తిరుమల శ్రీవారికి ఎన్ని ప్రసాదాలు నివేదిస్తారు?

తిరుమల పుణ్యక్షేత్రం ‘కలియుగ వైకుంఠ’మని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి మూలకారణం.. స్వయం వ్యక్త స్వరూపంలో వెలిసిన శ్రీ వేంకటేశ్వరుడు. తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామశిల ద్వారా స్వయంభూగా

Updated : 14 Mar 2023 17:43 IST

తిరుమల పుణ్యక్షేత్రం ‘కలియుగ వైకుంఠ’మని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి మూలకారణం.. స్వయం వ్యక్త స్వరూపంలో వెలిసిన శ్రీ వేంకటేశ్వరుడు. తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామశిల ద్వారా స్వయంభువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుడని, సప్తగిరీశుడని, ఏడుకొండలవాడని, బాలాజీ, తిరుమలప్ప, తిమ్మప్ప అని.. ఇలా ఎన్నో పేర్లతో భక్తజనులు ఆర్తిగా సంబోధిస్తూ ఉన్నారు. ఆనందనిలయుడైన శ్రీవారు నెలకొన్న బంగారు మందిరానికి ‘ఆనంద నిలయ’మనే వ్యవహారం అనాదిగా ప్రసిద్ధమై ఉంది. తిరుమల శ్రీవారు అర్చన ప్రియుడు,  ఉత్సవ ప్రియుడు, సంకీర్తన ప్రియుడే కాదు, నైవేద్య ప్రియుడు కూడా. 

స్వామివారి నైవేద్య సమర్పణకు ఎంతో ఘన చరిత్ర ఉంది. శ్రీవారికి ప్రీతికరమైన లడ్డూ గురించి భక్తులకు సుపరిచితమే. అయితే, స్వామి వారికి ఇంకొన్ని ప్రసాదాలను కూడా నివేదిస్తారు. ఇందుకోసం ఎంతోమంది రాజులు వితరణలు ఇచ్చి తమ భక్తిని చాటుకున్నారు. ప్రసాద వితరణ కోసం ఏయే రాజు ఎంతెంత స్వామి వారికి సమర్పించిందీ ఆలయ గోడలపై ఉన్న శాసనాలు తెలియజేస్తున్నాయి. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడిన తర్వాత కూడా స్వామివారికి నైవేద్య వితరణ ఎంతో నిష్టగా క్రమ పద్ధతిలో సాగుతోంది. 

ఇక రోజూ స్వామివారికి త్రికాల నైవేద్యం ఉంటుంది. నైవేద్య సమర్పణ సమయాన్ని మొదటి గంట, రెండో గంట, మూడో గంటగా వ్యవహరిస్తారు. ఇందులో భాగంగా గురు శుక్రవారాల్లో తప్ప, మిగిలిన అన్ని రోజుల్లో నైవేద్య సమయాల్లో మార్పు ఉండదు. గురు, శుక్రవారాల్లో కూడా రెండో గంట సమయం మాత్రమే మారుతుంది. ఈ మేరకు స్వామి వారికి తొలి నివేదన ఉదయం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో గంట ఉదయం 10గంటలకు, మూడో గంట రాత్రి గంట 7.30నిమిషాలకు ఉంటుంది. గురు, శుక్రవారాల్లో  రెండో గంట ఉదయం 7.30నిమిషాలకు ఉంటుంది. స్వామి వారికి సమర్పించే వాటిలో రోజూ ఒకేరకమైన ప్రసాదాలు ఉన్నా, ప్రతి నివేదనలోనూ వైవిధ్య ఉండేలా చూస్తారు. 

ఉదయం 5.30నిమిషాలకు ప్రారంభమయ్యే మొదటి గంటలో సమర్పించే నైవేద్యంలో చక్రపొంగలి, కదంబం, పులిహోర, దద్యోజనం, మాత్ర ప్రసాదాలతో పాటు, లడ్డూలు, వడలు నివేదిస్తారు. ఈ ప్రసాదాలను బేడి ఆంజనేయస్వామివారితో పాటు ఆలయంలోని ఉపాలయాలకు పంపిస్తారు. ఉదయం 10గంటలకు రెండో గంట నివేదనలో పెరుగన్నం, చక్రపొంగలి, పులిహోర, మిర్యాల పొంగలి, సీర, సేకరబాద్‌ నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక రాత్రి 7.30నిమిషాలకు మూడో నివేదనలో కదంబం, మొలహోర, తోమాల దోశలు, లడ్డూలు, వడలతో పాటు, ఆదివారం అయితే, ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన ఆదివారం పిండిని శ్రీవారికి సమర్పిస్తారు. 

వారంలో ఒక్కరోజు ప్రసాదాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. సోమవారం విశేష పూజ సందర్భంగా 51 పెద్ద దోశలు, 51 చిన్న దోశలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పాలను నివేదిస్తారు. మంగళవారం నాటి నివేదనలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది ‘మాత్ర ప్రసాదం’. మిగిలినవన్నీ నిత్యం సమర్పించేవే ఉంటాయి. బుధవారం నాటి ప్రసాదాల్లో ప్రత్యేకంగా పాయసం, పెసరపప్పును సమర్పిస్తారు. గురువారం నాటి ప్రసాదాల్లో ప్రతినిత్యం సమర్పించేవాటితో పాటుగా, తిరుప్పావడ సేవను పురస్కరించుకుని జిలేబి, మురుకు, పాయసాలను నివేదిస్తారు. శ్రీవారి అభిషేక సేవ జరిగే శుక్రవారం స్వామివారికి ప్రత్యేకంగా పోళీలు సమర్పిస్తారు. అలాగే శనివారం నాటి నివేదనలో కదంబం, చక్రపొంగలి, పులిహోర, దద్యోజనం, మిర్యాల పొంగలి,  లడ్డూలు, వడలు, సీర, సేకరాబాద్‌,  కదంబం, మొలహోర, తోమాల దోశలను నివేదనగా సమర్పిస్తారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని