బావిలో కప్పలమైతే..

ఓ కప్ప బావిలో పుట్టి, అందులోనే పెరగటంతో లోకం గురించి తెలియక అదే ప్రపంచమనుకుంది. ఒకసారి వరదలకు సముద్రకప్ప వచ్చి బావిలో పడింది.

Published : 11 May 2023 00:38 IST

ఓ కప్ప బావిలో పుట్టి, అందులోనే పెరగటంతో లోకం గురించి తెలియక అదే ప్రపంచమనుకుంది. ఒకసారి వరదలకు సముద్రకప్ప వచ్చి బావిలో పడింది. దానితో మాట కలిపి ‘సముద్రమంటే ఎలా ఉంటుంది?’ అనడిగింది బావికప్ప. ‘అబ్బో చాలా పెద్దది’ బదులిచ్చిందది. బావికప్ప కాళ్లు బారచాపి ‘ఎంతుంటుందో చెప్పరాదా?’ అంది. ‘చాలా చాలా పెద్దది!’ అందది. బావికప్పకు అసహనం పెరిగి ‘నా బావికంటే పెద్దదైతే కాదుగా’ అంది గుర్రుగా. సముద్ర కప్ప ‘మిత్రమా! సముద్రాన్ని నీ బావితో పోల్చగలమా?’ అంది. బావికప్ప ‘అసంభవం! నా బావి కంటే మరేదీ పెద్దదిగా ఉండే అవకాశం లేదు. నువ్వు అన్నీ అబద్ధాలు చెబుతున్నావు’ అంటూ సముద్ర కప్పను కోపంగా బయటకు తరిమేసింది బావికప్ప.
రామకృష్ణ పరమహంస ఈ కథను చెబుతూ ‘చాలామంది ఇలా తమ తమ మత దురభిమానాలతో బావిలో కప్పల్లానే మగ్గిపోతున్నారు. సంకుచిత నమ్మకాలతో ఆధ్యాత్మిక పురోగతిని సాధించలేకపోతున్నారు. బావి దాటి బయటకు వెళ్తేనే కప్ప సముద్రాన్ని చూస్తుంది. ఇరుకు చట్రాల్లోంచి బయటకు వస్తేనే మనకు పరమసత్యం అవగతమవుతుంది’ అని హితపు పలికారు. 

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని