దేవుని చమత్కారం

కాశీరాం అనే బట్టల వ్యాపారి అడవి మార్గంలో వెళ్తుండగా దొంగలు దోచుకోవడమే గాక గాయపరిచారు. అపస్మారక స్థితిలో ఉన్న అతణ్ణి గ్రామస్థులు గుర్తించి ఇంటికి చేర్చారు. నిస్సహాయ స్థితిలో ఉన్న తమ్ముణ్ణి

Updated : 27 May 2022 17:13 IST

కాశీరాం అనే బట్టల వ్యాపారి అడవి మార్గంలో వెళ్తుండగా దొంగలు దోచుకోవడమే గాక గాయపరిచారు. అపస్మారక స్థితిలో ఉన్న అతణ్ణి గ్రామస్థులు గుర్తించి ఇంటికి చేర్చారు. నిస్సహాయ స్థితిలో ఉన్న తమ్ముణ్ణి చూసి కాశీ సోదరుడు ఏడుస్తోంటే ఖండోబా ఆలయ పూజారి ఓదార్చాడు. వైద్యుడు, గ్రామపెద్ద అయిన కులకర్ణిని పిలుచుకుని వస్తానని వెళ్లాడు. కానీ కర్ణి తాను రాననడంతో పూజారి సాయిని వైద్యం చేయమని అడిగాడు. సాయి వైద్యం చేసేందుకు కాశీ అన్న మొదట ఒప్పుకోలేదు. కానీ పరిస్థితి విషమించడంతో సరేనన్నాడు. సాయి ఆకు పసర్లతో వైద్యం ముగిస్తుండగా కర్ణి వచ్చి సాయికి వైద్యం తెలియదని, అతడిచ్చిన పసర్లు వల్ల కాశీ కొద్దిసేపట్లోనే చనిపోతాడని చెప్పి, బతికే ఉన్న కాశీ దేహాన్ని శ్మశానానికి తరలించే ఏర్పాట్లు చేశాడు.

అది చూస్తున్న సాయి ‘మనిషికి శ్రద్ధ, ఓర్పు అవసరం. నమ్మకంతో ప్రయత్నించేవారికి తప్పకుండా విజయం లభిస్తుంది. ఏళ్ల తరబడి అనుభవం ఉన్న వైద్యులు సైతం రోగిని కాపాడలేని ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అనుభవం ఉంది కదాని అహంతో చేసే వైద్యం, అలాగే భయపడుతూ చేసే వైద్యం రెండూ ప్రమాదమే. మన అనుభవంలోకి రాని విషయాలు అనేకం ఉంటాయని విస్మరించకూడదు. దైవం చేసే అద్భుతాలు అందులో ఒకటి. ఆ చమత్కారాలు అంత త్వరగా అర్థం కావు. పరమాత్మ లీలలు అర్థం చేసుకోకపోతే మనం ఈ లోకంలో ఉండలేం. అంటే ప్రాణమున్నా లేనివారి కిందే లెక్క. వైద్యశాస్త్రం చదివిన అనుభవంతో చెప్పిన అభిప్రాయం మీది. కానీ నేను దేవునిపై నాకున్న విశ్వాసంతో ప్రయత్నించాను. కాశీ ఇంకొన్నాళ్లు బతుకుతాడు’ అని సాయి చెబుతుండగానే కాశీ కళ్లు తెరిచాడు. సాయి కర్ణి వైపు చూసి ‘దేవుని చమత్కారమంటే ఇదే’ అని నవ్వేశాడు.

- ఉమాబాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని