ఒకటే కులం

పుట్టపర్తి సాయిబాబా తన భక్తులను ఉన్నతాదర్శాల వైపు మళ్లించేవారు. ఒకసారి ‘పంచభూతాలకు లేని కులాలూ పట్టింపులూ మనకెందుకు? ఉన్నది ఒకే కులం..

Updated : 11 May 2023 01:02 IST

పుట్టపర్తి సాయిబాబా తన భక్తులను ఉన్నతాదర్శాల వైపు మళ్లించేవారు. ఒకసారి ‘పంచభూతాలకు లేని కులాలూ పట్టింపులూ మనకెందుకు? ఉన్నది ఒకే కులం.. అదే మానవత్వం. మానవీయత ఇంకో మెట్టు పైకి చేరితే దైవత్వం. కాకులు, చీమల్లో ఉన్న ఐకమత్యం మనుషుల్లో ఉండటం లేదు. కులం, మతం, ప్రాంతం.. అంటూ విభేదాలు సృష్టించుకోవడమే అందుకు కారణం. మతాలు వేరైనా మార్గం ఒకటే. జీవులు వేరైనా సృష్టి ఒక్కటే. జీవజాతులు ఎన్నున్నా ప్రాణం ఒకటే. పూలు వేరైనా పూజ ఒక్కటే. రూపాలు ఎన్నున్నా దైవం ఒక్కటే. ఇది గ్రహించక బహు బాధలు అనుభవిస్తున్నారు. విశ్వశాంతి, సర్వమత సమానత్వం, జాతీయ సమైక్యతలు సాధించాలంటే కులం అనే మాటను విడిచిపెట్టాలి. కులాల పేరుతో మానవత్వం మర్చిపోతే అది ఉప్పు లేని కూర. కుల రహిత మానవత్వం పంచామృతం. కనుక కులం కాదు గుణమే ప్రధానం. కులాల పట్టింపు లేనప్పుడు ఆశలు పరిమితంగా, ఆశయాలు మహోన్నతంగా ఉంటాయి. స్వార్థ చింతన లేక పరుల శ్రేయస్సే పరమావధి అవుతుంది. కుంచిత పరిధి అంతరించి విశాలత్వం అలవడుతుంది. స్వాభిమానం తగ్గి విశ్వప్రేమకు దారితీస్తుంది. అలాంటి వ్యక్తులు సర్వత్రా పూజనీయులవుతారు’ అంటూ ప్రబోధించారు పుట్టపర్తి సాయి.

ఉమాబాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని