ఈ వ్రతంతో సంతాన ప్రాప్తి!

జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షంలోని పన్నెండో రోజును రామలక్ష్మణ ద్వాదశి అంటారు. ఈ ద్వాదశి రోజున చేసుకునే వ్రతం అత్యంత పవిత్రమైంది. త్రేతాయుగంలో అయోధ్య పాలకుడైన దశరథరాజు జ్యేష్ఠ శుక్ల ద్వాదశి నాడు పుత్రుడు జన్మించాలని ప్రార్థించాడు.

Published : 13 Jun 2024 00:44 IST

జూన్‌ 19 రామ లక్ష్మణ ద్వాదశి

జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షంలోని పన్నెండో రోజును రామలక్ష్మణ ద్వాదశి అంటారు. ఈ ద్వాదశి రోజున చేసుకునే వ్రతం అత్యంత పవిత్రమైంది. త్రేతాయుగంలో అయోధ్య పాలకుడైన దశరథరాజు జ్యేష్ఠ శుక్ల ద్వాదశి నాడు పుత్రుడు జన్మించాలని ప్రార్థించాడు. ఆ ప్రార్థన ఫలించి మరుసటి సంవత్సరం చైత్ర మాస నవమి రోజున శ్రీరాముడు జన్మించాడు. అందువల్ల ఈ రోజున భక్తులు పుత్ర సంతానం కావాలని, మోక్షం పొందాలని ఉపవాసం ఉంటారు. షోడశోపచారాలతో శ్రీరామపూజ నిర్వహిస్తారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు సమీపంలోని విష్ణు ఆలయాలను సందర్శిస్తారు. రామ-లక్ష్మణ ద్వాదశిని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఒడిశాలో దీన్ని చంపక ద్వాదశిగా పాటిస్తారు. ఈ పండుగ సందర్భంగా పూరీ జగన్నాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.

రామ-లక్ష్మణ ద్వాదశి వ్రతాచారాలను మొదట వశిష్టముని దశరథ మహారాజుకు వివరించాడు. ఈ వ్రతంలో కుంభ ఏర్పాటు, రామలక్ష్మణ విగ్రహానికి వస్త్ర ఆచ్ఛాదన, షోడశ ఉపచారాలతో పూజించడం, దానాలు ఉంటాయి. ముఖ్యంగా నెయ్యి దానం చేస్తే కోరిన కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయంటారు. ఈ వ్రతంలో ఉపవాసం ముఖ్యమైంది. సంతాన లేమితో బాధపడేవారు, తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, కీర్తి పొందాలని ఆశించేవారు ఈ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతంలో పాలుపంచుకున్న భక్తులు సకల సంతోషాలు, శ్రేయస్సులు పొందుతారు. చివరికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది.

ఏకాదశి వ్రతంతో పోలి ఉండే ఈ వ్రతం.. సూర్యోదయంతో మొదలై మరుసటి రోజు సూర్యోదయంతో ముగుస్తుంది. ఈ రోజున విష్ణువును, తులసిని, లక్ష్మణ సమేతుడైన శ్రీరాముణ్ణి పూజిస్తారు. రామాయణంలోని బాలకాండను పఠిస్తారు.

నూతి శివానందం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని