క్షణ క్షణం జాతిరత్నం

జపాన్‌ కమకురాలో ‘కెంచా-జి’ జెన్‌ మందిరం అతి పురాతనమైంది. ఒకసారి జెన్‌ అత్యున్నత గురువు ఆ ఆలయానికి విచ్చేసి, అక్కడి జెన్‌ మాస్టర్‌ టకువాన్‌ ఎదురుగా కూర్చున్నాడు.

Updated : 25 May 2023 00:42 IST

జపాన్‌ కమకురాలో ‘కెంచా-జి’ జెన్‌ మందిరం అతి పురాతనమైంది. ఒకసారి జెన్‌ అత్యున్నత గురువు ఆ ఆలయానికి విచ్చేసి, అక్కడి జెన్‌ మాస్టర్‌ టకువాన్‌ ఎదురుగా కూర్చున్నాడు. టకువాన్‌ ఎలాంటి భావోద్వేగాలకూ లోనవకుండా గురుదేవుడి వైపు ప్రశాంతంగా చూశాడు. గురువుకు ఎందుకో టకువాన్‌ పట్ల పెద్దగా సదభిప్రాయం కలగలేదు. ‘చూడబోతే ఇతడు పనీ పాటా లేకుండా వృథాగా కాలం గడుపుతున్నట్టు తోస్తోంది. మందిరంలో తేరగా తిని కూర్చుని ఉత్తి పుణ్యానికి అందరి మన్ననలూ అందుకుంటున్నాడు’ అనుకున్నాడు నిరసనగా. కొన్ని ప్రశ్నలడిగి ఇతడిలో పరివర్తన తేవాలనుకున్నాడు. ‘ఇదిగో టకువాన్‌! నువ్వు రోజంతా ఎలా కాలక్షేపం చేస్తున్నావో కాస్త చెప్పు’ అంటూ మొదటి ప్రశ్న సంధించాడు. ‘మంచి ప్రశ్నే అడిగారు మాస్టర్‌! అదిగో మీ వెనుక గోడకి వేళ్లాడుతున్న స్లోగన్‌ ఒకసారి చూడండి. అది మాట వరసకు రాసింది కాదు.. నేను అక్షరాలా పాటిస్తూ, ఇక్కడి వారితోనూ అమలుపరుస్తున్న సూత్రం’ అన్నాడు.

గురువు వెనుతిరిగి చూశాడు. ఓ చెక్క పలక మీద.. ‘భూమ్యాకాశాలు తలకిందులైనా ఇప్పుడు మనం జీవిస్తున్న ఈరోజు మళ్లీ రాదు. ప్రతీ నిమిషం అమూల్య జాతి రత్నమే. చేజారితే తిరిగి పొందలేం. కనుక ప్రతీ క్షణాన్నీ ఒడిసిపట్టుకుని లోకశ్రేయస్సు కోసం వినియోగిద్దాం’ అనే అక్షరాలు పొందిగ్గా కనిపించాయి.
తన ఆలోచన ఎంత పొరపాటుగా ఉంది కదా- అని పశ్చాత్తాపం చెందిన గురువు టకువాన్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.

వి.నాగరత్న


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని