రుషి - వేపాకు

శ్రీముఖుడి పాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు కానీ అతడు మాత్రం మనోవేదన అనుభవిస్తున్నాడు. కొడుకు మాట వినడు. చదువుపై ఆసక్తి లేదు.

Updated : 14 Mar 2023 15:21 IST

శ్రీముఖుడి పాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు కానీ అతడు మాత్రం మనోవేదన అనుభవిస్తున్నాడు. కొడుకు మాట వినడు. చదువుపై ఆసక్తి లేదు. సేవకుల పట్ల అమర్యాద. మంత్రి సలహాతో కొడుకును ఒక రుషి వద్దకు తీసుకెళ్లాడు. అంతా విని అతణ్ణి కొన్నాళ్లు తన వద్ద విడిచి వెళ్లమన్నాడు రుషి. రాజు అలాగే చేశాడు. మర్నాడు రుషి చిన్న వేపమొలకను చూపి ఒక ఆకు తినమన్నాడు. రాకుమారుడు ఆకును తెంపి నోట్లో వేసుకున్నాడు. వెంటనే ఊసేసి ‘ఇంత చేదైన ఆకును ఎందుకు తినమన్నారు?’ అనడిగాడు. మళ్లీ అతడే ‘లేతమొక్కగా ఉన్నప్పుడే ఇంత చేదుగా ఉందంటే వృక్షమయ్యాక ఇంకెంత చేదుగా ఉంటుందో!’ అని వేపమొక్కను పీకిపడేశాడు. రుషి శాంతంగా చూసి ‘కుమారా! సిరిచేదు ఉన్న ఆకునే నమల లేకపోయావే! అలాంటిది మన చెడు గుణాలు ఇంకెంత దుర్భరంగా, గరళం కంటే వికారంగా ఉంటాయో ఒకసారి ఆలోచించు. ఈ మొక్కను పెరికేసినట్లుగా నీలో ఉన్న దుర్గుణాలను చెరిపేశావంటే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి’ అన్నాడు రుషి. కళ్లు తెరుచుకున్న రాకుమారుడు హృదయపూర్వకంగా నమస్కరించాడు.

- గోవిందం ఉమామహేశ్వర రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని