సిసలైన ప్రేమ

స్వామి వివేకానంద ప్రసంగాల స్ఫూర్తితో ఇంగ్లండ్‌ నుంచి భారతదేశానికి వచ్చిన కర్మయోగి మార్గరెట్‌ నోబెల్‌. ఆమె స్వామీజీ శిష్యురాలై సోదరి నివేదితగా మారి కోల్‌కతాలో బాలికల విద్యాలయం నిర్వహించారు.

Updated : 14 Mar 2023 13:22 IST

స్వామి వివేకానంద ప్రసంగాల స్ఫూర్తితో ఇంగ్లండ్‌ నుంచి భారతదేశానికి వచ్చిన కర్మయోగి మార్గరెట్‌ నోబెల్‌. ఆమె స్వామీజీ శిష్యురాలై సోదరి నివేదితగా మారి కోల్‌కతాలో బాలికల విద్యాలయం నిర్వహించారు. అరవింద యోగి, రవీంద్రనాథ్‌ టాగోర్‌ వంటి ప్రముఖులెందరో ఆమెను ‘లోకమాత నివేదిత’ అని పిలిచేవారు. ఒకరోజు ప్రముఖ శాస్త్రవేత్త జగదీశ్‌ చంద్రబోస్‌ నివేదితను భోజనానికి ఆహ్వానించారు. వారి కోరిక మేరకు ఆమె వారింటికి వెళ్లారు. కొద్దిసేపు మాటామంతి అయ్యాక, ఇంటివారు నివేదితను భోజనానికి పిలిచారు. ఇంతలో ఆమె హఠాత్తుగా కుర్చీలోంచి లేచారు. ఆ క్షణంలో ఆమెకు ప్రఫుల్లమాయి అనే యువతి కళ్లముందు మెదిలింది. ఆమె చిన్నవయసులోనే భర్తను కోల్పోయి, నివేదిత ప్రారంభించిన పాఠశాలలో చదువుకుంటోంది. ఆ రోజు ఏకాదశి. ఆ యువతి ఉపవాసం ఉంటుంది, రోజంతా ఏమీ తినదు, రాత్రయ్యాక కేవలం పండ్లు తీసుకుంటుంది- అని నివేదితకు గుర్తొచ్చింది. అందువల్ల తను ప్రుఫుల్లకు ఫలాలు తీసుకువెళ్లాలన్న సంగతి జ్ఞాపకం రాగానే.. ‘మన్నించండి! నేను ఇప్పుడు పండ్లు తీసుకువెళ్లకపోతే ఆమె ఆకలితో గడపాల్సి ఉంటుంది. దయచేసి నన్ను వెళ్లనివ్వండి’ అంటూ నివేదిత హడావుడిగా బయల్దేరింది. దేశం కాని దేశంలో తనకు సంబంధించని జనావళిపై సోదరి నివేదిత చూపుతున్న శ్రద్ధ, ప్రేమ జగదీశ్‌ చంద్రబోస్‌ కుటుంబసభ్యులను కదిలించింది. ‘స్వామి వివేకానంద అసలు సిసలైన శిష్యురాలీమె’ అంటూ అభినందించారు.  

చక్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు