ఏ వారానికి ఎవరు అధిపతి?

కాలం అనే ద్వారానికి కట్టిన హారాలే వారాలు. హారంలోని పూలను, పూసలను లెక్కించిన విధంగా కాలద్వార

Updated : 14 Mar 2023 16:05 IST

కాలం అనే ద్వారానికి కట్టిన హారాలే వారాలు. హారంలోని పూలను, పూసలను లెక్కించిన విధంగా కాలద్వార హారంలో పూవుల్లా, పూసల్లా లెక్కించడానికి అనువైన ఏడువారాలకు కాలగణనలో ప్రత్యేకత ఉంది.

ఆదివారం ఆటవిడుపు వారంగా ప్రసిద్ధం. రోజులను లెక్కించే సమయంలో మొదటిస్థానంలో ఉండే ఈ వారానికి సూర్యుడు అధిపతి. ‘ఆది’ అంటే మొదటిది అని అర్థం కదా. ఉషస్సులో లోకానికి తొలుత కనిపించేవాడు సూర్యుడే. అందుకే అతడు వారాధిపతి. సూర్యుడు లేకుంటే ఈ లోకం అంధకార బంధురమైపోతుంది. వాల్మీకి రామాయణంలోని ‘ఆదిత్య హృదయ’ స్తోత్రాన్ని పరిశీలిస్తే సూర్యుడు ఆరోగ్య ప్రదాతగా, విజయప్రదాతగా దర్శనమిస్తాడు.

సోమవారానికి అధిపతి చంద్రుడు. సోముడంటే అమృతాన్ని పుట్టించేవాడు. వెన్నెల అమృతమే కదా. చంద్రుడి వెన్నెల ఎన్నో ప్రాణప్రదాలైన ఓషధులను బతికిస్తోంది. నవగ్రహాల్లో చంద్రుడికి స్థానాన్ని కల్పించింది జ్యోతిశ్శాస్త్రం. సూర్యకాంతిని అద్దంలా ప్రతిఫలించే చంద్రుడు అమృత కిరణాలను భూమికి అందిస్తున్నాడు. అందుకే భూలోకానికి సూర్యుడి తరవాత చంద్రుడే ప్రాణదాత. చంద్రుడు మనసును వికసింపజేస్తాడనే విషయం అందరికీ అనుభవమే.

మంగళవారానికి అధిపతి కుజుడు. ఇతణ్ని అంగారకుడు అనీ పిలుస్తారు. ‘కుజ’ శబ్దానికి భూమి నుంచి పుట్టినవాడు అనే అర్థం ఉంది. ఎర్రగా ఉన్న కారణంగా కుజగ్రహాన్ని అరుణగ్రహం అనీ పిలుస్తారు. అంగారం అంటే నిప్పు. నిప్పులా ఎర్రగా ఉంటాడు కనుక అంగారకుడు. మంగళం అంటే శుభమే కదా? ఈ గ్రహాన్ని ఆరాధిస్తే శుభం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. అంగారకుడు భూమి పుత్రుడు అనే విశ్వాసం అనాదిగా ఉంది.

బుధవారానికి అధిపతి బుధుడు. చంద్రుడి పుత్రుడిగా పురాణ ప్రసిద్ధి. బుధుడు అంటే తెలిసినవాడు, జ్ఞాని అని అర్థం. బుధుడు అంటే పండితుడు అనే అర్థం లోకంలో వ్యాప్తిలో ఉంది. బుధుడు ఏ గ్రహంతో సన్నిహితంగా ఉంటాడో, ఆ గ్రహానికి సంబంధించిన గుణాలే బుధుణ్ని అంటుకుంటాయని జ్యోతిషం చెబుతోంది. అంటే స్వయంగా అతడు ప్రవర్తించడు అనే విశ్వాసం ఉంది.

గురువారానికి అధిపతి బృహస్పతి. దేవతలకు గురువు అయిన కారణంగా బృహస్పతికి గురువు అనేది ప్రసిద్ధనామం. బుద్ధికుశలతకు మారుపేరైన బృహస్పతి అనుగ్రహం ఉంటే సకల విద్యలూ అలవడతాయని జనుల విశ్వాసం. సౌర మండలంలో అతిపెద్ద గ్రహం కావడం వల్ల కూడా గురువు (పెద్దవాడు, బరువైనవాడు) అనే పేరు సార్థకమై ఉండవచ్చు.

శుక్రవారానికి అధిపతి శుక్రాచార్యుడు. ఇతడు రాక్షసులకు గురువు. నీతివేత్తల్లో అగ్రగణ్యుడు. మృత సంజీవని (మరణించినవారిని బతికించే విద్య) తెలిసినవాడు.  ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగేవాడు ఇతడు. వేగు చుక్కగా అందరూ ఇతణ్ని కొలుస్తారు.

శనివారానికి అధిపతి శనైశ్చరుడు. ఇతడి గమనం మందంగా (మెల్లగా) ఉంటుంది కనుక మందుడు అనే పేరుంది. ఇతడు ఛాయాసూర్యుల పుత్రుడు. నల్లనివాడు. యమధర్మరాజు, యమున ఇతడి సోదరసోదరీమణులు. ప్రాణుల పుణ్యపాపాలకు ఫలాలను వెంటనే ప్రసాదించేవాడిగా శనైశ్చరుడికి పేరుంది. ఇతణ్ని ఆరాధిస్తే చెడు తొలగిపోతుందని, మంచి జరుగుతుందని జనవిశ్వాసం.

ఇలా ఏడువారాల నగల్లా ఏడుగురు వారాధిపతులు మనుషుల జీవితాల్లో నిత్యం దర్శనమిస్తుంటారు. వారం అంటే రోజు. వారం అంటే ఏడు రోజుల సముదాయం. కాలగణనలో ఒకటైనా, ఏడైనా బేధం లేదు. వారాధిపతులను తలచుకొని పూజించడం, వారి అనుగ్రహాన్ని కోరడం మానవ జీవనంలో శ్రేయఃకాంక్షకు నిదర్శనం. ఏ వారమైతేనేమి? అది శుభప్రదం కావాలని, క్షేమాన్ని కలిగించాలని మనిషి కోరుకుంటాడు. కాలగణనలో ముఖ్యపాత్ర వహించే వారాధిపతుల స్మరణ మానవాళి సుఖశాంతులకు దోహదం చేస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని