మరణంలో మన వెంట వచ్చేవి.. రానివి ఏవి?

చిన్నతనంలో బామ్మలు, తాతయ్యలు ‘అనగనగా...’ అంటూ కథలు చెప్పడం మొదలుపెట్టేవారు. ఈ అనగనగా... వెనక ఓ కథ ఉంది. పురాణ కథలను

Updated : 14 Mar 2023 16:07 IST

చిన్నతనంలో బామ్మలు, తాతయ్యలు ‘అనగనగా...’ అంటూ కథలు చెప్పడం మొదలుపెట్టేవారు. ఈ అనగనగా... వెనక ఓ కథ ఉంది. పురాణ కథలను మొదట వ్యాసుడు అనగా, సూతుడు విన్నాడు. తిరిగి సూతుడు అనగా, శౌనకాది మహర్షులు విన్నారు. ఇలా ఒకరి తరవాత ఒకరు అనగా అనగా భారత భాగవతాదులు మనదాకా వచ్చాయి. కాబట్టి మన కథలన్నీ అనగనగా... అంటూ మొదలవుతాయి. వినడం చిన్నతనంలోనే అయినా, అవి బాగా అర్థమయ్యేది మనం పెద్దయ్యాకనే!

అనగనగా ఒక రాజ్యం. ఆ రాజుకు చక్కని పరిపాలకుడిగా పేరు. సిరిసంపదలతో తులతూగుతూ దేశం సుభిక్షంగా ఉండేది. రాజుకు ముగ్గురు భార్యలు. ముసలితనంలో మరో భార్యను పెళ్లాడాడు. నలుగురితో సుఖంగా, జీవితమంతా సందడిగా గడిచింది. చనిపోయేనాటికి ఒంటరిగా పోవడమెలా అన్న బెంగ పుట్టింది. భార్యలను తోడుగా తీసుకెళ్ళాలన్న ఆలోచన కలిగింది.

తాను ఎంతో ప్రాణంగా చూసుకున్న పెద్దభార్యను పిలిచాడు. ‘నాతోపాటు వస్తావా?’ అని అడిగాడు. ‘రాను’ అని స్పష్టం చేసిందామె. ‘ఇంతకాలం నువ్వు నన్ను బాగా చూసుకున్నమాట నిజమే అయినా, ఈ విషయంలో మాత్రం నీ కోరిక తీర్చలేను’ అని కుండ బద్దలుకొట్టినట్లు చెప్పిందావిడ.

రాజు రెండో భార్యను పిలిచాడు. ‘ఇన్నాళ్లూ నిన్ను ఎంతో ప్రేమగా చూసుకొన్నాను. నాతో రావచ్చుగా’ అని అడిగి చూశాడు. ఆవిడా కాదనేసింది. ‘నీ సుఖం కోసం, నీ స్వార్థం కోసం నన్ను బాగా చూసుకున్నావంతే. నిజం చెప్పాలంటే నన్ను ఉపయోగించుకొన్నావు... నీతో ఎందుకు వస్తాను?’ అంది.

మూడో భార్యను ఇంతకాలం పెద్దగా పట్టించుకోలేదు గాని అడిగి చూద్దామని ఆమెను మొహమాటపడుతూనే అడిగాడు. విచిత్రంగా ఆవిడ ఒప్పుకోవడమే కాదు, ‘నువ్వు వద్దన్నా నీతో వస్తాను’ అంటూ రాజుగారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

రాజుకు ఆ సమాధానం విన్నాక నాలుగో భార్య అభిప్రాయం తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. చేసుకోవడమే ఆమెను తన వయసైపోయాక చేసుకొన్నాడు. ఆమెను బాగా చూసుకొనే అవకాశమూ పెద్దగా లేకపోయిందాయనకు. కాబట్టి ఆమె ఎదుట అపరాధ భావంతోనే నిలబడ్డాడు. మౌనంగా ఉండిపోయాడే తప్ప అడగలేకపోయాడు. అయితే ఆమె ఈ రాజు మనోభావాన్ని గుర్తించి ప్రేమగా ఆలింగనం చేసుకొంది. ‘నన్ను నీవు అడిగే పని లేదు. నీ వెంట తప్పక వస్తాను. నీ చేతిని ఎన్నడూ విడిచిపెట్టను’ అంటూ ఎంతో ధైర్యం చెప్పింది. రాజు తల దించుకున్నాడు. చిన్నప్పుడు విన్న ఈ కథను మనం పెద్దయ్యాక జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి.

ఈ కథలో మొదటి భార్య పేరు ‘శరీరం’. అది మనిషి జీవించి ఉన్నంతకాలం ఎంతో సేవ చేస్తుంది. మరణంలో మాత్రం తోడు రాను పొమ్మంటుంది. మనిషిని విడిచిపెట్టి మట్టిలో కలిసిపోతుంది. రెండో భార్య ‘సంపద’. మనిషి అవసరాలకోసం సంపదను వాడుకొంటాడు. చనిపోయాక పూచికపుల్ల సైతం మనిషితోపాటు రాదు. ‘నీ స్వార్థం కోసం నన్ను వాడుకొన్నా’వని సంపద నిందించింది అందుకే.

మూడో ఆమె ‘కర్మ’. వద్దన్నా మనిషిని వెంబడిస్తుంది. జన్మజన్మలకు వెంటాడుతుంది. ఒప్పుకోకపోయినా వస్తానని అందుకే చెప్పింది. నాలుగో భార్యపేరు ‘భగవంతుడు’. వయసు పైబడే దాకా ఆయనతో పరిచయమే చేసుకోడు మనిషి. నిజానికి అవసరమైంది ఈమెతో కలిసి ఉండటమే. అది గుర్తుకొచ్చే రాజు తల దించుకుని నిలబడ్డాడు. అయినా రాజుకు తిరుగులేని అభయం ఇచ్చిందామె. చేతిని వదలనని ధైర్యం చెప్పింది. కనీసం చివరిలోనైనా తన గురించి ఆలోచించాడని దయ చూపిందామె. అదే భగవంతుడి స్వభావం. మనం తేల్చుకోవలసింది ఒక్కటే! ఈ అనగనగా...కథలో రాజుగారెవరు అని.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని