సేవకుడికి మొక్కిన యజమాని

బంకమట్టితో దేవుళ్ల బొమ్మలు చేసి, పూలూపండ్లూ ప్రసాదంగా సమర్పిస్తూ ఆటలాడిన బాలుడు పెద్దయ్యాక భూస్వామికి సేవకుడయ్యాడు. అతడు నిత్యం శివుణ్ణి స్మరిస్తుంటాడు.

Updated : 14 Mar 2023 13:21 IST

బంకమట్టితో దేవుళ్ల బొమ్మలు చేసి, పూలూపండ్లూ ప్రసాదంగా సమర్పిస్తూ ఆటలాడిన బాలుడు పెద్దయ్యాక భూస్వామికి సేవకుడయ్యాడు. అతడు నిత్యం శివుణ్ణి స్మరిస్తుంటాడు. చిదంబరం వెళ్తే ముక్తి కలుగుతుందని విని, అక్కడికి వెళ్లాలనుకున్నాడతడు. నటరాజస్వామిని దర్శించడానికి ‘రేపే వెళ్లాలి, రేపే వెళ్లాలి’ అని పలవరించే వాడు. అది విని ‘నాళై పోవార్‌’ (రేపు వెళ్లేవారు) అంటూ ఎగతాళి చేసేవారు చుట్టుపక్కలవారు.

చిదంబరం వెళ్లడానికి అనుమతిమ్మని యజమానిని ఎంత బతిమాలినా అవహేళన చేశాడే గానీ అనుమతి ఇవ్వలేదు. నిరంతరం శివనామస్మరణతో పిచ్చివాడిలా తయారవడంతో అతణ్ణి ఎలాగైనా చిదంబరం పంపమని యజమానితో చెప్పారు కొందరు. ‘పంట సిద్ధంగా ఉంది, కోతల పని కాగానే పంపుతాను’ అని తప్పించుకున్నాడు. అది విన్న సేవకుడు ఆనందంగా పొలానికి పరిగెత్తాడు. ఎంత వేగంగా వెళ్లాడో అంతే వేగంగా తిరిగొచ్చి పనంతా పూర్తయ్యిందని చెప్పాడు. ఆశ్చర్యపోయిన యజమాని. ‘నిజంగానే పిచ్చెక్కినట్టుంది. వందలాది ఎకరాల్లో పని క్షణాల్లో ఎలా అవుతుంది?’ అనుకుంటూ పొలానికి వెళ్తే నిజంగానే ధాన్యం కుప్పలున్నాయి. ఇదెలా సాధ్యమైంది? ఇదంతా ఒక్కడే చేయడం అసాధ్యం. శివుడి మహిమతో సాధ్యమైందన్నమాట- అనుకున్నాడు. తను సేవకుడితో ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడ్డాడు. పశ్చాత్తాపంతో నిగర్వంగా కాళ్లమీద పడి క్షమించమని అడిగాడు.

ఆ సేవకుడే ‘తిరు నాళై పోవార్‌ నాయనార్‌’ గా ప్రసిద్ధిచెందిన గొప్పభక్తుడు నందనార్‌. దేవుణ్ణి గనుక మనసారా ప్రార్థిస్తే తప్పక కరుణిస్తాడంటూ నందనార్‌ గాథను చెబుతారు.

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని