బ్రహ్మజ్ఞానం

సత్యం ఒకటే అయినా పండితులు రకరకాలుగా చెబుతారు. బ్రహ్మ సత్యం, చైతన్యమే బ్రహ్మ అని, ఆనందమే బ్రహ్మ, ఆత్మే బ్రహ్మ అని నాలుగు రకాలుగా వర్ణిస్తున్నాయి.

Updated : 14 Mar 2023 13:09 IST

త్యం ఒకటే అయినా పండితులు రకరకాలుగా చెబుతారు. బ్రహ్మ సత్యం, చైతన్యమే బ్రహ్మ అని, ఆనందమే బ్రహ్మ, ఆత్మే బ్రహ్మ అని నాలుగు రకాలుగా వర్ణిస్తున్నాయి. బ్రహ్మ అనే సంస్కృత పదానికి బృహత్‌, బృహతి, బృహంతు అర్థాలున్నాయి. సరళంగా చెప్పాలంటే గొప్పది, పెద్దది, అంతకుమించినవి లేదని, అది నామ రూప గుణాలకు అతీతం అంటారు వేదాంతులు. దాన్ని తెలుసుకుని అనుభవించి ఆనందించాలి. ఆలోచనకు అంతుపట్టని అద్భుత శక్తే బ్రహ్మ అని ఉపనిషత్తులు ఉద్ఘాటించాయి.

కారణం లేనిదే ఏదీ జరగదు. కర్మలో ఉన్న మర్మం, పదార్థాల వెనుక ఉన్న యథార్థం వెలికితేవడానికి అనాదిగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కుండకు మట్టి కారణం. గొలుసుకు బంగారం కారణం. ఈ జగత్తుకు కారణం బ్రహ్మ అని తేలింది. బ్రహ్మసంకల్పం వల్ల ఏర్పడిన ఈ జగత్తు సత్యమే. అందులోని జీవరాశి దాని చైతన్యస్వరూపాలు. ప్రాణికోటికి జీవాధారమైన బ్రహ్మచైతన్యం సత్యస్య సత్యం- అని బృహదారణ్యకం స్పష్టం చేసింది. బ్రహ్మ గురించి ఇంద్రుడు ప్రజాపతిని ప్రశ్నించాడు. ‘నీవే బ్రహ్మ’ అన్నాడు. దేవరాజుకు అర్థంకాలేదు. అహంకారం, ఇంద్రియలాలస, దేహాభిమానం ఉన్నంతకాలం అర్థం కాదు. ‘నేను శరీరాన్ని కాదు, నాకు శరీరం లేదు’ అన్న ఎరుక కలిగినప్పుడు ఆ బ్రహ్మ నీవేనని తెలుసు కుంటావు’ అని ముక్తాయింపు చేశాడు ప్రజాపతి. సచ్చిదానందమే బ్రహ్మ అని ఇంద్రుడు తెలుసుకున్నాడు.

ఉప్పు రాఘవేంద్ర రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని