున్నాడు, ఆ బాలుణ్ణి అడుగు’ అన్నాడు.

అయ్యో రాకుమారుడు కూడా చనిపోతాడేమోనని భయం కలిగినా వెళ్లి అడిగాడు. ‘మహర్షీ! ఈ ప్రశ్న రెండుసార్లడిగావు. పక్షిపిల్ల, దూడ రూపాల్లో ప్రాణాలు వదిలాను. మీ సంభాషణ వల్ల నాకు మరో జన్మలేదని అర్థమైంది. సత్సంగమంటే సత్యం, శాశ్వతం, పరిపూర్ణం. ఇది అంతటా వెలుగులు నింపుతుంది’ అంటూ నారద మహర్షికి నమస్కరించాడు.

 శివరాజేశ్వరి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని