మార్గగామికి ప్రణామం

మనకు మార్గనిర్దేశం చేసేదీ మహానుభావులుగా తీర్చిదిద్దేదీ గురువర్యులే. ఉలి లాంటి పలుకులతో శిలలను శిల్పాలుగా చెక్కే అధ్యాపకులే లేకుంటే బండరాళ్లలా మిగిలిపోమా?

Updated : 14 Mar 2023 14:16 IST

నవంబర్‌ 3 యాజ్ఞవల్క్య జయంతి

మనకు మార్గనిర్దేశం చేసేదీ మహానుభావులుగా తీర్చిదిద్దేదీ గురువర్యులే. ఉలి లాంటి పలుకులతో శిలలను శిల్పాలుగా చెక్కే అధ్యాపకులే లేకుంటే బండరాళ్లలా మిగిలిపోమా? జ్ఞానబోధకులే లేకుంటే అంధకారంలో అలమటించమా! యాజ్ఞవల్క్యుడు అహంకారాన్ని వదిలి అరిషడ్వర్గాలను జయించాడంటే వైశంపాయనుడే కదా కారణం.

మస్త జీవజాలంలో నరుడొకడు. ఆహార నిద్రాదులు అన్ని జాతులకూ సమానమే కానీ జ్ఞానసముపార్జనకు మనిషే అనువైన ప్రాణిగా అనుగ్రహం పొందాడు. ఆ లక్ష్యాన్ని చేరనప్పుడు పశువుతో సమానమనేది భావం. నరజాతిని అనుగ్రహించేందుకు వాగ్దేవిని కొలువుదీర్చాడు బ్రహ్మ. ఆ సరస్వతే గురుమూర్తి రూపంలో మనందరికీ చేరువై విద్యాధనాన్ని వెదజల్లుతోంది.
నడవడి, పరిపక్వత, శీలసంపద, విద్వత్తు, శిష్యులను మంత్ర ముగ్ధులను చేయగలిగే బోధనాపటిమలతో ఉత్తమ స్థితిని అందుకున్నవారే గురువు. ఆ స్థితిని చేరుకునేందుకు తనదైన వ్యక్తిత్వంతో ఒక మార్గాన్ని అనుసరిస్తాడు, అనుసరింప చేస్తాడు. అనుచరుల జీవనవిధానం, నైతిక ప్రవర్తన, ధర్మాధర్మ విచక్షణలకు మార్గదర్శకుడవుతాడు. అటువంటి ఆచార్యుల సమక్షంలో ఉంటూ, విద్యాభ్యాసం చేయటమే గురుకులవాసం. గురుకులంలో ఉన్నంత వరకు శిష్యుని ప్రవర్తనకు, నియమ జీవనానికి బాధ్యత గురువుదే. విద్యాభ్యాసం ఒక వ్రత దీక్ష. విద్యార్థికి జ్ఞాన సంపాదనతో పాటు నైతికత కూడా అవసరమే. పరస్పర ఆదరణ, అవగాహనలపై ఆధారపడి గురుశిష్యుల మధ్య నెలకొనే సంబంధం మాతాపితరుల అనుబంధానికి ఏ మాత్రం తీసిపోదు. సదావిద్యార్థ్ధి అభివృద్ధిని కోరేవాడు గురువు కాగా ఎప్పుడూ గురువు శ్రేయస్సును కాంక్షించేవాడు శిష్యుడు.

శిష్యుడి ఘనకీర్తి
రుషి పరంపరలో ఒకరైన యాజ్ఞవల్క్యుని చరితం ప్రాతఃస్మరణీయం. యాజ్ఞవల్క్యుడు బాష్కలుడు, జైమిని, ఆరుణి మహర్షుల వద్ద రుగ్వేదం, సామవేదం, అధర్వణవేదం అభ్యసించాడు. తర్వాత తండ్రి ఆనతితో మేనమామ వైశంపాయనుని వద్ద యజుర్వేదం చదివాడు. నాలుగు వేదాలూ త్వరితగతిన నేర్చుకున్నానన్న అహంకారం యాజ్ఞవల్క్యునిలో గమనించాడు వైశంపాయనుడు. దాన్ని తొలగించాలని ఎంత ప్రయత్నించినా తగ్గకపోగా హెచ్చింది. తట్టుకోలేని గురువు శిష్యుణ్ణి ఘోరంగా అవమానించి బ్రహ్మహత్యాపాతకాన్ని పొందాడు. దాంతో ఆవేదనచెంది ఆ పాపాన్ని పోగొట్టుకునేందుకు చూస్తుండగా, యుక్తవయస్కుడైన యాజ్ఞవల్క్యుడు తాను మాత్రమే దాన్ని పోగొట్టగలనన్నాడు. ఆ దురుసుతనానికి ఆగ్రహించిన గురువు తాను నేర్పిన విద్యను తక్షణం అక్కడ విడిచిపెట్టి వెళ్లమన్నాడు. ఆయన ఆదేశానుసారం యాజ్ఞవల్క్యుడు రక్తరూపంలో కక్కిన యజుర్వేదాన్ని అక్కడున్న రుషులు తిత్తిరీ పక్షుల రూపంలో మింగి తైత్తిరీయోపనిషత్తుగా లోకానికి అందజేశారు. అదే కృష్ణ యజుర్వేదం. ఆ తర్వాత యాజ్ఞవల్క్యుడు సూర్యదేవుని ఆశీస్సులతో శుక్ల యజుర్వేదాన్ని అభ్యసించాడు. తీవ్ర తపస్సుచేసి అరిషడ్వర్గాలను జయించిన అతనికి చేసిన తప్పు బోధపడింది. పశ్చాత్తాపచిత్తుడై తన పుణ్యఫలాన్ని ధారపోసి గురువును పాతకం నుంచి తప్పించాడు. శిష్యులను సరైన తోవలో నడిపేందుకు ప్రయత్నించిన గురువుగా, తన కోసం తపించిన గురువు శ్రేయస్సును ఆకాంక్షించిన శిష్యుడిగా ఘనకీర్తి పొందిన వాళ్లిద్దరూ గురుశిష్య సత్సంబంధానికి దిశానిర్దేశం చేశారు.

మహా గురువులు
‘గురువు శిక్ష లేక గురుతెట్లు గల్గునో /అజునికైన వాని అబ్బకైన /తాళపుచెవి లేక తలుపెట్టులూడురా’ అన్నాడు యోగి వేమన. పుస్తకపఠనంతో కంటే గురుముఖతః నేర్చుకుంటేనే సాఫల్యం. పూర్వం అవక్రీతుడనే రుషి గురువు లేకుండా విద్య సాధించాలని ప్రయత్నించాడు. అది సాధ్యపడదని ఇంద్రుడెంత చెప్పినా అవక్రీతుడు తన ప్రయత్నం మానలేదు. అప్పుడు ఇంద్రుడు దోసిట్లో ఇసుకను తెచ్చి సముద్రంలో పడేస్తూ వంతెన నిర్మించగలనన్నాడు. అది చూసి నవ్విన అవక్రీతుడితో ‘నీ ప్రయత్నమూ అలాంటిదే’ అన్నాడు ఇంద్రుడు. నారదుడు సనత్కుమారుని ఆశ్రయించిందీ, ఆత్మోద్దీపనం కలిగించే గురుదీక్షా లభ్యతకే. ఆత్మసిద్ధి కోసం తహతహలాడే జనకమహారాజు చిత్తాన్ని దోచి ఆత్మసాక్షాత్కార సిద్ధి కలుగజేశాడు అతడి గురువు అష్టావక్రుడు. అల్లరి కృష్ణయ్యను యుక్తాయుక్త విచక్షణా చతురుడిగా తీర్చిదిద్ది జగద్గురువుగా అందించిన ఘనత సాందీపనీ మహర్షిది. తన ఇంటి తలుపు తట్టిన రాముని తలపులో నీవెవరు అన్న ప్రశ్న చొప్పించి రామరాజ్య స్థాపనకు పునాదులు వేసింది వశిష్ట మహర్షి. ద్రుపదుణ్ణి పట్టితేవటమే తనకు గురుదక్షిణ అని పలికిన ద్రోణాచార్యుల మాట పొల్లు పోనీయలేదు అర్జునుడు.

‘శిష్యాదిచ్చేత్‌ పరాజయం’ అంటూ తనను మించిన శిష్యుణ్ణి చూసి గురువు పొందే ఆనందం వర్ణనాతీతం. మనుస్మృతి ప్రకారం ఏ విద్య నేర్పినా గురువే. గురువు కాల లింగ వయో భేదాలకు అతీతుడు. జ్ఞానవృద్ధుల కన్నా వయోవృద్ధులెప్పుడూ చిన్నవారే.
పాంచభౌతిక శరీరాన్ని అందించిన మన తల్లిదండ్రుల చెంతనే, మనల్ని సమాజానికి ఉపయోగపడే మనుషులుగా తీర్చిదిద్దే గురుస్థానాన్ని పదిల పరచారు పెద్దలు. గురువు పట్ల భక్తి ఎంత శ్రేష్టమైందో చులకనభావం లేదా అగౌరవం అంత పాపపంకిలమన్నారు.

సనందనుని గురుభక్తిని లోకానికి చాటి పద్మపాదులను అందించిన ఆదిశంకరులు, తన ప్రసంగస్ఫూర్తితో మనదేశ ఘనతను విశ్వవ్యాప్తి చెందించిన నరేంద్రుని అందించిన రామకృష్ణులు, సకల కళలకు నిలయమైన శాంతినికేతనాన్ని జగతికందించిన రవీంద్రులు, శిష్యుల మనోమందిరాల్లో నెలవైన సర్వేపల్లి- ఇలా ఎందరో మహనీయులు ఆచార్య ధర్మాలకు కాలానుగుణంగా సొబగులద్దారు. వాటిని పరిరక్షించే బాధ్యత మనందరిపైనా ఉంది, ఉండాలి, ఉంటుంది.

- పార్నంది అపర్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని