ఉన్న స్థితి నుంచి ఉన్నతికి

రామకృష్ణ మఠంలో పూజానంతరం ప్రసాదంగా పంచడానికి నేతి లడ్డూలు సిద్ధంగా ఉన్నాయి. నైవేద్యం సమర్పించాలి కనుక ఎంగిలి చేయకూడదని వివేకానంద స్వామి ఆజ్ఞ.

Updated : 14 Mar 2023 13:14 IST

రామకృష్ణ మఠంలో పూజానంతరం ప్రసాదంగా పంచడానికి నేతి లడ్డూలు సిద్ధంగా ఉన్నాయి. నైవేద్యం సమర్పించాలి కనుక ఎంగిలి చేయకూడదని వివేకానంద స్వామి ఆజ్ఞ. గదిలో చాపపై లడ్డూలను ఉంచి గదికి తాళం వేశారు. తాళం మనుషులనే తప్ప చీమలను నిరోధించ లేదుగా! కొద్దిసేపటికే గదిలోకి చీమలు రావడం చూసి కంగారుపడిన శిష్యులు ఆ సంగతి వివేకానందుడికి తెలియజేశారు. స్వామి కంగారుపడకుండా కొంత బెల్లం తెప్పించారు. లడ్డూలున్న చాప చుట్టూ ఒక కట్టలాగా బెల్లంపొడి పోయించారు. శిష్యులకు ఏమీ అర్థం కాలేదు. స్వామి చిన్నగా నవ్వి ‘పదండి ఇక సమస్య లేదు’ అన్నారు. శిష్యులు అయోమయ స్థితిలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరునాటి ఉదయం చూసేసరికి కొన్ని వందల, వేల చీమలు ఆ గదినిండా చేరి ఉన్నాయి. కానీ ఒక్క చీమ కూడా బెల్లం కట్టను దాటి లడ్డూల దగ్గరికి వెళ్లలేదు. స్వామి ఆదేశంతో లడ్డూలను పూజలో నైవేద్యంగా సమర్పించి చుట్టూ ఉన్న బెల్లంపొడిని తీసి పడేశారు. ‘లడ్డూల వాసనకు వాటిని తినాలని బయల్దేరిన చీమలు మధ్యలో కనిపించిన బెల్లం చూసి ఆగిపోయాయి. చీమలు దానితో సంతృప్తిచెందకుండా మరికొంత శ్రమించి ముందుకు సాగితే జీడిపప్పు, ఎండుద్రాక్షలతో నిండిన రుచికరమైన నేతి లడ్డూలు దొరికేవి. కానీ అలా చేయలేదు. ఆధ్యాత్మిక చింతనా అంతే! ఉన్న స్థితితో సంతృప్తి చెందక ఉన్నతంగా ఎదగాలి- అంటూ చెప్పారు స్వామి.

డా.కె.కరుణశ్రీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని