జగన్మాత మదుర మీనాక్షి

జగన్మాత మీనాక్షి వెలసిన క్షేత్రం తమిళనాడులోని మదురై. లయ కారకుడైన పరమేశ్వరుడు సుందరేశ్వరుడిగా ఇక్కడ నెలకొని వున్నారు. మీనాక్షి, సుందరేశ్వరుల ఆశీస్సులతో పునీతమైన మహాక్షేత్రమిది. ద్రవిడ వాజ్మయానికి వేల సంవత్సరాలనుంచి మదురై క్షేత్రం కేంద్రంగా ఉంది. వైగై నది తీరంలోని ఈ క్షేత్రం నిత్యం వేలాదిమంది భక్తులతో సందడిగా ఉంటుంది.

Updated : 03 Nov 2023 07:55 IST

జగన్మాత మీనాక్షి వెలసిన క్షేత్రం తమిళనాడులోని మదురై. లయ కారకుడైన పరమేశ్వరుడు సుందరేశ్వరుడిగా ఇక్కడ నెలకొని వున్నారు. మీనాక్షి, సుందరేశ్వరుల ఆశీస్సులతో పునీతమైన మహాక్షేత్రమిది. ద్రవిడ వాజ్మయానికి వేల సంవత్సరాలనుంచి మదురై క్షేత్రం కేంద్రంగా ఉంది. వైగై నది తీరంలోని ఈ క్షేత్రం నిత్యం వేలాదిమంది భక్తులతో సందడిగా ఉంటుంది. 2500 ఏళ్ల క్రితమే సుందరేశ్వర్‌ ఆలయం ( మీనాక్షి అమ్మవారి ఆలయం) నిర్మించారని చారిత్రక ఆనవాళ్లు తెలుపుతున్నాయి. ఈ గుడి ఆ కాలపు జీవనవిధానాన్ని ప్రతిబింబిస్తుంది. అద్భుతమైన శిల్ప, చిత్ర కళారీతులతో ఉన్న ఈ దేవాలయం తమిళ సంస్కృతికి చిహ్నం. దీని గురించి తమిళ సాహిత్యంలో పురాతన కాలం నుంచి ప్రస్తావిస్తున్నారు.

స్థల పురాణం

మదురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతి దేవి చిన్న పాప రూపంలో భూమ్మీదకు వచ్చింది. ఆమెను పెళ్లాడటానికి శివుడు సుందరేశ్వరుడుగా అవతరించాడు. అమ్మవారు పెరిగి పెద్దదై ఆ నగరాన్ని పాలించసాగింది. విష్ణుమూర్తి తన చెల్లి పెళ్లి చేయడానికి వైకుంఠం నుంచి బయలు దేరుతాడు. అయితే సమయానికి రాలేకపోతాడు. స్థానిక దేవుడు పవలాకనైవాల్‌ పెరుమాళ్‌ ఈ వివాహం జరిపిస్తాడు. ఈ వివాహాన్నే ప్రతి ఏటా ‘చిత్తిరై తిరువళ’గా వేడుకగా నిర్వహిస్తున్నారు.

తెలుగు నాయక రాజులతో పునర్‌ నిర్మాణం 

శైవ తత్వశాస్త్రానికి చెందిన తిరుజ్ఞాన సంబన్‌దార్‌ ఈ ఆలయం గురించి ఏడవ శతాబ్దంలో పేర్కొన్నాడు. అనంతం ఖిల్జీ సేనాని దురాక్రమణదారుడు మాలిక్‌ కపూర్‌ దీన్ని కూల్చి వేయించినట్లు చెప్తారు. ఈ దాడిలో గుడికి సంబంధించిన ఆనవాళ్లన్నీ ధ్వంసమైపోయాయి. 16వ శతాబ్దంలో మదురై మొదటి నాయక రాజు విశ్వనాథనాయకుడు ఈ గుడి పునర్నిర్మాణానికి పూనుకున్నాడు. తరువాత తిరుమల నాయక రాజు దీని అభివృద్ధికి పెద్ద ఎత్తున ధన సహాయం చేశాడు.

గోపురాలే ప్రధాన ఆకర్షణ 

ఈ ఆలయం నలుదిక్కులా నాలుగు ఎత్తైన రాజగోపురాలతో గంభీరంగా కనబడుతుంది. సుందరపాండ్యన్‌, పరాక్రమ పాండ్యన్‌లు 13,14 శతాబ్దాల్లో తూర్పు, పశ్చిమ గోపురాలను, 16వ శతాబ్దంలో శివ్వంది చెట్టియార్‌ దక్షిణ గోపురాన్ని కట్టించారని స్థల పురాణం. తూర్పు గోపురం సమీపంలో అష్టలక్ష్మీ మండపం ఉంటుంది. ఇక్కడ మొత్తం 16 గోపురాలు ఉన్నాయి. గుడి సంప్రదాయం ప్రకారం మొదట మీనాక్షీ అమ్మవారిని దర్శించుకోవాలి. కానీ ఇక్కడికి రావాలంటే తూర్పు వైపున ఉన్న అష్టలక్ష్మీ మంటపం ద్వారా ఆలయ ప్రవేశం చేయాలి. చూపరులను కట్టిపడేసే మరో అద్భుత నిర్మాణం స్వర్ణ కమల తటాకం. ఆలయ ప్రవేశ ద్వారంపై అమ్మవారి కల్యాణ ఘట్టాలు శిల్పాల రూపంలో చెక్కబడ్డాయి.

వేయిస్తంభాల మంటపం

ఈ మంటపాన్ని తిరునల్వేలిలోని పురాతన నెల్లయార్‌ దేవాలయం నమూనాలో నిర్మించారు. చెప్పుకోవడానికి వేయి స్తంభాలు అంటున్నా ఇక్కడ చెక్కినవి మొత్తం 985 మాత్రమే. దీన్ని భారతీయ పురావస్తుశాఖ వారు నిర్వహిస్తున్నారు. విశ్వనాథ నాయకుడి ప్రధాన మంత్రి అరియనాథ ముదలియార్‌ దీన్ని కట్టించారు. ప్రవేశ ద్వారానికి ఒక వైపు పంచ కల్యాణిపై కూర్చున్న ఈయన విగ్రహం దర్శనమిస్తుంది. ఈ మంటపానికి వెలుపల పశ్చిమాన ఉన్న స్తంభాలను తాకినప్పుడు ప్రతి స్తంభం ఒక ప్రత్యేక సంగీత స్వరాన్ని వినిపిస్తుంది. దీనికి దక్షిణాన ఉన్న కల్యాణ మంటపంలో ఏప్రిల్‌ నెలలో శివపార్వతుల కల్యాణం జరుగుతుంది.

పండుగలు.. మీనాక్షి తిరుకల్యాణం ఈ ఆలయంలో జరిగే ముఖ్యమైన పండుగ. దీన్ని ఏటా ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. రథోత్సవం, తెప్పోత్సవంతో పాటు పలు ఉత్సవాలు జరుపుతారు. అమ్మవారి కల్యాణం లాగే అవని మూలోత్సవం ఇక్కడ ప్రధానంగా నిర్వహించే పండుగ. పదిరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని సుందరేశ్వరుడికి అంకితం చేశారు. ఆ వేడుక జరిగేటప్పుడు భక్తులకు ఆయన మహిమలను వర్ణిస్తారు. ఇక్కడ నవరాత్రి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

ఎలా చేరుకోవచ్చు..

  • తమిళనాడులోని మదురై నగరంలో ఆలయం ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి మదురైకు రైలు సౌకర్యం ఉంది. చెన్నై నుంచి ఇక్కడికి ఏడు గంటల ప్రయాణం. 
  • చెన్నై, మదురై మధ్య వైగై సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రతిరోజూ నడుస్తుంది. 
  • మదురై విమానాశ్రయానికి చెన్నై, తిరుచ్చి, బెంగళూరు, కోయంబత్తూరు నుంచి రోజూ విమాన సర్వీసులు ఉన్నాయి. మదురైకు దేశంలోని ప్రధాన కేంద్రాల నుంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని