అబద్ధం ఎప్పుడు చెప్పవచ్చు?

సనాతన ధర్మంలో సత్యమే ప్రమాణంగా ఉంది. భారతీయసంప్రదాయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యం చెప్పకూడదని పెద్దలు ప్రవచించారు. అయితే కొన్ని సమయాల్లో అబద్ధం చెప్పవచ్చని ధర్మం...

Updated : 12 Mar 2023 13:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: సనాతన ధర్మంలో సత్యమే ప్రమాణంగా ఉంది. భారతీయసంప్రదాయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యం చెప్పకూడదని పెద్దలు ప్రవచించారు. అయితే కొన్ని సమయాల్లో అబద్ధం చెప్పవచ్చని ధర్మం పేర్కొంటుంది.
అరణ్యవాసానికి బయలుదేరిన శ్రీరాముడు రథాన్ని అధిరోహించి సీతాలక్ష్మణ సమేతంగా వెళుతుంటాడు. పుత్ర వియోగం భరించలేని దశరథుడు రామున్ని ఆగమని కోరుతాడు. అయితే రథసారథి సుమంతుడిని రథం ఆపకుండా పోనీయమని శ్రీరాముడు ఆదేశిస్తాడు. అయితే రాజునకు ఏమని జవాబివ్వాలి అని సుమంతుడు సంకోచిస్తాడు. దీంతో శ్రీరాముడు ‘‘ నౌశ్రౌషమితి రాజా! సముపాలో లబ్దోపి వక్షిపి’’ అని చెబుతాడు. దీనర్ధం మాట వినపడికూడా వినపడలేదని చెప్పడం. దశరథుని మాటలు విని రాముడు వెనక్కు వెళితే అరణ్యవాసానికి వెళ్లవద్దని కుమారుడిని దశరథుడు ఆజ్ఞాపిస్తాడు. దీంతో దశరథునికి, శ్రీరామునికి అసత్యదోషం కలుగుతుంది. కానీ దశరథుని మాటలు వినపడలేదని సుమంతుడు చెప్పడం వల్ల పెద్దగా ధర్మదోషం ఉండదు. దీని వల్ల రాజు తొలుత ఇచ్చిన ఆజ్ఞను కుమారుడు పాటించే అవకాశం కలుగుతుంది.దీంతో ప్రియమైన అసత్యమే మంచిదని రాముడు భావించాడు.
అసత్యాన్ని పలకకూడదని చెప్పినా కొన్ని సమయాల్లో పలకవచ్చని బలి చక్రవర్తితో శుక్రాచార్యుడు చెబుతాడు. శ్రీమహావిష్ణువు వామనుడి రూపంలో బలిచక్రవర్తి వద్దకు వచ్చి  మూడు అడుగులు కోరుతాడు. వాటిని ఇచ్చేందుకు బలి సిద్ధమవగా అతను వామనుడు కాదని త్రివిక్రముడని బలితో ఈ విధంగా చెప్పాడు.

‘‘వారిజాక్షులందు వైవాహికము లందు 
బ్రాణవిత్తమానభంగమందు
జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు
బొంకవచ్చు నఘము పొందఁ దధిప!’’

చక్రవర్తీ.. అసత్యాన్ని చెప్పవద్దని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కానీ కొన్ని అత్యవసర సమయాల్లో అసత్యాన్ని చెప్పడం ధర్మమార్గం తప్పడం కాదు. 
ఆడవారి విషయంలో, పెండ్లి సందర్భాల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో , మానభంగం కలుగు సందర్భంలోనూ, భయపడి పరిగెత్తే గోవులను కాపాడుకునేందుకు అసత్యాన్ని చెప్పవచ్చు. ఇప్పుడు నీవు అబద్దం చెప్పడం వల్ల ఎలాంటి పాపమురాదు అని శుక్రుడు సూచిస్తాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు