కార్తికంలో విష్ణువుని పూజించడంలో ఆంతర్యమేమిటి?

కార్తిక మాసంలో ఆయన పేరు స్మరిస్తే చాలు పాపాలు నశించిపోతాయి. ఆయన ముందు ఒక్క జ్యోతిని వెలిగిస్తే చాలు ముల్లోకాలలోనూ

Updated : 14 Mar 2023 16:39 IST

కార్తిక మాసంలో ఆయన పేరు స్మరిస్తే చాలు పాపాలు నశించిపోతాయి. ఆయన ముందు ఒక్క జ్యోతిని వెలిగిస్తే చాలు ముల్లోకాలలోనూ దీపాలను వెలిగించినంత దివ్య పుణ్యఫలం లభిస్తుంది. ఇంతకూ ఎవరీ స్వామి అనంటే కాశీలో ఉండే బిందుమాధవుడు. ఈ విషయాన్ని స్కంద పురాణాంతర్గతంగా ఉన్న కాశీఖండం అరవయ్యో అధ్యాయం వివరిస్తోంది. మాధవ శబ్ధానికి సంపూర్ణార్థాన్ని పరిశీలిస్తే లక్ష్మీపతి లేదా శ్రీమహావిష్ణువు అని అర్థం స్ఫురిస్తుంది. ఈ మాధవుడికి కాశీలోని పంచనద తీర్థమంటే మహాఇష్టంగా ఉండేది. అలా ఆ స్వామి లక్ష్మీదేవితో సహా పంచనద తీర్థంలో ఉంటున్న రోజుల్లో ఓ రోజున అగ్నిబిందు అనే ఒక మహాముని విష్ణువుకు కనిపించాడు. ఆ ముని లక్ష్మీవల్లభుడైన శ్రీమహావిష్ణువుకు అత్యంత భక్తుడు. అగ్నిబిందు ముని పంచనద తీర్థంలో ఉన్న విష్ణువును గొప్పగా స్తుతించాడు. ఆ స్తుతికి మెచ్చిన స్వామి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు ప్రత్యేకంగా ఏ వరమూ అక్కరలేదు కానీ తన పేరులోని సగభాగాన్ని కలుపుకొని ఆ పేరుతో అక్కడే ఉంటూ భక్తులను అనుగ్రహిస్తూ ఉండమన్నాడు. ఆ భక్తులకు సంపదరూపమైన మోక్షలక్ష్మీ ప్రాప్తిస్తుండాలని ముని కోరుకున్నాడు. దానికి విష్ణువు ఆనందిస్తూ ఆనాటి నుంచి అగ్నిబిందు పేరులోని బిందు పదాన్ని తన పేరులోకి కలుపుకొని బిందుమాధవుడు అనే పేరుతో అక్కడే ఉంటున్నట్లు చెప్పాడు. తన పేరును ధ్యానించిన వారికి ధనలక్ష్మీ, మోక్షలక్ష్మీ వశం అవుతాయని, తాను మునిని అనుగ్రహించిన ప్రదేశం బిందుతీర్థంగా ప్రసిద్ధి చెందుతుందని అన్నాడు.

కష్టాలు ఇలా తప్పుతాయి..

కార్తిక మాసంలో ఆ బిందుతీర్థంలో సూర్యోదయానికి ముందు స్నానం చేసేవారికి యముడి బాధ ఉండదు. కార్తికమాసంలో బిందుతీర్థంలో ఏకాంతర వ్రతం, త్రిరాత్ర వ్రతం, పంచరాత్ర వ్రతం, సప్తరాత్ర వ్రతం, పక్షవ్రతం, మాసవ్రతం అనే ఈ వ్రతాలలో శక్తిననుసరించి దేనినైనా చేయవచ్చు. కార్తికంలో బిందుమాధవుడి సమీపంలో నేతివత్తితో కూడిన దీపదానం చేస్తే దుర్గతి పాలవ్వటం జరగనే జరగదు. కార్తికంలోని రాత్రులలో బిందుమాధవుడి సమీపంలో అనేకానేక దీపాలను వెలిగిస్తూ దీపకౌముదిని చేసినవారు తామిస్ర, అంధతామిస్ర నరకాలను పొందనే పొందరు. బిందుమాధవుడి ముందు ఒక్క దీపాన్ని వెలిగించినా ముల్లోకాలను జ్యోతిర్మయం చేసినంత పుణ్యం లభిస్తుంది. కార్తికంలో బిందుమాధవుడిని పంచామృతాలతో అభిషేకించేవారు పాలసముద్రపు ఒడ్డున ఒక కల్పకాలం వరకు నివసించే అదృష్టాన్ని పొందుతారు. వీలున్నవారు కార్తికమంతా ప్రతిరాత్రి ఆ స్వామి ముందు దీపాన్ని వెలిగిస్తే పునర్జన్మ పొందాల్సిన అవసరం ఉండదు. నెయ్యితో తడిపిన వత్తితో బిందుమాధవుడి ముందు దీపం వెలిగించిన వారికి మరణసమయంలో కూడా బుద్ధిభ్రంశం కాదు.

నిస్వార్థపరులైన మునులే ఆదర్శం

మాధవుడు కృతయగంలో ఆదిమాధవుడు అని, త్రేతాయగంలో అనంతమాధవుడు అని, ద్వాపరంలో శ్రీ మాధవుడు అని, కలియుగంలో బిందుమాధవుడు అని ఆవిర్భవిస్తూ ఉండేది భక్తులను పాపాల నుంచి తొలగించి ముక్తులను చేయటానికే. బిందుమాధవుడి కృపతో సంపదరూపమైన లక్ష్మిని, మోక్షలక్ష్మిని కూడా సులభంగా పొందవచ్చని ఈ కథా సందర్భం ఇలా వివరిస్తోంది. ప్రత్యేకించి ఈ స్వామిని కార్తిక మాసంలో పూజించడం మరీమరీ శ్రేయోదాయకం. అగ్నిబిందు మునిలాంటి నిస్వార్థపరులైన మునులు తాము తపస్సుగాని, దైవారాధనగాని తమకోసం కాక సకల మానవాళికి ఉపయోగపడేలా దైవాన్ని కోరుతూ ఉండేవారు. కనుకనే అలాంటి మహనీయ మునుల పేర్లను తమ పేరు ముందు తగిలించుకొని దైవం కూడా ఆనందంగా భక్తులను అనుగ్రహిస్తుంటాడు. దీన్ని గమనిస్తే భగవద్భక్తులంతా అగ్నిబిందు మునిలాగానే నిస్వార్థపరులుగా ఉండాలన్న సూచన ఇక్కడ స్ఫురిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని