బుద్ధం శరణం గచ్ఛామి

బుధ అనే పాలీ పదానికి మేల్కొల్పడం, తెలుసుకోవడం, ఎరుక కలిగి ఉండటం అనే అర్థాలున్నాయి. ఆ శబ్ద వ్యుత్పత్తి నుంచి వచ్చిందే బుద్ధుడు.

Updated : 04 May 2023 06:11 IST

మే 5 బుద్ధ పూర్ణిమ

బుధ అనే పాలీ పదానికి మేల్కొల్పడం, తెలుసుకోవడం, ఎరుక కలిగి ఉండటం అనే అర్థాలున్నాయి. ఆ శబ్ద వ్యుత్పత్తి నుంచి వచ్చిందే బుద్ధుడు. అంటే మహా చైతన్యమూర్తి, విశిష్ట ఆధ్యాత్మిక వ్యక్తి. లోకుల దైనందిన కలతలూ, కల్లోలాలకు పరిష్కారం కనుగొనే వరకు విశ్రమించని మహనీయుడాయన. జీవిత సవాళ్లను ఎదుర్కోవడంలో మనకు సహాయపడే శాశ్వత సత్యాలను ఆవిష్కరించాడు. భూత, భవిష్యత్తుల      చింత మాని వర్తమానంలో జీవించమన్నదే బుద్ధుడి ప్రబోధ. ఒక చేతిలో వరదముద్ర, మరో చేతిలో భిక్షాపాత్రను ధరించడంలో అర్థం తాను  సమస్త సమస్యల నుంచి మానవాళికి విముక్తి కలిగిస్తానని చెప్పడమే.

లోకంలో ఏదీ శాశ్వతం కాదు, ప్రతిదీ వచ్చిపోయేదే అన్నది బుద్ధుడి బోధల సారం. ఈ చైతన్యంతో బంధాలూ, మమకారాలను వదిలేసి నప్పుడు సుఖం, శాంతి కలుగుతాయి. వదలకపోవడం వల్లే దుఃఖం, బాధ పీడిస్తాయి. కష్టాలే కాదు, మన ఆనందాలూ శాశ్వతం కాదు. నిజానికవి మరింత బాధకి కారణమవుతాయన్నాడు. ఎందుకంటే.. నెరవేరిన కోరికలు ఆ సుఖానుభూతి మళ్లీ మళ్లీ కావాలని ఆశలు రేపుతూ, దాహార్తిని పెంచుతాయి. దక్కిన ఆనందాలను ఎక్కడ కోల్పోతామోననే అభద్రత నిరంతరం వేధిస్తుంది. మన సంకల్పాలు చాలాసార్లు ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఉంటాయి. ఒకరిపై ఆధిపత్యం చెలాయించడం, షరతులు విధించడం, అభిప్రాయభేదాలు కల్పించి వేరుచేయడం లాంటి స్వార్థపూరిత అంశాలు వేదనాభరితాలు. అందుకే బాధకు దారితీసే భ్రమలు, కోరికలు, సంకుచిత స్వభావాలను దాటడమే ఔన్నత్యమని చెబుతుంది బౌద్ధం. ఆ సామర్థ్యాన్ని అలవరచుకున్నప్పుడు కోరికలు, భ్రమల నుంచి బయటపడతాం. అందుకోసం సులువైన సాధనా మార్గాన్ని సూచించాడు బుద్ధుడు. అందుకు ఎవరి మీదా ఆధారపడ నవసరం లేదు, శ్వాసను గమనించడం అలవాటు చేసుకుంటే చాలు. కష్టం, సుఖం.. ఏదీ శాశ్వతం కాదు, శ్వాసకు మల్లేనే వస్తూ పోతూ ఉంటాయని గుర్తించగలుగు తామని ప్రబోధించాడు. వేదనను అధిగమించే మహోత్కృష్ట విధానమిది.

స్వీయ పరిశీలన

శిఖ నుంచి నఖం దాకా ఆమూలాగ్రం శరీరంలో కలిగే సంవేదనలను గమనించడమే స్వీయ పరిశీలన. బుద్ధుడు ప్రబోధించిన అద్భుత ధ్యానమార్గమిది. నొప్పి, బాధ, గిలిగింత, పులకింత, ఏ కదలికా లేకపోవడం.. ఇలా ప్రతి సంవేదననూ ఇష్టం-అయిష్టం, మమకారం-ద్వేషం లేకుండా అభావంగా గమనిస్తూ వెళ్లడం, వాస్తవిక స్వభావాన్ని అన్వేషించడం.. దీని వల్ల ఆశ, మోహం, నిరాశ, నిస్పృహ కలగని ఒక నిశ్చల స్థితి సాధ్యమవుతుంది. జీవితంలోని ప్రతి సూక్ష్మ అంశాన్నీ అవగాహన చేసుకోవడానికి దోహదపడుతుంది. అనుక్షణం ఆత్మపరిశీలన చేసుకుని, ఆలోచన కరిగిపోయే వరకు శోధిస్తూ మూలాన్ని గుర్తించాలి. అప్పుడు ఉదయించిన చైతన్యం నుంచి అనంత కరుణ ప్రవహిస్తుంది. బుద్ధుడు ‘ప్రతిదీ అశాశ్వతం’ అనే సూత్రాన్ని నొక్కి చెప్పడంలో అర్థం తాత్కాలిక కోరికల నుంచి బయటికొచ్చి జీవిత పరమార్థాన్ని గ్రహించాలన్నదే. దీని ద్వారా ఎవరికి వారే దీపంగా ఉండాలని చెప్పినట్లయ్యింది.

తామర సందేశం

ఒకసారి నేటి బీహార్‌ రాజ్‌ఘర్‌ ప్రాంతంలోని గరుడ శిఖరం వద్ద బౌద్ధ సన్యాసులు సమావేశమయ్యారు. గౌతమబుద్ధుడు ఎంత ఆసక్తికర విషయాలను ప్రసంగిస్తాడోనని ఎదురు చూస్తున్నారు. కానీ తథాగతుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దానికి బదులుగా తెల్లటి తామర పువ్వును చేత ధరించాడు. మహాకశ్యప తప్పించి తక్కినవారంతా అయోమయానికి గురయ్యారు. అతడు మాత్రం బుద్ధుడి భావం గ్రహించి నవ్వాడు. పూలు ప్రకృతి జనన మరణ చక్రానికి సంకేతం. విత్తనం మొలకెత్తి, పెరిగి పూలూ ఫలాలను ఇస్తుంది. వాటి నుంచి కొత్త విత్తనాలొస్తాయి. ఆపై పలు మార్గాల్లో కొత్త జీవితానికి నాంది పలకడానికి మళ్లీ మట్టిలోకెళ్తాయి. దానికి సంకేతమే బుద్ధుడి చేతిలోని తెల్ల తామర. అది బురద లోంచి వస్తుంది కనుక స్వచ్ఛత పొందే క్రమంలో మలినాలుంటాయని, వాటిని అధిగమించాలనేది సూచన. ముందే స్వచ్ఛంగా ఉందంటే అదేమీ నేర్చుకోలేదు, ఆలోచన లేదు, సవాళ్లను ఎదుర్కోలేదని అర్థం. ‘సంక్షిప్తత విజ్ఞత, మౌన సంభాషణ మహోత్కృష్టం’ అన్నాడు బుద్ధుడు. బౌద్ధ ధ్యానమందిరాల్లో మహామౌనం పాటిస్తారు.

మూడు గిన్నెలు..

పూర్తిగా నిండి ఉన్నది, పగుళ్లున్నది, మురికిగా ఉన్నది- ఇలా పోలిక చెప్పే మూడు గిన్నెల సిద్ధాంతం ఉంది.. తాము పరిపూర్ణులనుకుంటే ఇక కొత్త అంశాలను స్వీకరించలేరు. ముందే నిండి ఉన్న పాత్రలో కొత్త వాటికి చోటేది? శ్రద్ధ లేనప్పుడు ఎంతటి ఉపదేశాలైనా పగిలిన గిన్నెలోంచి ద్రవంలా వెళ్లిపోతాయి. అలాగే మనసు ప్రతికూల ఆలోచనలతో కలుషితమైనప్పుడు మంచి విషయాలు కూడా వికృతంగానే తోస్తాయి. అందుకే జ్ఞానార్జనకు నిశితదృష్టి, సానుకూలత చాలా అవసరమన్నాడు బుద్ధుడు. భవిష్యత్తు గురించి బెంగటిల్లడం, గతం గురించి పశ్చాత్తాపం చెందడం వల్ల ప్రయోజనం లేదని గ్రహించి ప్రస్తుతంలో జీవించాలన్నదే మనం అనుసరించాల్సిన మార్గం.మనలో జ్ఞానతృష్ట ఉండాలే గానీ బుద్ధుడు నిరంతరం బోధిస్తూనే ఉంటాడు. ఈ పుణ్యభూమి ఆయన ప్రబోధల తాలూకూ ఆధ్యాత్మిక వ్యక్తీకరణ. గాలీ, చెట్లూ అశాశ్వతాన్ని చాటుతూనే ఉంటాయి. మనం ఇంద్రియాలను కేంద్రీకరించి అంతర్‌ దృష్టితో అవలోకిస్తే బుద్ధుణ్ణి సర్వదా, సర్వత్రా చూడగలం, అనుసరించగలం.

 డాక్టర్‌ జయదేవ్‌ చల్లా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు