ఆహ్వాన పత్రిక

జపాన్‌ క్యోటో నగరంలో టోఫుకు మందిరం మహా ప్రసిద్ధమైంది. దానికి అధిపతి జెన్‌ గురువు కీచు. అతడు తన ఆలోచనాసరళి, స్ఫూర్తి ప్రసంగాలతో ఆకట్టుకునేవాడు.

Published : 11 May 2023 00:37 IST

జపాన్‌ క్యోటో నగరంలో టోఫుకు మందిరం మహా ప్రసిద్ధమైంది. దానికి అధిపతి జెన్‌ గురువు కీచు. అతడు తన ఆలోచనాసరళి, స్ఫూర్తి ప్రసంగాలతో ఆకట్టుకునేవాడు. చిన్నా పెద్దా అందరూ ఎంతగానో కీర్తించేవారు.
ఒకరోజు గవర్నర్‌ భవనం నుంచి ఒక పరిచారకుడు వచ్చాడు. జెన్‌ గురువుకు ఎంతో వినయంగా నమస్కరించి ఒక ఆహ్వాన పత్రిక అందించాడు. దాని మీద ‘కిటగాకి.. గవర్నర్‌ ఆఫ్‌ క్యోటో’ అని రాసి ఉంది.
అది చదివిన వెంటనే కీచు ముఖకవళికలు మారిపోయాయి. ‘అతడితో నాకేం సంబంధం.. ఇలాంటివాళ్లు నాకెందుకు? ఒకవేళ ఆ మహానుభావుడు ఈ మందిరానికి వచ్చి ఉంటే తక్షణం వెళ్లిపోమని చెప్పు’ అంటూ కార్డును ఇచ్చేశాడు.
ఆ మాటలకు పరిచారకుడు ఆశ్చర్యపోయాడు. గవర్నర్‌ నుంచి సందేశం వచ్చిందంటే అందరూ మురిసిపోతారు. ఇతడేంటి ఇలా విడ్డూరంగా ప్రవర్తిస్తున్నాడు- అనుకున్నాడు. కానీ అతడి ఆగ్రహం చూసి మరేం మాట్లాడకుండా అక్కణ్ణించి వెళ్లిపోయాడు. ఇతగాడి అహంకారానికి ఘోర శిక్ష తప్పదులే అనుకుంటూ.. తాను టోఫుకు మందిరంలో అడుగుపెట్టింది మొదలు జెన్‌ గురువు కీచు నిర్వాకం వరకూ అక్షరం పొల్లు పోకుండా చెప్పి పత్రికను గవర్నర్‌ చేతిలో పెట్టాడు.
గవర్నర్‌ కార్డును చూస్తూ ‘ఇది నా తప్పే’ అంటూ ‘గవర్నర్‌ ఆఫ్‌ క్యోటో’ అనే అక్షరాలను పెన్నుతో కొట్టేసి.. ‘ఇప్పుడు మరోసారి ఆహ్వానించు’ అన్నాడు.
పరిచారకుడు ఈసారి కార్డును చేతిలో పెట్టగానే జెన్‌ గురువు హాయిగా నవ్వుతూ ‘ఓహ్‌.. కిటగాకి నన్ను రమ్మన్నాడా?! అతణ్ణి వెంటనే చూడాలనుంది.. పద’ అన్నాడు.

వి.నాగరత్న


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని