అంతా ఆయనే చూసుకుంటాడు

ఓ భక్తుడు రమణ మహర్షితో ‘నేను పదేళ్ల నుంచి ఆశ్రమానికి వస్తున్నాను. తమరు సూచించిన సాధనలన్నీ చేస్తున్నాను. అయినా ఆధ్యాత్మికంగా ఏ అభివృద్ధీ నాలో కనిపించటం లేదు.. ఎందుకని?’ అంటూ వాపోయాడు.

Published : 27 Apr 2023 00:37 IST

భక్తుడు రమణ మహర్షితో ‘నేను పదేళ్ల నుంచి ఆశ్రమానికి వస్తున్నాను. తమరు సూచించిన సాధనలన్నీ చేస్తున్నాను. అయినా ఆధ్యాత్మికంగా ఏ అభివృద్ధీ నాలో కనిపించటం లేదు.. ఎందుకని?’ అంటూ వాపోయాడు. దానికి రమణులు తమ సహజ మందహాసంతో ‘కాశీకి వెళ్లటానికి ఒకరు రైల్లో మొదటి తరగతిలో ప్రయాణిస్తూ గార్డుతో ‘కాశీలో నన్ను నిద్రలేపండి’ అని చెప్పి, కిటికీలు మూసుకుని నిద్రపోయాడు. అతడు రాత్రి నిద్ర లేచి ‘అయ్యో! కాశీ దాటిపోయిందేమో? సమయం ఎంతయ్యిందో? ఏం చేయాలి?’ అని దుఃఖించాడు. అతణ్ణి వివేకి అనగలమా? గార్డుకు బాధ్యత అప్పజెప్పినప్పుడు అతడు చూసుకుంటాడు కదా! ఇక్కడ భక్తులు మొదటి తరగతి ప్రయాణీకులు. గార్డుకు పక్క బోగీలోనే ఉంటారు. భగవంతుడే గార్డు. భవబంధాలన్నింటినీ దాటించే బాధ్యతను ఆయన తీసుకోడా? అంత సందేహం అవసరమా చెప్పండి..’ అన్నారు రమణ మహర్షి.

అలాగే గాంధీజీ నేతృత్వంలో స్వాతంత్య్ర సమరం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో ఓ యువకుడు అరుణాచలం లోని రమణాశ్రమాన్ని సందర్శించు కున్నాడు. అక్కడే ఉన్న మహర్షితో ‘స్వామీ! మీరు గాంధీజీలా స్వాతంత్య్ర ఉద్యమంలో ఎందుకు పాల్గొనలేదు? కర్మ చేయటం మనిషి ధర్మం కదా! ఆయనెంత పని చేస్తున్నారో చూడండి’ అనడిగాడు అమాయకంగా. అప్పుడు మహర్షి నవ్వుతూ ‘నేను కర్మ చేయటం లేదని ఎవరు చెప్పారు? అక్కడ గాంధీజీ కర్మలోనే మునిగి ఉన్నారని చెప్పగలరా? ఇక్కడ అకర్మలో కర్మ ఉంది. అక్కడ కర్మలో అకర్మ ఉంది’ అని బదులిచ్చారు.        

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని